జనాభా.. జనాల అవసరాలూ పెరుగుతున్నాయి! అందుకోసం వనాలను.. పొలాలను.. ఖాళీ స్థలాలను అనువుగా మలచుకోవడమే కరెక్ట్ కాదు! ఆ ఎరుక ఉన్నా అమలు చేసే పరిస్థితి లేదు. దాంతో అక్కడ బతుకుతున్న ప్రాణులు దిక్కు తోచక ఇళ్లల్లోకి వస్తాయి.. వస్తున్నాయి కూడా! విస్తరిస్తున్న నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ.. అటు వన్య ప్రాణులకు.. ఇటు మనుషులకు! పైగా వానాకాలం.. పాముల వంటి సరిసృపాలు కలుగులు, బొరియల్లోంచి బయటకు వచ్చే సమయం..
అవి ఒళ్లు విరుచుకుని కళ్లు తెరిస్తే.. చుట్టూ అంతా కాంక్రీట్ జంగిలే! ఏం చేస్తాయి పాపం.. దిక్కు తోచక ఇళ్లల్లోకి జొరబడ్తాయి.. ఇంటి పరిసరాల్లో తచ్చాడ్తాయి!
మనం భయంతో గెంతులేస్తాం.. సాయం కోసం వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి ఫోన్ చేస్తాం! ఆ సొసైటీ వాలంటీర్స్ దాన్ని పట్టుకుని ఎక్కడో దూరంగా వదిలేస్తారు. ఇలా పామును పట్టుకోవడం... విడిచిపెట్టడం మధ్య పెద్ద ప్రహసనమే ఉంటుంది.
గాయాలైతే ఆ పాముకు వైద్యం చేయడం, విడిచిపెట్టే లోపు అది గుడ్లు పెడితే.. పిల్లలు బయటకు వచ్చేదాకా కంటికి రెప్పలా కాపాడడం, ఆపై అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు అనువైన ప్రాంతంలో పాముల్ని వదలడం.. ఇలా కనిపించని ఘట్టాలు అనేకం ఉంటాయి. వీటన్నింటినీ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లే నిర్వర్తిస్తుంటారు. ఈ సొసైటీ గురించి తెలుసుకుందాం..
ఏటా పది వేలకు పైనే...
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి ప్రతి రోజూ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 100 నుంచి 150 ఫోన్లు వస్తుంటాయి. సరాసరిన ఏడాదికి 10 వేలకు పైగా పాముల్ని రెస్క్యూ చేస్తోందీ సొసైటీ. వీటిలో 50 శాతం నాగు పాములు, 35 శాతం జెర్రిపోతులే. రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణాల వల్ల కొండలు, గుట్టలు, దట్టమైన చెట్లుండే ప్రాంతాలు అంతరించిపోతుండడంతో.. అడాప్టెడ్ రెపై్టల్స్‌గా పిలిచే ఈ పాములు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.
చెత్త, మొక్కలు, రంధ్రాలు, నిర్మాణ సామాగ్రి పడి ఉండే ప్రాంతాలను తమ ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. మనుషులు తమ ఇళ్ల సమీపంలో పడేసే చెత్త, ఆహార వ్యర్థాల కోసం ఎలుకలు, కప్పలు వంటివి చేరతాయి. వాటిని ఆహారంగా తీసుకోవడానికే ఈ పాములు వచ్చి .. కొన్ని సందర్భాల్లో ఇళ్లల్లోకీ చేరుతున్నాయి. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. సాధారణంగా నాగు పాము, జెర్రిపోతు కలసి ఉంటాయనుకుంటారు. కాని అది కేవలం అపోహే. ఈ రెండూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటాయి కాబట్టి ఆ తిండి దొరికే ప్రాంతాల్లో ఇవి తిరుగాడుతుంటాయి.
