
వారణాసిలో గంగానదీ ఒడ్డున ఒక సత్రం ఉంది. ఆ సత్రానికి ఒకరోజున ముగ్గురు బాటసారులు వచ్చారు. వారు ఉదయం భోజనం ముగించాక సత్రం మధ్యలో ఉన్న చెట్టు కింది రచ్చబండ మీద కూర్చొన్నారు. ఒకరి సమాచారం ఒకరు చెప్పుకున్నారు. వారిలో పొడగరి సుదత్తుడు. అతను అంగరాజ్యం నుండి వచ్చాడు. బట్టతల వాడు సుశీలుడు కోసల రాజ్య వాసి. పొట్టిగా నల్లగా ఉన్నవాడు ధర్మధరుడు. అతను శాక్య రాజ్యం నుంచి వచ్చాడు.
‘‘మిత్రులారా! మన దగ్గర ధనం ఉంది. ఈ ప్రాంతంలో దొంగలు ఎక్కువ. మనం చూస్తూ ఉండగానే మాయం చేయగలరు. కళ్లు గప్పి సొమ్ములు కాజేసుకుపోగల నేర్పరులు.’’ అన్నాడు సుదత్తుడు. ‘‘ఇక్కడ కంటే మగధ రాజ్యం మరీనూ. పట్టపగలే దోపిడీలు చేస్తారు’’ అన్నాడు సుశీలుడు. ‘‘మా రాజ్యంలో ఆ బెడద ఉండదు’ అన్నాడు ధర్మధరుడు.‘‘మా రాజ్యంలో కూడా... మా రాజ్యంలో కూడా’’ అన్నారు మిగిలిన ఇద్దరు! ‘‘నిజమా!’’ అని ప్రశ్నించాడు ధర్మధరుడు.‘‘ఔను మిత్రమా! మా రాజ్యంలో ఇళ్ళన్నీ గట్టి గోడలతో ఉంటాయి. బలమైన తలుపులు ఉంటాయి. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండరు. వస్తువులన్నీ ఎడాపెడా పడవెయ్యరు. పైగా.. రాజభటులు ఎప్పుడూ కావలి కాస్తూనే ఉంటారు.
మన అజాగ్రత్తే దొంగలకు అవకాశం అవుతుంది. మనం నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకుని నేరం దొంగల మీద వేస్తాం’’ అన్నాడు అంగ రాజ్యానికి చెందిన సుదత్తుడు. ‘‘అసలు మా రాజ్యంలో అయితే.. దొంగతనం చేయాలి అంటేనే దొంగలకీ భయమేస్తుంది. దొంగల విషయంలో మా మహారాజుగారు మహా క్రూరంగా వ్యవహరిస్తారు. కఠిన శిక్షలు అమలు చేస్తారు’’ అన్నాడు సుశీలుడు. ‘‘దొంగతనం చేయాలంటే.. దొంగలకి వెన్నులో వణుకు వస్తుంది. అందుకే మా రాజ్యంలో ఇళ్ళకు సరైన తాళాలు కూడా వెయ్యరు. దండం దశగుణం భవత్... అంటూ ముగించాడు సుశీలుడు.
ధర్మధరుడు వాళ్ళిద్దరి మాటలు విని మౌనంగా ఉన్నాడు. ‘‘మిత్రమా! మరి మీ రాజ్యం’’అని అడిగాడు సుదత్తుడు. ‘‘మిత్రులారా! మా రాజ్యంలో మా ఇళ్ళకు తాళాలు ఉండవు.’’ అన్నాడు. ‘అంటే మా రాజ్యం లాగానే అన్నమాట’’ అన్నాడు ఆతృతగా సుశీలుడు. ‘‘కాదు మిత్రమా! ఈ సుదత్తుని రాజ్యంలో ప్రజలు తమ జాగ్రత్తల్లో ఉంటారు. ఇంటికి బలమైన గోడలూ, వాటి చుట్టూ రక్షక వలయాలూ.. ఇతరులకి దొంగతనం చేసే అవకాశమే ఇవ్వరు. కాబట్టి ఆ రాజ్యంలో దొంగతనాలు లేవు. ఇక మీ రాజ్యంలో కఠోరమైన శిక్షలు. కాబట్టి, శిక్షల భయంతో మీ రాజ్యంలో చోరులు లేరు. కానీ మా రాజ్యంలో వేరు. దొంగతనానికి కఠినమైన శిక్షలు లేవు. మా ఇళ్లకూ గట్టి రక్షణలూ లేవు. అయినా దొంగతనాలు జరగవు. కారణం! దొంగతనం చేయాలనే ఆలోచనే ఎవ్వరిలోనూ ఉండదు.
‘శిక్షించబడతాం’ అనే భయంతో కోరికల్ని వదిలిపెట్టకూడదు. భయంతో వదిలే కోరికలు తాత్కాలికమే. ఇక్కడ శిక్షలు లేవు, ఎవ్వరూ చూడడం లేదు’ అనుకుంటే వెంటనే కోర్కెలు తీర్చుకోవడానికి సిద్ధపడతారు. అవకాశం లేకపోవడం వల్లనో, శిక్షల భయం వల్లనో తప్పులకు దూరంగా ఉండటం కాదు... స్వీయ నిగ్రహం వల్ల ఉండాలి. అలా ఉండాలంటే మనస్సులో కామరాగాలు నశించాలి. వాళ్లే వీతరాగులు.
పరుల సొమ్ముని పాములా భావిస్తారు. మనో నిబ్బరంతో ఉంటారు. శీలవంతులుగా జీవిస్తారు. కాబట్టి మా రాజ్యంలో దొంగతనాలు తెలియవు. దొంగలకి శిక్షలు తెలియవు. వారి కోసం చెరసాలలూ లేవు.’’ అన్నాడు. ‘‘ఐతే.. మేము విన్నది నిజమే అన్నమాట’’ మీరందరూ వీతరాగులే’’ అన్నారు మిగిలిన ఇద్దరూ!‘‘అవును.. తథాగత బుద్ధుని బోధనలు పాటిస్తాం. వీతరాగులుగానే జీవిస్తాం’’ అన్నాడు ధర్మధరుడు. అలాంటి మనుషులు, వారి మనస్సులూ దుఃఖాలకి దూరమవుతాయి. అలాంటి మనుషులున్న సమాజం ఆదర్శనీయమవుతుంది. అల్లకల్లోలాలకు దూరమవుతుంది. ఆ సమాజంలో శాంతి తాండవిస్తుంది’’ అంటాడు బుద్ధుడు.
– డా. బొర్రా గోవర్ధన్