అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది! | Tamil Nadu becomes second state after Kerala to establish the right to seat for workers | Sakshi
Sakshi News home page

Tamil Nadu: కూచునే హక్కు మీకు ఉంది...

Published Thu, Sep 30 2021 12:10 AM | Last Updated on Thu, Sep 30 2021 4:09 PM

Tamil Nadu becomes second state after Kerala to establish the right to seat for workers - Sakshi

కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సేల్స్‌గర్ల్స్‌ను అన్నేసి గంటలు నిలబడి డ్యూటీ చేయించడాన్ని నిరోధించాయి. కేరళలో ‘రైట్‌ టు సిట్‌’ ఉద్యమం మొదలయ్యాక వచ్చిన మార్పు ఇది. దేశంలో కోట్లాది మంది స్త్రీలు సేల్స్‌ గర్ల్స్‌గా 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేస్తున్నారు. వారికి కూచునే హక్కు ఉంది. ఆ హక్కు ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంది. మాలతి (20) హైదరాబాద్‌ అమీర్‌పేటలో సేల్స్‌ గర్ల్‌. ఉదయం 9 గంటలకు క్లాత్‌ షోరూమ్‌లో డ్యూటీ ఎక్కుతుంది.

తిరిగి రాత్రి 9కి డ్యూటీ దిగుతుంది. మధ్యలో అరగంట లంచ్‌ విరామం. మిగిలిన సమయం? అంతా నిలబడి ఉండటమే. కస్టమర్లు ఉన్నా లేకున్నా ఆమె నిలబడే ఉంటుంది. కూచోవడానికి వీల్లేదు. ఎందుకంటే కూచోవడానికి అక్కడ కుర్చీలు గానీ స్టూల్స్‌గాని ఉండవు. బద్దకానికి అలవాటు పడతారని లేదా కూచుని సుఖపడతారని షాప్‌ వాళ్లు వారిని కూచోకుండా స్టూల్స్‌ తీసేస్తారు. మాలతి నిలబడే ఉంటుంది. నిలబడి... నిలబడి... నిలబడి... ఆమెకు కూచునే హక్కు లేదా?

జయవాణి (35) నెల్లూరులో ప్రయివేట్‌ టీచర్‌. క్లాస్‌రూమ్‌లో నిలబడే పాఠం చెప్పాలి. బ్లాక్‌బోర్డ్‌ దగ్గర కుర్చీ కానీ టేబుల్‌ కానీ ఉండవు. టీచర్లు తాము ఇచ్చే జీతానికి ప్రతి నిమిషం రెక్కలు ముక్కలు చేసుకోవాలనుకున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలా కాలంగా క్లాస్‌ రూముల్లో కుర్చీలు తీసేశాయి. పాఠం ఎగ్గొట్టి టీచర్లు విశ్రాంతి తీసుకుంటారనో కునుకు తీస్తారనో వారి అనుమానం కావొచ్చు. అయితే క్లాసుకు క్లాసుకు మధ్య గ్యాప్‌ ఇస్తారా? స్టాఫ్‌రూమ్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోనిస్తారా? రోజులో దాదాపు 4 నుంచి 6 క్లాసులు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి క్లాసు నిలబడి చెప్పి చెప్పి జయవాణికి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. కాని ఏమిటి చేయడం. ఆమె నిలబడి చెప్పాల్సిందే. కూచుని పాఠం చెప్పే హక్కు ఆమెకు లేదా?


నిలబడటం పనిలో ఒక భాగం కావచ్చు. కాని నిలబడి ఉండటమే పని కాబోదు. కారాదు. మనిషి కేవలం నిలబడి మాత్రమే పని చేయడు. మధ్యలో విశ్రాంతి కావాలి. కూచోవాలి. కాని కూచుని పని చేయడాన్ని దేశంలో అనధికారికంగా కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో తొలగించి చాలాకాలం అయ్యింది. బట్టల దుకాణాలు, నగల దుకాణాలు, ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లో, ప్రయివేటు పాఠశాలలు... ఒకటేమిటి ప్రయివేటు రంగంలో ఎక్కడ వీలైతే అక్కడ నిలబడి పని చేయించడం ఆనవాయితీ అయ్యింది. ఇంకా దారుణం ఏమంటే కూచుని కనిపిస్తే, తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్తూ కనిపిస్తే కొన్ని షాపుల్లో ‘ఫైన్‌’ వేస్తారు. షాపింగ్‌ మాల్స్‌లో సేల్స్‌ గర్ల్స్‌ చేత, సేల్స్‌ బాయ్స్‌ చేత ఎంత ఊడిగం చేస్తారో వారిని ఎలా నిలబెట్టి పని చేయిస్తారో తమిళంలో ‘షాపింగ్‌ మాల్‌’ అనే సినిమా చూపించింది.

కేరళలో కదలిక
దేశంలో బట్టల షోరూమ్‌లలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది సేల్స్‌గర్ల్స్‌గా/సేల్స్‌మెన్‌గా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా. వీరిలో దాదాపు 70 శాతం యువతులు, స్త్రీలు ఉంటారు. వీరందరూ రోజుకు 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేయాలని షోరూమ్‌ల యజమానులు అన్యాపదేశంగా సూచిస్తారు. కస్టమర్లు ఒకరి వెంట ఒకరుగా రావడం వల్లగాని లేదా స్టూల్స్‌ లేకపోవడం వల్లగాని వీరు కూర్చునే వీలు లేదు. నీరసం ఉన్నా, పిరియడ్స్‌లో ఉన్నా, నిలబడే శక్తి లేకున్నా వీరు నిలబడి ఉండాల్సిందే.

దీని వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అరికాళ్లు, మోకాళ్లు బాధిస్తున్నాయి. దాంతో 2018లో ‘రైట్‌ టు సిట్‌’ అని కూచునే హక్కు కోసం అక్కడ కొంతమంది సేల్స్‌ గర్ల్స్‌ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి డిమాండ్‌లో సబబును గ్రహించింది. 2019 జనవరిలో కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్లలో పని చోట ఉద్యోగులందరూ తప్పనిసరిగా కూచునే ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ‘కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌’ను సవరించింది. దేశంలో ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ పలికిన తొలి రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది.

ఇప్పుడు తమిళనాడులో
మొన్నటి సెప్టెంబర్‌ 13న తమిళనాడు అసెంబ్లీలో కూడా ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘తమిళనాడు షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ – 1947’ను సవరించింది. ఏ షాప్‌ అయినా షోరూమ్‌ అయినా ప్రయివేటు ఉపాధి స్థలం అయినా ఉద్యోగులు కూచునే ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని యజమానులను ఈ సవరణ ఆదేశిస్తుంది. కూచుంటే ఎక్కడ యజమాని తిడతాడో అని భయపడాల్సిన అవసరం ఇక మీదట లేదు.

రెండు రాష్ట్రాలే... మిగిలిన దేశంలో?
అయితే ఇది మొదలు మాత్రమే. దేశంలో ఇంకా ఎంతో కదలిక రావాల్సి ఉంది. ఆయా ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించాల్సి ఉంది. ఉద్యోగిని నిలబెట్టి ఉంచడం ఆ ఉద్యోగి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం. అవమానించడం. బాధించడం. అనవసర శ్రమకు, ఒత్తిడికి గురి చేయడం. గౌరవంతో కూడిన పని చేసే హక్కు, గౌరవాన్ని పొందుతూ పని చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని అంటాం. కాని వందలాది దుకాణాల్లో వేలాది సేల్స్‌ ఉమెన్, రిసెప్షనిస్ట్స్, టీచర్లు, ఇతర ప్రయివేటు ఉద్యోగులు ఎందుకు నిలుచుంటున్నారో... అంత నిలబడాల్సిన అవసరం ఏమిటో ఆలోచించాల్సి ఉంది. అవును. ‘కూచుని పని చేసే హక్కు’ ప్రతి ఒక్కరికీ ఉంది.

చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement