మనిషి ఆశాజీవి. ఉన్నచోట ఉండకుండా కొత్త ప్రదేశాలకు తరలిపోవడం మానవనైజం. ఇదే చరిత్రలో ఖండాల అన్వేషణకు అనంతరం అంతరిక్ష యానానికి కారణమైంది. కానీ వెళ్లిన ప్రతిచోట మనిషి నివాసమేర్పరుచుకోవడం కుదిరేపనేనా? అంటే భూమిపైన కుదిరే పనే కానీ అంతరిక్షం లో కుదరదనే చెప్పాలి. భూమిపై ఎక్కడైనా ఇటుకలు, రాళ్లు, మట్టి, సిమెంటు, సున్నం, గడ్డి, వెదురు ఇలా ఏదో ఒక గహనిర్మాణ అవసర వస్తు లభ్యత ఉంటుంది. కాబట్టి కొత్త ఖండాలు కనుగొన్నా నివాసయోగ్యంగా మార్చుకోవడానికి మనిషికి పెద్దగా శ్రమ కలగలేదు. కానీ అంతరిక్షంలో అలా కుదరదు. వెళ్లిన ప్రతిగ్రహంలో పైన చెప్పిన వస్తు లభ్యత ఉండక పోవచ్చు. అంతెందుకు ఉదాహరణకు చంద్రుడిపై భవిష్యత్ లో కట్టడాలు కట్టాలంటే భూమిపై నుంచి ఇటుకలు మోసుకుపోవాలి, లేదంటే చంద్రుడిపై బట్టీ పెట్టాలి. కానీ ఈ రెండిటితో పనిలేకుండా చంద్రుడిపై మట్టిని బ్యాక్టీరియాతో కలిపి ఇండియన్ సైంటిస్టులు మూన్ బ్రిక్స్‌ను తయారు చేస్తున్నారు. వీటితో ఎంతటి భారీ కట్టడాలనైనా చంద్రుడిపై అవలీలగా కట్టవచ్చట! ఇస్రో, ఐఐఎస్ కలిసి ఈ మూన్ బ్రిక్స్ రూపకల్పన చేశాయి. కొంత చంద్ర మత్తిక, కొన్ని బ్యాక్టీరియా, కొన్ని బీన్స్‌గింజలను ఉపయోగించి ఎంతటి బరువునైనా తట్టుకునే ఇటుకల్లాంటి స్ట్రక్చర్లను తయారు చేసినట్లు బెంగళూరు ఐఐఎస్ తెలిపింది. బయాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ కలబోతతో ఈ కొత్త స్ట్రక్చర్లను ఉత్పత్తి చేశారు.
చాలా చీప్
భూమిపై వనరులు తరిగే కొద్దీ ఇతర గ్రహాలపై ఆవాసానికి మానవుడి ఆతత అధికమవుతోంది. అయితే మనిషి ఆతతకు తగ్గట్లు ఇతర గ్రహాలపై నిర్మాణాలు చేపట్టడం అంత సులభం కాదు. అంతరిక్షంలోకి ఒక పౌండు వస్తువును పంపేందుకు రూ.7.5 లక్షలు ఖర్చవుతుంది. ఈలెక్కన నిర్మాణ సామాగ్రిని పంపాలంటే ఖర్చు లెక్కించలేం! అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా మూన్‌బ్రిక్స్ రూపకల్పన చేశారు. చంద్రుడిపైకి వెళ్లాక అక్కడి మట్టినే ఉపయోగించి తక్కువ శ్రమతో ఇటుకలు తయారు చేయవచ్చని ఇస్రో బృందం తెలిపింది. ప్రయోగంలో తొలుత లూనార్ సాయిల్‌ను స్పోరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాతో కలిపారు. ఈ బ్యాక్టీరియా కాల్షియం కార్బొనేట్ స్ఫటికాలు తయారు చేస్తుంది. ఇందుకోసం యూరియా, కాల్షియం అవసర పడతాయి. ఇవి రెండూ మనిషి విసర్జకాల్లో లభిస్తాయి. అనంతరం ఈ మిశ్రమానికి బీన్స్ జిగురు కలిపారు. ఈ జిగురు సిమెంట్‌లాగా పనిచేస్తుంది. కొన్ని రోజుల ఇంక్యుబేషన్ అనంతరం వచ్చిన ఉత్పత్తి అత్యంత ధఢంగా ఉందని సైంటిస్టులు చెప్పారు. దీన్ని కావాల్సిన అచ్చుల్లో పోసి కావాల్సిన రూపంలో ఇటుకలు తయారు చేసుకోవచ్చన్నారు. పాశ్చురై బ్యాక్టీరియా ఖరీదైనది కాబట్టి దీనిస్థానంలో బాసిల్లస్ వెలెజెన్సిస్ అనే మరో బ్యాక్టీరియాను వాడి మంచి ఫలితాలే పొందామని తెలిపారు. ప్రస్తుతానికి చిన్న అచ్చుల్లో ఇటుకల తయారీ జరిగిందని, ఇకపై ప్రయోగాల్లో భారీస్థాయి ఉత్పత్తికి యత్నిస్తామని చెప్పారు. చంద్రుడిపై వచ్చే చంద్రకంపాలను సైతం ఇవి తట్టుకుంటాయని బల్లగుద్ది చెబుతున్నారు. ఆల్ ద బెస్ట్!
Comments
Please login to add a commentAdd a comment