లీగల్..
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?
తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.
ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్‌పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్‌కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్‌లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.
ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.
చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్‌లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.
– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్
Comments
Please login to add a commentAdd a comment