ఇడ్లీ సంత(ఫొటో: డైలీతంతీ)
రాగి ఇడ్లీ.. రవ్వ ఇడ్లీ.. నెయ్యి ఇడ్లీ.. కాంచీపురం ఇడ్లీ... జయలలిత ఇడ్లీ.. పూల సంతలాగా పండ్ల సంతలాగా ఇడ్లీల హోల్‌సేల్ సంత. తమిళనాడు ఈరోడ్‌లోని కరుంగల్ పాళ్యంలో దాదాపు స్త్రీలే నడిపే 35 హోటళ్ల సంత ఇది. రోజుకు 10 వేల ఇడ్లీలు అమ్ముతారు. పెళ్లిళ్ల సీజన్‌లో 40 వేల ఇడ్లీలు. నలభై ఏళ్ల క్రితం ఇద్దరు స్త్రీలు మొదలెట్టిన ఈ సంత నేడు దాదాపు స్త్రీల చేతుల మీదుగానే నడుస్తోంది. స్త్రీల చేతుల్లో తయారవుతున్న మల్లెపూల వంటి ఇడ్లీల విజయగాథ ఇది.
రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పసుపు కొనడానికి వర్తకులు ఈరోడ్‌కు వస్తారు. తమిళనాడులోని పెద్ద ఊరు అది. ఆ వర్తకం పని అయిపోతుంది. ఉదయాన్నే ఆటో మాట్లాడుకుని 150 రూపాయలు ఇచ్చి అక్కడికి 14 కిలోమీటర్లు ఉన్న కరుంగల్ పాళ్యానికి మరుసటి రోజు పొద్దున్నే వస్తారు. అక్కడ ఇడ్లీ సంత ఉంటుంది. ఉదయం 5 నుంచి తొమ్మిదిన్నర లోపు ముగిసిపోయే సంత. అనుక్షణం వేడి వేడి ఇడ్లీ ఈలోపు. రెండిడ్లీ 7 రూపాయలు. 150 ఖర్చు పెట్టుకొని మరీ వచ్చి ఆ ఏడు రూపాయల ఇడ్లీ తింటారు. కరుంగల్ పాళ్యం ఇడ్లీ అంటే అంత రుచి. అంత డిమాండ్.
ఊళ్లో పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంటుంది. తమ కార్యకర్తల కోసం 200 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్ కరుంగల్ పాళ్యంకు వెళుతుంది. ఇంట్లో శుభకార్యం ఉండి బంధువులు వస్తారు. టిఫిన్‌కు వంద ఇడ్లీలు అవసరం అవుతాయి. కరుంగల్ పాళ్యంకు వెళితే రెడీ. పెళ్లి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌లో పొంగల్, ఉప్మా మనం వొండుకుంటాం. ఇడ్లీ మాత్రం కరుంగల్ పాళ్యం నుంచి రావాల్సిందే. ఇంకా విశేషం ఏమిటంటే ఈరోడ్‌లో చాలా పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఇవి ఉదయాన్నే కరుంగల్ పాళ్యం నుంచి హోల్‌సేల్‌లో ఇడ్లీ తెచ్చుకుని తమ చట్నీ, సాంబారులతో కస్టమర్లకు రెట్టింపు రేట్‌కు అమ్ముకుంటాయి.
కరుంగల్ పాళ్యంలో రోజుకు ప్రతి ఉదయం 6 నుంచి 9 లోపు పదివేల ఇడ్లీలు అమ్ముతారు. ఎలక్షన్లు ఉన్నా, పెళ్ళిళ్ల సీజన్ అయినా ఈ సంఖ్య నలభై వేలు. మొత్తం 40 లోపు వరుస షాపులున్నాయి అక్కడ. మొత్తం స్త్రీలే నిర్వహిస్తారు. మగవాళ్లు సహాయం చేస్తారు. ఇడ్లీ ఉడికే పాత్రల్లో ఒకే సమయంలో ఇద్దరు ఆడవాళ్లు పిండి నింపడం ఇక్కడే చూస్తాం. ఇలాంటి ఇడ్లీ సంతను కూడా ఇక్కడే చూస్తాం.
విఫలం నుంచి విజయం వైపు
నిజానికి ఇది ఒక వైఫల్యం నుంచి మొదలైన విజయగాథ. నలభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నేత పని కార్మికులు జీవించేవారు. ఆ సమయంలోనే ఈరోడ్‌లో మిషన్ క్లాత్ ఉత్పత్తి మొదలైంది. దాని దెబ్బకు నేత పని మూలపడింది. శ్రీరంగన్ అనే నేత కార్మికుడు ఎడ్ల బండి మీద సరుకులు వేసే కూలీగా మారాడు. ఇది అతని భార్య చెల్లమ్మాళ్‌ను బాధించింది. ఆమె అతనికి సహాయంగా నాలుగు డబ్బులు సంపాదించడం కోసం ఇంటి ముంగిట్లో ఉదయాన్నే ఇడ్లీలు వేయడం మొదలెట్టింది. ఆ రోజుల్లో ఆ ప్రాంతం పల్లె. ఎవరూ ఉదయం టిఫెన్ ఇడ్లీ తినేవారు కాదు.
కాని చెల్లమ్మాళ్ చుట్టుపక్కల డాక్టర్లను కలిసింది. జబ్బు చేసిన వారిని ఉదయం ఇడ్లీ తినమని డాక్టర్లు చెప్పడం అప్పుడే మొదలైంది. ‘మా షాపు గురించి చెప్పండయ్యా’ అని చెల్లమ్మాళ్ వారిని కోరితే వారు సరేనన్నారు. అలా ఆమె ఇడ్లీలకు గిరాకీ మొదలైంది. ఆ సమయంలోనే మరో నేత కార్మికుని భార్య ధనపకియం కూడా ఇడ్లీ వేయడం మొదలెట్టింది. కాలక్రమంలో అక్కడి ఇడ్లీల రుచికి టౌన్ నుంచి వెతుక్కుంటూ రావడం మొదలెట్టారు. చెల్లమ్మాళ్‌కు ఐదుగురు కూతుళ్లు. అందరూ పెళ్లిళ్లు అయిన వెంటనే ఇడ్లీ అంగళ్లు తెరిచారు. ధనపకియం బంధువులు... అంతా కలిసి దాదాపు 40 అంగళ్లుగా అవి ఎదిగాయి. రుచికరమైన ఇడ్లీ తక్కువ ధర... ఈ మంత్రంతో వారు గెలిచారు.
కరుణానిధి నుంచి జయలలిత వరకు
ఈరోడ్‌కు రాజకీయ నాయకుడు ఎవరు వచ్చినా లేదా ఆ దారి మీదుగా వెళుతున్నా ఉదయాన్నే కరుంగళ్ పాళ్యం ఇడ్లీ తెప్పించుకుని లేదా ఆగి తినాల్సిందే. కరుణానిధి, జయలలిత ఇలా తిన్నవారిలో ఉన్నారు. సినిమాస్టార్లు, వర్తకులు, సామాన్యులు వారూ వీరూ అని లేదు. ఇక్కడ కూడా సీజన్‌ను బట్టి కొత్తరకం ఇడ్లీని తయారు చేస్తారు. తమిళనాడులో కుష్బూ ఊపు మీద ఉన్నప్పుడు ‘కుష్బూ ఇడ్లీ’ అమ్మారు. జయలలిత పేరుతో కూడా ఇడ్లీ ఉంది.
‘మేము అరిటాకులో చుట్టకుండా ఇడ్లీ ఇవ్వం’ అని ఇక్కడ 30 ఏళ్లుగా ఇడ్లీ అమ్ముతున్న మల్లిక అంది. ‘నాన్‌స్టిక్ ఇడ్లీ గిన్నెల్లో కొంతమంది ఇడ్లీలు ఉడికిస్తారు. కాని మేము సంవత్సరాలుగా తడి గుడ్డ మీదే ఇడ్లీ ఉడకబెడతాం. అందుకే మా ఇడ్లీ రుచి’ అని మరొకామె అంది. ఈరోడ్ చుట్టుపక్కల ఉత్సవాలు, వేడుకలు, తిరునాళ్లు జరుగుతుంటే కరుంగళ్ పాళ్యం నుంచి టీమ్‌లు అన్ని సరుకులు, గిన్నెలు ట్రాలీలో వేసుకుని అవసరమైతే ఐదు పది రోజులు ఉండి ఇడ్లీలు అమ్ముతాయి. వీళ్లొచ్చి స్టాల్ పెట్టారంటే ఆ ఉత్సవానికే గ్లామర్ వస్తుంది.
తినేవారి పక్షం
అయితే వీరికి కూడా కష్టాలు లేకపోలేదు. వంట చెరుకు, వంట నూనె, గ్యాస్ సిలిండర్, మినప్పప్పు ధరలు పెరిగినప్పుడల్లా వీరి ఆదాయానికి గండి పడుతుంది. కస్టమర్ కోసం వీరు వెంటనే ఇడ్లీ రేటు పెంచరు. క్వాలిటీ తగ్గించరు. ‘ఏం చేస్తాం... కస్టమర్లను వదులుకోలేము కదా’ అంటారు.
కరుంగళ్ పాల్యం స్త్రీలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరి ఆడపిల్లలకు దిగులూ చింతా లేదు. పెళ్లి అవడంతోటే అల్లుడు ఇక్కడికే వచ్చి ఒక ఇడ్లీ షాపు తెరుస్తాడు. దూరంగా తల్లి, దగ్గరలో కూతురు ఉదయాన్నే హడావిడిగా ఇడ్లీలు పొట్లాలు కట్టే మనోహర దృశ్యం ఇక్కడే కనిపిస్తుందంటే నమ్మండి. ఎప్పుడైనా ఈరోడ్‌కు వెళితే ఈ ఇడ్లీల సంగతి మర్చిపోవద్దు.
చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం!
Comments
Please login to add a commentAdd a comment