పాత ఫొటోలు తిరగేస్తుంటాం. ఓ చోట వేళ్లు ఆగిపోతాయ్. ఏళ్లూ ఆగి, వెనక్కు వెళతాయి. ఓ ఐపీఎస్ వేళ్లు అలాగే ఆగాయి. కిరణ్ బేడీ ఫొటోలు పెట్టి..కనుక్కోండి ఎవరో అన్నాడు. ఈజీ పజిల్! ఉత్తేజాన్నిచ్చే పజిల్ కూడా.మనం నింపడం కాదు.. మనల్ని నింపే పజిల్.. బేడీ!
ఒక పౌరుడిగా సోనూ సూద్ ఎలాంటి వారో, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా దీపాంశు కబ్రా అలాంటి వారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆయన. ఈ కరోనా సమయంలో బాధితులకు ఆయన అందించని సహాయమే లేదు. అయితే ఈ స్టోరీ సోనూ సూద్‌ది గానీ, దీపాంశు కబ్రాది గానీ కాదు. సెప్టెంబర్ 15న దీపాంశు రెండు ఫొటోలు జతపరిచిన ఒక ఏకవర్ణ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ వండర్ ఉమన్ ఆఫ్ ఇండియా ఎవరో ఊహించగలరా?’ అని ఆయన ప్రశ్న. ఆమె రాసిన పుస్తకం పేరు ఒకటేదైనా చెప్పమని కూడా ఆయన బ్రెయిన్ టీజర్ ఇచ్చారు. దీపాంశుకు ఇలాంటి పజిల్స్ పెట్టడం అలవాటు. వెంటనే అంతా ఉత్సాహంగా ఆ ‘చెప్పుకోండి చూద్దాం’లో పాల్గొన్నారు.
‘‘సర్.. మళ్లీ ఈజీ క్వొశ్చన్ అడిగారు! కరెక్ట్ ఆన్సర్స్ చెప్పీ చెప్పీ అలసిపోయాను సర్..’’ అని జోక్ చేస్తూ.. ‘‘ఆమె ఎవరో కాదు. ఈ దేశంలోని ప్రతి అమ్మాయికీ, ప్రతి మహిళకు ఇన్‌స్పిరేషన్. ఆమే.. కిరణ్ బేడీ’’ అన్నారు ఒకరు. ‘‘ఇప్పుడీమె పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్నారు’’ అని ఇంకొకరు.మిగతావి ఇలా ఉన్నాయి.
‘‘ఈ ఫొటోలు చూస్తుంటే నా ఒంటి మీద గూస్‌బంప్స్ వస్తున్నాయి సర్.’’
‘‘భారతదేశ తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీ. ఆమె రాసిన ఒక పుస్తకం ‘ఇటీజ్ ఆల్వేస్ పాజిబుల్: ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ తీహార్ ప్రిజన్’’
‘‘తొలి ఐపీఎస్ మహిళా అధికారి మాత్రమే కాదు, టెన్నిస్ చాంపియన్ కూడా’’.
∙∙
కరెక్టే. ఆమె కిరణ్ బేడీనే. తేలిగ్గానే తెలుస్తోంది. నలభై ఐదేళ్ల క్రితం 1975 రిపబ్లిక్ డే పరేడ్‌లో మొత్తం పురుషులే ఉన్న ఢిల్లీ పోలీస్ దళాన్ని కిరణ్ బేడీ ముందుండి నడిపిస్తున్న ఫొటో ఒకటి, ట్రాఫిక్ డీసీపీగా ఏషియన్ గేమ్స్ ఏర్పాట్లకు ముందు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నప్పటి ఫొటో ఇంకొకటి.. ఈ రెండిటినీ కలిపి దీపాంశు కబ్రా పోస్ట్ చేశారు. ప్రత్యేక సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేయలేదు. ట్వీట్ చేయడంతో కిరణ్ బేyీ మళ్లీ సోషల్ మీడియాలో మరొకసారి ప్రాముఖ్యంలోకి వచ్చారు. దీపాంశు ప్రశ్నకు సమాధానంగా.. ‘‘కిరణ్ బేడీ మ్యామ్ చాలా స్ట్రాంగ్’’ అని షాలినీ అనే యువతి కామెంట్ పెట్టింది. అలాగే ఎక్కువ మంది బేడీ రాసిన పదిహేనుకు పైగా పుస్తకాలలో మరొకటి.. ‘వ్హాట్ వెంట్ రాంగ్.. అండ్ కంటిన్యూస్’ని ప్రస్తావించారు. అపరాధుల జీవితాల్లోని నీలి నీడల సంకలనం అది.
1972లో 23 ఏళ్ల వయసులో ఐపీఎస్ సర్వీస్‌లోకి వచ్చిన కిరణ్ బేడి ప్రస్తుతం 71 ఏళ్ల వయసులో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటూనే, నేర స్వభావం గల ఖైదీలను తిరిగి మనుషులుగా మార్చే విధంగా జైలు సంస్కరణలను తీసుకొచ్చారు. తీహార్ జైలు ఇప్పుడు కొంచెం మనిషిగా ప్రవర్తిస్తోందంటే.. జైళ్ల ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా బేడీ తీసుకున్న చర్యల కారణంగానే. ఆ క్రితం వరకు తీహార్‌లో శుభ్రత ఉండేది కాదు. ఖైదీలకు పోషకాహారం పెట్టేవాళ్లు కాదు. జైల్లో మానవ హక్కులన్నవే ఉండేవి కావు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా, యాంటీ టెర్రరిస్ట్ స్పెషలిస్టుగా కూడా మాదక ద్రవ్య సామ్రాజ్యాలపై, తీవ్రవాద కార్యకలాపాలపై బేడీ పట్టు బిగించారు.
కిరణ్ బేడీ అమృత్‌సర్ అమ్మాయి. అక్కడి ఒక కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్ టీచర్‌గా ఆమె కెరీర్ మొదలైంది. తర్వాత సివిల్స్ రాసి ఐ.పి.ఎస్. అయ్యారు. కెరీర్ మొదటి నుంచి కూడా ఆమె ఎంత స్ట్రిక్టుగా ఉండేవారో చెప్పడానికి ఇప్పటికీ ఒక సందర్భం ఉదాహరణల్లోకి వస్తుంటుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ కాన్వాయ్‌లోని వాహనానికే ఆమె రాంగ్ పార్కింగ్ చలాన్ రాశారట! అందుకు శ్రీమతి గాంధీ ఆమెను ప్రశంసించి బ్రేక్ ఫాస్ట్‌కు పిలిచారని కూడా అంటారు. అయితే ఆ పిలవడం అన్నది అప్పుడు కాదు, వేరే సందర్భంలో అంటారు కిరణ్‌బేడీ. అయినా ఈ ఉక్కుమహిళ నుంచి స్ఫూర్తిని పొందడానికి సందర్భాలతో పనిలేదు. అందుకే కదా దీపాంశు ట్విట్టర్‌లో ఈ వండర్ ఉమన్‌ను తలచుకుని, తలపింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment