దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అంతటా వ్యాపించి ఉన్న భగవానుడు మనకోసం ఒక రూపంలో ఒదిగిపోయి దివి నుంచి భువికి దిగి వస్తే, దాన్ని అవతారం అంటారు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మానవ జీవితానికి అతి దగ్గరగా ఉండే అవతారం రామావతారం. చైత్ర శుద్ధ నవమి రోజు, లోకాలన్నిటి చేత నమస్కరింపబడే రాముడు ఈ భూమి మీద జన్మించాడు.
పుట్టింది మొదలు ధర్మాన్నే అనుసరించాడు. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం... ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. నేడు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా... ఆ పరిపూర్ణ పురుషోత్తముడి గురించి తెలుసుకుందాం.
అప్పటికి కౌసల్యాసుతునికి పదిహేను పదహారేళ్ల వయసుండొచ్చు. ఒకానొక రోజు దశరథమహారాజు రాముణ్ణి పిలిచి విశ్వామిత్ర మహర్షివైపు చూపిస్తూ ‘‘ఈ మహర్షితోపాటు నువ్వు అడవులకు వెళ్లాలి నాయనా...’’ అని అంటాడు. మరో పిల్లాడయితే ఏమనేవాడో ఏమో కానీ, రాముడు మాత్రం తండ్రి చెప్పాడు కాబట్టి కిమ్మనకుండా బయలుదేరాడు. అనుగు సోదరుడు లక్ష్మణుడు తోడు రాగా అడవుల్లోకి దారితీశాడు. తాటక సంహారం చేశాడు. అహల్యకు విమోచన ప్రసాదించాడు. రాముడు ఎంతటి క్రమశిక్షణ కలవాడంటే అంతఃపురంలో ఉన్నంత కాలమూ కన్నవారి మాట జవదాటలేదు. అరణ్యాల్లో ప్రవేశించాక విశ్వామిత్రుని ఆజ్ఞ మీరలేదు. సీతాస్వయంవరానికి తీసుకువెళతానని ఆ గురువర్యుడంటే∙మారు మాట్లాడకుండా అనుసరించాడు.
పెద్దల మాటకే ప్రాధాన్యం
జనకమహారాజు నెలకొల్పిన స్వయంవరమంటపంలో శ్రీరాముడు అడుగుమోపినా శివధనుస్సు ఉండే చోటికి హడావుడిగా వెళ్లిపోలేదు. దాన్ని భళ్లున ఎత్తేసి, ఫెళ్లున విరిచేసి, చేతులు దులిపేసుకోలేదు. ఎలాంటి తొందరపాటూ పడకుండా సభాభవనంలో నిమ్మళంగా కూర్చున్నాడు. శివధనువును ఎత్తాలంటూ విశ్వామిత్రుడు అనుజ్ఞ ఇచ్చాకనే రాముడు ఆ పనికి పూనుకున్నాడు. ధనస్సును సున్నితంగా ఎత్తిపట్టుకుని, నారి సారించి, విరిచాడు.
ఇదంతా ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా చేశాడు. అంత పెద్దపనీ పూర్తిచేశాక ధీర గంభీరంగా అడుగులు వేస్తూ తన ఉచితాసనానికి చేరుకున్నాడు. చిన్నపాటి విజయాన్ని సాధిస్తేనే మురిసి మెరిసిపోయే మనం, ఆ సందర్భాన రాముడి వర్తన నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో. చిన్న కష్టానికే కన్నీరొలికించడం. అల్పమైన సుఖాలకే అతిగా స్పందించడం.. లాంటి లక్షణాలను మరెంత సునాయాసంగా తొలగించుకోవచ్చో!
వినయ విధేయతలు
తొందరపాటు...తొట్రుపాటు అనేవి రాముడి నిఘంటువులోనే లేదు. శివధనువును విరవగానే సీతను రాముడికిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పిన మాట విని ఎగిరి గంతేయలేదు. వెంటనే సీత మెడలో మూడు ముళ్లూ వేసేయలేదు. జనకుని ప్రతిపాదనను తన కన్నవారికి తెలియజేయాలని, అందుకు వారి అనుమతి అవసరమనీ వినమ్రంగా చెప్పాడు. ఎవరి పట్ల ఏవేళ ఎలా ఆదరం చూపాలో రామునికి బాగా తెలుసుననడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. అలా ఆ పెద్దలందరి సమక్షంలోనూ మైథిలి చేయి అందుకున్నాడు.
సీతారాముల కళ్యాణం జరిగి ఎంతోసేపు అవనే అవదు. పరశురాముడు వేంచేశాడు. పెళ్లివేదిక వద్దకు వస్తూనే ఆ మహాశయుడు వీరావేశాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలో రాముడంటే పరశురాముడేనని, మరో రాముడికి లోకాన చోటు లేనేలేదని వీరవిహారం చేశాడు. అటు జనకుడు, ఇటు దశరథుడు పరశురాముని క్రౌర్యాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. అయితే రాముడు ఏమాత్రం తొందరపడలేదు. పరశురాముడు ఎంతగా పేట్రేగిపోతుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉన్నాడు. పరశురాముడు అందించిన విష్ణుధనువును సునాయాసంగా పైకెత్తాడు. తను శ్రీహరి ప్రతిరూపమని చెప్పకనే చెప్పాడు. దీంతో పరశురాముడికి కమ్మిన పొరలు తొలగిపోయాయి.
తారుమారైనా...
మర్నాడు పొద్దున్నే పట్టాభిషేకం జరగాల్సి ఉంది. రాత్రికి రాత్రే కథ మారిపోయింది. కైకమ్మ స్వయంగా పిలిచి, తన మాటల్ని దశరథుని ఆదేశాలుగా వినిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసం చేయాలని ఆజ్ఞాపించింది. మారు తల్లి మాటలను మన్నించాడు. అడవుల్లోకి పోయేందుకు సిద్ధమేనంటూ అందుకు రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. మంగళస్నానాలు చేసి రాజదండాన్ని చేపట్టాల్సిన వేళ పత్నినీ, సోదరునీ వెంటబెట్టుకుని గుహుని పడవమీద నది దాటుకుంటూ పోయాడు.
అడవుల్లోనూ ఆ రామునికి ప్రశాంతత లేనే లేదు. కష్టాలూ కన్నీళ్లే! సీతమ్మను రావణుడు అపహరించుకుపోయాక మానసికంగా నలిగిపోయాడు. చివరికి లంకలో అమ్మవారు ఉన్నారన్న సంగతి తెలిసి కొంత స్థిమితపడ్డాడు. తన ప్రియపత్నిని తన వద్దకు తెచ్చుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. వానరసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విభీషణునితో చెలిమిచేశాడు. ఓరిమితో వ్యవహరించాడు. తగిన సమయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. సముద్రం మీద సేతువును నిర్మించాడు. అందుబాటులో ఉన్న వానర సేన సహకారంతోనే అమిత బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేశాడు. విజేత తానే అయ్యాడు.
స్థితప్రజ్ఞావంతుడు
దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాస క్లేశాలు ముదిరిపోయాయి. సరసరాజాన్నభోజనాల స్థానంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు. అయినా చలించలేదు. స్థిరంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. మరి ఇప్పటికాలాన మనం ఎలా ఉన్నాం..? బస్సు దొరక్కపోతే ఆందోళన. సినిమా టికెట్టు అందకపోతే అశాంతి. పరీక్షలో మార్కులు తక్కువయితే ఆవేదన. అన్నింటికీ తొందరే. ప్రేమ తొందర. పెళ్లి తొందర. ఇలా అయితే ఎలా.
రాముని వంటి వారినే కష్టాలు కాల్చుకు తిన్నాయి. అన్నింటినీ ఆయన ఓపిగ్గా ఎదుర్కొన్నాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతటి వారం? ఆయన పడ్డ కష్టాలతో పోల్చి చూసుకుంటే మన కష్టాలు ఏపాటివి?ఎప్పటి త్రేతాయుగం? రాముడు పుట్టి రెండు యుగాలయింది. మనమిప్పుడు కలికాలంలో ఉన్నాం. అయినా ఆ ఆదర్శనీయుణ్ణి నేటికీ మరువలేకపోతున్నాం. అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే మానవుడిగా పుట్టినా, రాముడు మనకు దేవుడయ్యాడు. ఆయన నడిచిన బాట అయిన రామాయణం పఠనీయ కావ్యం అయింది. అందుకే రామాయణాన్ని పారాయణం చేయాలి. అందులోని మంచిని
ఒంటబట్టించుకోవాలి.
కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది
చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరువని సద్గుణ సంపన్నత రామునిది. అందుకే సీతమ్మ జాడతెలుసుకున్న ఆంజనేయస్వామిని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. తన ప్రేమను పంచాడు. సుగ్రీవుడికి పట్టం కట్టాడు. విభీషణునికి లంకేశునిగా మకుటం తొడిగాడు.
..జననీ జన్మభూమిశ్చ..
రావణ సంహారం జరిగాక ఆ రాక్షస రాజు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించాడు. విషయాన్ని అన్నతో చెప్పాడు. యావత్ లంకానగరమే మణిమయ నిర్మితమైనది. అందులోని రాజ సౌధం సామాన్యమైంది కాదు. ఎటు చూసినా బంగారమే.
కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ఆయన ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు. అంటే పరాయి ప్రదేశం ఎంతటి గొప్పదైనా, సుందరమైనదైనా దానిని చూసి మనసు పారేసుకోలేదు. మాతృభూమిని మరువలేదు. పుట్టిన గడ్డపై ప్రేమను పోగొట్టుకోలేదు.
రామ నైవేద్యం
పానకం
కావలసినవి: బెల్లం పొడి– పావు కేజీ; నీళ్లు– లీటరు; యాలకుల పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; శొంఠిపొడి– చిటికెడు
తయారీ: బెల్లం పొడిలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠిపొడి కలిపితే పానకం రెడీ.
వడపప్పు
కావలసినవి: పెసరపప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి ముక్కలు – టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్; మామిడి కాయ తురుము– టేబుల్ స్పూన్
తయారీ: పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. గింజ మెత్తబడిన తర్వాత నీటిని వంపేసి అందులో పైన తీసుకున్న దినుసులన్నీ కలిపితే వడపప్పు రెడీ.
వడపప్పు, పానకం ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. వేసవి మొదలైన ఈ సమయంలో ఆరోగ్యం ఒడిదొడుకులను పానకం నివారిస్తుంది. యాలకుల పొడి అతిదాహాన్ని తగ్గిస్తుంది.
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment