లీగల్
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.
భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.
నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్).
కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.
‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్
Comments
Please login to add a commentAdd a comment