
వ్యాయామంతో బరువు తగ్గించుకునేందుకు ఇదే అనువైన సమయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వేసవిలో స్లిమ్‌గా మారొచ్చంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే వేసవి ప్రారంభమైంది. జిమ్ చేయడానికి సిద్ధమవుదాం.
నడక ఎంతో ప్రయోజనం
ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక రకాల పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. దీన్ని నడకతో అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది.
సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరమే. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి.
శీతల ప్రాణాయామం
శీతల ప్రాణాయామం చేస్తే కొంత వరకూ ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందడంతోపాటు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కుద్వారా వదిలే ప్రక్రియే శీతల ప్రాణా యామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఆహారం మేలు
పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
శీతల పానీయాలు, షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి.
వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి.
ఇవి పాటిస్తే..
బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం
ఎంతటి భోజన ప్రియులైన వేసవిలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు
వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది
రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని వివిధ రూపాల్గో తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం.
జాగ్రత్తలు తీసుకోవాలి
వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. ఎండలో వాకింగ్ చేయడం మంచిది కాదు. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ ఫిజీషియన్
ఆహార నియమాలు పాటించాలి
వేసవిలో ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, నూనె ఎక్కువుగా ఉన్న వంటకాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి. నీరుశాతం ఎక్కువగా ఉంటే పుచ్చ, కర్బూజ, వంటి పళ్లు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే స్లిమ్‌గా మారొచ్చు.
– గర్రే హరిత, ఆహార నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment