దక్షిణాఫ్రికాలో నైజీరియన్ తండ్రికి జన్మించిన చిదిమ్మా అడెత్షినా అందాల కిరిటాన్ని కైవసం చేసుకునేందుకు ఎదుర్కొన్న అడ్డంకులు అవమానాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆమె గుర్తింపు కారణంగా అందాల పోటీ నుంచి చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. ఎంతో మందిని దాటుకుంటూ దక్షిణాఫ్రికా అందాల పోటీల ఫైనల్‌కి చేరుకుంటే. జస్ట్ ఆమె గుర్తింపే జాతీయ వివాదానికి దారితీసి అనర్హురాలిగా చేసింది. ఐతేనేం చివరికి అనుకున్నది సాధించి అందరినోళ్లు మూయించింది. ఐడెంటిటీతో ఏ మనిషి టాలెంట్‌ని తొక్కేయలేమని చాటిచెప్పింది.
వివరాల్లోకెళ్తే..దక్షిణాప్రికాకు చెందిన చిదిమ్మా అడెత్షినా ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో ఫైనలిస్ట్‌గా ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె నైజీరియన్ వారసత్వం పోటీకి అనర్హురాలిగా చేసింది. ఆమె తన తల్లి ఐడెంటిటీతో దక్షిణాప్రికన్‌గా గుర్తింపును తెచ్చుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేగాదు ఈ అందాల పోటీల్లో అడెత్షినా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించకూడదని పలు వాదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే ఆ పోటీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. తన కుటుంబ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ పోస్ట్ పెట్టిన మరుసటి రోజే అందాల పోటీల నిర్వాహకుల నుంచి అడెత్షినాకు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ వేదికపై ఆమె తన తండ్రి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించగలదని పేర్కొన్నారు నిర్వాహకులు. ఆ తర్వాత ఆమె శనివారం (ఆగస్టు 31)న మిస్ యూనివర్స్ నైజీరియాగా అందాల కిరీటాన్ని గెలుచుకుంది. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నా అన్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కిరీటం అందానికి మాత్రం కాదు 'ఐక్యతకు పిలుపు' అని న్యాయ విద్యార్థి అయిన అడెత్షినా గద్గద స్వరంతో చెప్పింది.
"ఈ అందమైన కల చివరికి నిజమయ్యింది. ఈ కిరీటాన్ని ధరించడం ఎంతో గర్వంగానూ, గౌరంవంగానూ ఉంది. ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఎన్నేళ్లుగానో బాధను రగిలిస్తున్న ఆవేదనను పంచుకోవాలనుకుంటున్నా అన్నారు. ఆఫ్రికన్ ఐక్యత గురించి మాట్లాడాలనుకుంటున్నా. మనమంతా శాంతియుత సహజీనంతో మెలుగుతూ మనల్ని వేరుచేసే అడ్డంకులను చేధించుకుందాం. ప్రతి ఆఫ్రికన్ పక్షపాతం లేకుండా స్వేచ్ఛగా బతికేలా ఆ గొప్ప ఖండం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా". అని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది అడెత్షినా.
కాగా, అడెత్షినా నైజీరియన్ తండ్రి, దక్షిణాఫ్రికా తల్లి జన్మించిన మహిళ. మొజాంబికన్ సంతతికి చెందింది. సోవెటోలో జన్మించింది. ఐతే 1995 తర్వాత నుంచిఆ దేశ ప్రభుత్వం దక్షిణాప్రికాలోనే జన్మించిన వారికి లేదా శాశ్వత నివాసికి దక్షిణాఫ్రికా పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఆ నేపథ్యమే అడెత్షినాకి దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో అడ్డంకి మారి తీవ్ర అవమానాల పాలయ్యేలా చేసింది. ఏదైతేనేం చివరికి ఆమె తన కలను సాధించడమే గాక గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయించింది.
Comments
Please login to add a commentAdd a comment