రాజ్‌కుమార్ కానూరి .. హైదరాబాద్ వాసి. ఒకసారి ఇలాగే నివాస పరిసరాల్లో తిరుగుతున్న సర్పాన్ని కొందరు చంపడం చూసి చలించిపోయాడు. అన్యాయంగా ఓ జీవి మృత్యువాత పడ్డంతో తట్టుకోలేకపోయాడు. మనుషుల నుంచి పాములను... పాముల నుంచి మనుషులను కాపాడ్డానికి ఏదైనా చేయాలనుకున్నాడు. అదే ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’. దీన్ని 1995, జూన్ 30న స్థాపించాడు. జువాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఏమీలేని.. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన రాజ్‌కుమార్ కేవలం పాముల మీదున్న ప్రేమ.. బయోడైవర్సిటీని సంరక్షించాలనే కాంక్షతోనే ఈ సొసైటీని స్థాపించారు.
రాజ్‌కుమార్ 2010 అక్టోబర్ 25న కన్నుమూశారు. తొలినాళ్లల్లో ఆరుగురుగా మాత్రమే ఉన్న వాలంటీర్ల సంఖ్య ప్రస్తుతం 150కి చేరింది. పాముల్ని రెస్క్యూ చేయడం, అవగాహన కార్యక్రమాలు తదితర విధులను నిర్వర్తిస్తుంటారు వీళ్లు. అటవీ శాఖ సహకారంతో ఈ సొసైటీ 2020, జూన్ 5న..మేడ్చెల్ జిల్లా భౌరమ్‌పేటలో స్నేక్ రెస్క్యూ సెంటర్‌నూ ఏర్పాటు చేసింది. పట్టుకున్న పాముల్ని సంరక్షించి. పరిరక్షించడమే దీని లక్ష్యం.
అనుకోకుండా ఇళ్లు, ఇంటి పరిసరాల్లోకి వచ్చిన పాముల్ని చూసిన కొందరు భయంతో వాటిని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని పాములు చనిపోతుండగా, మరికొన్ని గాయపడి రంధ్రాల్లో దాక్కుంటాయి. అప్పుడైనా స్నేక్స్ సొసైటీకి సమాచారం ఇస్తే వాటిని సొసైటీ పట్టుకుంటుంది. గాయపడిన వాటిని జూపార్క్‌కు తరలిస్తుంది. అక్కడి పశువైద్యులతో చికిత్స చేయించి రెస్క్యూ సెంటర్‌కు తీసుకువస్తారు సొసైటీ సభ్యులు. ఆ పాములకు ఎక్స్‌రేలు తీయిస్తారు. వాటి ఒంటిమీద గాయాలుంటే కుట్లు వేసి.. కట్లు కట్టి.. మందులిస్తారు.
రెస్క్యూ... చికిత్స...
మూడేళ్ల క్రితం.. నార్సింగి ప్రాంతంలో ఓ కొండచిలువ మీద నుంచి వాహనం వెళ్లి అది తీవ్రంగా గాయపడింది. దాన్ని.. వాలంటీర్లు రెస్క్యూ సెంటర్‌కు తీసుకువచ్చే సమయానికి అది కేవలం కళ్లు మాత్రమే కదపగలిగే స్థితిలో ఉంది. ఎనిమిది అడుగుల పొడవున్న ఈ కొండచిలువకు దాదాపు ఏడాది పాటు వివిధ రకాలైన చికిత్సలు అందించారు. అప్పటికి గాని అది పూర్తిగా కోలుకుని ఆహారాన్ని వేటాడుకునే స్థితికి చేరుకోలేదు. ఆ తర్వాతే సొసైటీ వాలంటీర్లు దాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
స్నేక్ రెస్క్యూ సెంటర్‌లో ‘ప్రసవాలు’ కూడా జరుగుతుంటాయి. రెస్క్యూ చేసి తరలిస్తున్న సమయంలో కొన్ని పాములు గుడ్లు పెడతాయి. పెట్టిన గుడ్లను సంరక్షించే గుణం లేదు పాములకు. అందుకే రెస్క్యూ చేసి తరలిస్తున్నప్పుడు పాము గుడ్లు పెడితే.. ఆ పామును, గుడ్లను కలిపి ఉంచరు. నిర్ణీత సమయం తర్వాత పామును వదిలిపెట్టి.. గుడ్లను మాత్రం ఇంక్యుబేటర్‌లో పెడతారు. వాటికి కావాలసిన తేమ, వేడి కలగలసిన వాతావరణాన్ని ఆ ఇంక్యుబేటర్‌లో ఏర్పాటు చేస్తారు. ఈ గుడ్లు పిల్లలుగా మారడానికి గరిష్ఠంగా రెండు నెలలు పడుతుంది. ఇలా పుట్టిన పాము పిల్లలకు వారం రోజులు బతకడానికి కావల్సిన శక్తి ఉంటుంది.
ఇంక్యుబేటర్ ద్వారా పిల్లలుగా...
గుడ్డులో ఉంటే యోక్ (పచ్చసొన) ద్వారా ఇది వాటికి వస్తుంది. అప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోవు. ఆ తర్వాతే ఆ పిల్లలు కుబుసం విడిచి.. ఆహారాన్ని వేటాడటం మొదలెడతాయి. అలా ఇంక్యుబేటర్‌లో పుట్టిన పాము పిల్లలను వారం రోజుల్లో అడవిలో విడిచిపెడతారు. ఏ రకం పాములను ఏ అటవీ ప్రాంతంలో వదలాలన్న దానికీ ఓ లెక్కుంటుంది. రాష్ట్రంలోని ఆయా అటవీ ప్రాంతాల్లో కొన్ని రకాల జాతులకు చెందిన సర్పాలే ఉంటాయి. అలాంటి చోట కొత్త వాటిని వదిలితే మనుగడ సాగించలేవు.
ఆ జాబితా ఆధారంగా అటవీ శాఖ అధికారులు ఏ అడవిలో ఏ జాతి సర్పాలను వదలాలన్నది సొసైటీ వాలంటీర్లకు సూచిస్తారు. ఆ ప్రకారమే ఆ పాములను తీసుకువెళ్లి వదులుతారు. అదీ సూర్యోదయం తర్వాత 11 గంటల్లోపు, సాయంత్రం 3–4 గంటల మధ్య మాత్రమే వదులుతారు. ఒక అడవిలో ఒక బ్యాచ్ సర్పాన్ని వదిలిన తర్వాత కనిష్ఠంగా ఏడాది తర్వాతే ఆ ప్రాంతంలో మరో బ్యాచ్ సర్పాన్ని వదిలిపెడతారు. సమతుల్యం కోసమే ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు.
కనిపించేవన్నీ విషసర్పాలు కాదు...
పాముల్లో విషం కలిగినవి, విషం లేనివి ఉంటాయి. హైదరాబాద్‌లో మొత్తం 38 రకాల సర్పాలు ఉండగా... వీటిలో నాగు పాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజర మాత్రమే విష సర్పాలు. దేశ వ్యాప్తంగా ఇవి విస్తరించి ఉండడంతో వీటికి బిగ్ ఫోర్ వీనమస్ స్నేక్స్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 43 రకాల సర్పాలు ఉండగా... తొమ్మిది మాత్రమే విషసర్పాలు. నాగు పాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజరలతో పాటు అరుదైన రకాలుగా పిలిచే ఏటూరునాగారం ప్రాంతంలో ఉండే బంగారు గాజుల కట్లపాము, ఆమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాల్లో నివసించే బాంబూ పిట్ వైపర్, కొత్తగూడెం ప్రాంతంలో కనిపించే స్లెండర్ కోరల్ స్నేక్, ఆంధ్రప్రదేశ్.. కోస్తా ప్రాంతంలో ఉండే సముద్ర పాములు, సాలూరు–మారేడుమిల్లి మధ్య కనిపించే కింగ్ కోబ్రా మాత్రమే విషంతో ఉంటాయి. హైదరాబాద్‌కు సంబంధించి గచ్చిబౌలి–మియాపూర్ మధ్య కొండ చిలువలు ఎక్కువ. ఇక్కడ ఏటా 50 వరకు కొండ చిలువలు రెస్క్యూ అవుతున్నాయి.
వాటి కలయికకూ ఓ సమయం...
సాధారణంగా ఏడాదికి ఒకసారి మాత్రమే మేటింగ్ చేస్తాయి. ఆ సమయంలో ఆడ పాములు ఫెరమోన్స్‌గా పిలిచే ద్రవాలను స్రవిస్తాయి. ఓ రకమైన వాసన కలిగి ఉండే వీటి ద్వారానే ఆడ పాముల ఉనికిని మగ పాములు గుర్తిస్తాయి. కలయిక జరిగిన రెండు నెలల తర్వాత ఆడ పాము గుడ్లు పెడుతుంది. ఈ సమయాన్ని జెస్టేషన్ పీరియడ్‌గా పిలుస్తారు. ఈ గుడ్లు 60 రోజుల తర్వాత పిల్లలుగా మారతాయి. అన్ని పాములూ గుడ్లు పెట్టినా పింజరలు మాత్రం నేరుగా పిల్లల్నే కంటాయి. ఒక్కో పాము గరిçష్ఠంగా 30 గుడ్లు/పిల్లల్ని పెడుతుంది.
పాములు చాలా మితాహారులు...
రెస్క్యూ సెంటర్‌లో ఉన్న పాములకు వివిధ మార్గాల్లో సేకరించిన ఎలుకలు, కప్పలు, బల్లుల్ని ఆహారంగా వేస్తుంటారు. పాములు చాలా మితాహారులు. ఒక్కసారి తింటే వారం–పదిహేను రోజుల వరకు మళ్లీ తిండి వంక చూడవు. కొండ చిలువ ఒక్కసారి ఆహారం తీసుకుంటే మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉండగలదు. నీళ్లను మాత్రం వారానికి ఒకసారి తాగుతాయి. పాములు కోల్డ్ బ్లడెడ్ జీవుల కేటగిరీలోకి వస్తాయి. ఈ కారణంగానే చలికాలంలో మందకొడిగా, మిగిలిన కాలాల్లో చురుకుగా ఉంటాయి. వరుసగా ఎండల తర్వాత వాన వచ్చినా, వానల తర్వాత ఎండ వచ్చినా బయట పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కారణం వాటి శరీరతత్వమే. అలా వాతావరణంలో మార్పుకు అనుగుణంగా అవి తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చి శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటాయి. లేకపోతే వాటి శరీరం సహకరించక తిండి కోసం వేట, తిన్నది జీర్ణం చేసుకోవడం రెండూ సాధ్యం కావు. రెస్క్యూ సెంటర్‌లోనూ వాటికి శరీర ఉష్ణోగ్రతలను సరిచేసుకునే అవకాశం ఇస్తుంటారు.
నాగులపంచమి వాటికి నరకమే...
నాగుల పంచమి నాగు పాములకు నరకమే. పాములు పాలు తాగవు. మనలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇదే మనం తీసుకునే పాలలోని లాక్టోజ్‌ను జీర్ణం చేస్తుంది. అయితే పాముల్లో ఈ ఎంజైమ్ ఉండదు. కాబట్టి వాటికి పాలను జీర్ణం చేసుకునే శక్తీ ఉండదు. ఈ కారణంగానే అవి నీళ్లు తాగుతాయి తప్ప పాలు తాగవు. ఈ సత్యం ఎరుగక ఆ పండగనాడు వాటికి పాలు పోస్తుంటాం. అయితే ఆ రోజు కోసం నాగు పాముల్ని సిద్ధం చేసే వ్యక్తులు వాటిని పట్టుకున్నాక కోరలు పీకేసి, నోరు కుట్టేస్తారు. దాదాపు 10 రోజుల పాటు నీళ్లు, ఆహారం ఇవ్వకుండా పస్తు పెడతారు. ఈ కారణంగానే తీవ్ర ఆకలితో ఉండే ఆ పాములు భక్తులు పోసే పాలను తాగుతాయి. అలా పాలు తాగిన పాముల్లో అనేకం వాంతులు, విరోచనాల సమస్యతో చనిపోతుంటాయి. ఇలాంటి వాటిని రెస్క్యూ చేసే స్నేక్స్ సొసైటీ .. అవి కోలుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వాటికి వైద్యం అందిస్తూ అవి సాధారణ స్థితికి చేరుకునే వరకు చికెన్ పేస్ట్‌ను ఆహారంగా ఇస్తుంది.
విషాన్ని వృథా చేసుకోవు...
ఒంటరి జీవులైన పాములకు గుర్తించే శక్తి, పగ, ప్రేమలాంటి ఫీలింగ్స్ ఉండవు. కేవలం ఆకలి, ఆగ్రహం మాత్రమే ఉంటాయి. ప్రతి పాముకు ఫోర్క్‌టంగ్‌గా పిలిచే చీలికతో కూడిన నాలుక ఉంటుంది. దీన్ని గాలిలో తిప్పుతూ వాతావరణంలో ఉన్న రసాయనాలను సంగ్రహించి.. పై దవడలో రెండు రంధ్రాల మాదిరిగా ఉండే జేకబ్ సెన్స్ ఆర్గాన్‌లో పెడుతుంది. ఆ ఆర్గాన్ రసాయనాలను విశ్లేషించి సమీపంలో ఏ పదార్థం ఉందో చెబుతూ దాని మెదడుకు సంకేతం పంపుతుంది. అలా పాము ఆహారాన్ని గుర్తించి వేటాడుతుంది. చెవుల్లేని పాముకు కాడ్రేట్‌బోన్‌గా పిలిచే ఇంటర్నల్ ఇయర్స్ ఉంటాయి. అయితే ఇవి కేవలం లో ఫ్రీకెన్సీ ధ్వనులను మాత్రమే గుర్తించగలుగుతాయి. మనుషుల మాటలు, నాగస్వరం సహా ఇతర శబ్దాలేవీ వాటికి వినిపించవు.
సర్పాలు షై క్రీచర్స్. ఇవి మనుషులను చూసిన వెంటనే దాక్కోవడానికే ప్రయత్నిస్తాయి. అది సాధ్యం కానప్పుడే పడగ విప్పి, బుసకొడతాయి ఆత్మరక్షణలో భాగంగా. దాన్ని తీవ్రంగా భయపెడితే, గాయపరిస్తే మాత్రమే కాటు వేస్తాయి. నాగు పాము పడగ విప్పకుండానూ కాటు వేస్తుంది. సాధారణంగా ఆహారం వేటాడటానికి వినియోగించే విషాన్ని మనుషులపై ప్రయోగించడానికి ఇష్టపడవు అవి. తప్పనిసరి పరిస్థితుల్లో కాటేసినా చాలావరకు విషం విడుదల చేయకుండా డ్రై బైట్ చేస్తాయి. అందుకే పాము కాటుతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే వైద్యులు యాంటీ వీనం ఇంజెక్షన్ ఇస్తుంటారు. డ్రై బైట్‌తో వచ్చిన వ్యక్తికి ఈ ఇంజెక్షన్ ఇచ్చినా ఎలాంటి ప్రమాదం ఉండదు.
ఒక్కో విషం... ఒక్కో ప్రభావం...
నాగు పాము, కట్ల పాముల్లో న్యూరో టాక్సిక్ విషాలు ఉంటాయి. ఇవి మనుషుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు నరాల మధ్య ఉండే సెల్స్‌ను దెబ్బతీస్తాయి. ఫలితంగా మెదడు జారీచేసే ఆదేశాలు ఇతర భాగాలకు చేరవు. ఈ కారణంగానే అత్యధికులు ఊపిరి అందని సమస్యతో చనిపోతుంటారు. ఈ పాములు కాటు వేసిన చోట వాపు, రంగు మారడం జరుగుతుంది. రక్త పింజర, చిన్న పింజరల్లో హీమో టాక్సిక్ విషాలు ఉంటాయి. ఇవి రక్తకణాలను దెబ్బతీస్తాయి. దీని ప్రభావంతో కిడ్నీ, ఇతర అవయవాలు ఫెయిలయ్యి ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పాములు కరిస్తే తీవ్రమైన నొప్పి, భరించలేని బాధ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాటు వేసిన చెయ్యి, కాలు తీసేయాల్సిన పరిస్థితీ ఏర్పడుతుంది.
వాలంటీర్లకు ఆరు నెలల శిక్షణ...
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీలో వాలంటీర్లుగా చేరేవారికి ఆరు నెలల శిక్షణ తర్వాతే రెస్క్యూకు అనుమతిస్తారు. మొదటి రెండు వారాలు విష, విషం లేని సర్పాల గుర్తింపునకు కేటాయిస్తారు. ఆపై రెండు నెలలు విషం లేని, కరవని (మట్టి పాములు వంటివి) పాములను హ్యాండిల్ చేయడం నేర్పిస్తారు. ఆ తర్వాత విషం లేకపోయినా కరిచే స్వభావం ఉన్న నీటి పాములతో శిక్షణ ఇస్తారు. ఇలా రెండుమూడు నెలల తర్వాత వారి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అప్పుడే పాములను రెస్క్యూ చేయడానికి అనుమతిస్తారు. ఈ వాలంటీర్లకు అనేక సార్లు డ్రై బైట్ సహా పాము కాట్లు తప్పవు. విరాళాలతోపాటు కార్యాలయాలు, స్కూళ్లల్లో ఇచ్చే అవగాహన కార్యక్రమాల ద్వారా వచ్చే నిధులే ఈ సొసైటీకి ఆధారం.
ఎముక విరిగితేనే దీర్ఘకాలం చికిత్స:
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాళ్లు రెస్క్యూ చేసిన పాముల్లో గాయపడిన వాటికి జూలోని ఆస్పత్రిలో చికిత్స చేస్తాం. నాగులపంచమి సందర్భంలో ఇక్కడకు వచ్చే సర్పాలు నోటి గాయాలతో ఉంటాయి. కోరలు పీకేయడం, నోరు కుట్టేయడంతో గాయపడతాయి. మిగిలిన సందర్భాల్లో వచ్చేవి నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్, ఒంటిపై కట్స్, వూండ్స్‌తో ఉంటాయి. పాములకు గాయాలు త్వరగా మానిపోయే గుణం ఉంటుంది.
కాబట్టి వారం రోజుల్లో కోలుకుంటాయి. నోటిని శుభ్రం చేసి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కుట్లు వేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో అంటే వాటి మీద నుంచి వెహికిల్స్ వెళ్లడం, వాటి మీద ఏవైనా వస్తువులు పడటం, మనుషులు కర్రలతో కొట్టడం వల్ల వాటి ఎముకలు విరుగుతాయి. ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఎక్కడో గుర్తిస్తాం. కట్టు కట్టి.. వైద్యం చేస్తాం. ఎముకలు అతుక్కోవడానికి ఒక్కోసారి 45 రోజులు పడుతుంది.
– డాక్టర్ ఎంఏ హకీం, డిప్యూటీ డైరెక్టర్, జూపార్క్
30 నిమిషాల్లో వస్తాం
పాముల్ని చూసి భయపడకండి. చంపకండి. అవి మీ ఇంటి పరిసరాల్లోకి వస్తే మాకు ఫోన్ చేయండి. 30 నిమిషాల్లో వచ్చి రెస్క్యూ చేస్తాం. పాములు అంతరించిపోతే ఎలుకలు, కప్పల సంతతి పెరిగిపోతుంది. దాని వల్లే మనకే నష్టం. మనుషులతో పాటు ఏ జంతువైనా కంటికి కనిపించే ఎలుకలనే చంపుతారు.. చంపుతాయి. పాములు మాత్రమే కలుగుల్లోకి వెళ్లి మరీ ఎలుకల్ని వేటాడుతాయి.
– అవినాష్ విశ్వనాథ్, జనరల్ సెక్రటరీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ
--- శ్రీరంగం కామేష్, హైదరాబాద్ సిటీబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment