షైనింగ్‌ సైనీ: విధిని ఎదిరించింది అందాల పోటీలో నిలిచింది | Shree Saini, The First Runner up At Miss World 2021 | Sakshi
Sakshi News home page

షైనింగ్‌ సైనీ: విధిని ఎదిరించింది అందాల పోటీలో నిలిచింది

Published Fri, Mar 18 2022 12:32 AM | Last Updated on Fri, Mar 18 2022 12:32 AM

Shree Saini, The First Runner up At Miss World 2021 - Sakshi

మిస్‌వరల్డ్‌ 2021 రన్నరప్‌ శ్రీసైనీ (ఎడమ)

ఆమెకు డ్యాన్స్‌ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి మిస్‌ వరల్డ్‌ కిరీటం ధరించాలన్న ఆశ. కానీ గుండె సరిగా కొట్టుకోదు, ఓ యాక్సిడెంట్‌లో ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఏమాత్రం దిగులు పడలేదు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ మిస్‌ వరల్డ్‌ రన్నరప్‌గా నిలిచింది శ్రీసైనీ. అమెరికాలోని ప్యూర్టోరికోలో జరిగిన మిస్‌వరల్డ్‌–2021 కాంపిటీషన్‌లో పోలాండ్‌కు చెందిన కరోలినా బిల్వస్కా మిస్‌వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకుంది. భారత్‌ తరపున పోటీపడిన మానస వారణాసి టాప్‌–6లోకి కూడా చేరుకోలేకపోయింది. కానీ భారత సంతతికి చెందిన 26 ఏళ్ల శ్రీసైనీ అమెరికా తరపున మిస్‌ వరల్డ్‌ కిరీటం కోసం పోటీపడి, మొదటి రన్నరప్‌గా నిలవడం విశేషం.

పంజాబ్‌కు చెందిన సంజయ్‌ సైనీ, ఏక్తా సైనీ దంపతులకు 1996 జనవరి 6న లుథియాణలో శ్రీసైనీ పుట్టింది. ఈమెకు షహరోజ్‌ సైనీ అనే తమ్ముడు ఉన్నాడు. సంజయ్‌కు వాషింగ్టన్‌లో గ్యాస్‌ స్టేషన్‌ ఉండడంతో ఆమె కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఐదేళ్ల వయసులో శ్రీసైనీ భారత్‌ వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఇండో అమెరికన్‌గా పెరిగింది. పన్నెండేళ్ల వరకు శ్రీ గుండె స్పందనలు సరిగా లేవు. నిమిషానికి డెభ్బై సార్లు కొట్టుకోవాల్సిన గుండె కేవలం ఇరవై సార్లు మాత్రమే కొట్టుకునేది. శ్రీని పరీక్షించిన డాక్టర్లు ఆమె గుండెలో పూడిక ఏర్పడిందని నిర్ధారించారు.

ఇందుకోసం శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చి ఆమె గుండెను సాధారణంగా పనిచేసేలా చేశారు. మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ను ఎంతో ఇష్టంగా చేసే శ్రీకి పేస్‌మేకర్‌ అమర్చిన తరువాత డ్యాన్స్‌ చేయకూడదని డాక్టర్లు సూచించారు. అయినా వెనక్కు తగ్గలేదు. తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రారంభంలో చిన్నగా డ్యాన్స్‌ ప్రారంభించి, తరువాత రోజుకి ఆరుగంటలపాటు డ్యాన్స్‌ చేసేది. ఇలా ఏళ్లపాటు డాన్స్‌ సాధన చేస్తూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది.బ్యాలే, జాజ్‌ డ్యాన్స్‌లు నేర్చుకుంది.అంతేగాక కాలేజీ హిప్‌అప్‌ టీమ్‌తో కలిసి డ్యాన్స్‌ చేసేది.  
 
ముఖం కాలిపోయినా..
చిన్నప్పటి నుంచి మిస్‌వరల్డ్‌ అవ్వాలనుకునే శ్రీసైనీ, ఆరేళ్లున్నప్పుడే మిస్‌ వరల్డ్‌గా తయారై బాగా మురిసిపోయేది. అప్పట్లో ఆమెకు మిస్‌వరల్డ్‌ అంటే సూపర్‌ హీరోలా కనిపించేది. దీంతో స్కూలు చదువు పూర్తయ్యాక.. వాషింగ్టన్‌ యూనివర్సిటీలో జర్నలిజం డిగ్రీ చేసింది. తరువాత మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. హార్వర్డ్‌ యూనివర్సిటీ, యాలే స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మోడలింగ్‌ కోర్సులు చేసింది. యూనివర్సిటీలో చదువుతోన్న రోజుల్లో అప్పుడు శ్రీకి పంతొమ్మిదేళ్లు ఉంటాయి. ఒకరోజు అనుకోకుండా కారు ప్రమాదం జరిగి ముఖం బాగా కాలిపోయింది. తన ముఖం తనే గుర్తుపట్టలేనంతగా మారింది. అయినా ఏమాత్రం దిగులుపడలేదు. ఎలాగైనా అందాల పోటీల్లో పాల్గొనాలన్న సంకల్పంతో ఏడాదిలోపే కోలుకుని, తన ముఖాన్ని పూర్వంలా అందంగా మార్చుకుంది.  

 అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తొలిసారి 2017లో మిస్‌ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది మిస్‌వరల్డ్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తరువాత 2019లో మిస్‌ వరల్డ్‌ అమెరికా కాంపిటీషన్‌లో పాల్గొన్నప్పటికీ తన హృదయ సంబంధ సమస్యతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్‌ తరువాత 2020లో మిస్‌ వరల్డ్‌ అమెరికా కాంపిటీషన్‌లో పాల్గొని టాప్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నేషనల్‌ విన్నర్, ఏ పర్పస్‌ నేషనల్‌ అంబాసిడర్, పీపుల్స్‌ ఛాయిస్‌ నేషనల్‌ విన్నర్, టాలెంట్‌ ఆడియెన్స్‌ చాయిస్‌ నేషనల్‌ అవార్డు, బ్యూటీ విత్‌ పర్పస్‌ విన్నర్‌ అవార్డులను గెలుచుకుంది. 2021లో మిస్‌వరల్డ్‌ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ఈ కిరీటం గెలుచుకున్న తొలి భారతసంతతి వ్యక్తిగా పేరు పొందింది. ఇటీవల నిర్వహించిన 2021 మిస్‌ వరల్డ్‌ పోటీలలో పాల్గొని టాప్‌–6 కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ వెంట్రుకవాసిలో కిరీటం తప్పిపోయి మొదటి రన్నరప్‌గా నిలిచింది.  
 
మోటివేషనల్‌ స్పీకర్‌గానూ..
పన్నెండేళ్ల వయసు నుంచి మానసిక భావోద్వేగాలపై ఆర్టికల్స్‌ రాసే అలవాటు ఉంది శ్రీకి. తను రాసిన చాలా ఆర్టికల్స్‌ అమెరికన్‌ మీడియాలో పబ్లిష్‌ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆమె చేస్తోన్న సామాజిక సేవాకార్యక్రమాలను ప్రముఖులు ప్రశంసించేవారు. ఎనిమిది దేశాల్లోని వందకుపైగా నగరాల్లో తను ఎదుర్కొన్న అనేక మానసిక సంఘర్షణలను వివరిస్తూ ఎంతోమంది యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతోంది. అందాల రాణిగానేగాక మెంటల్, ఎమోషనల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌గా, మోటివేషనల్‌ స్పీకర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శ్రీసైనీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement