
కోట దసరా పండుగ రాజస్థాన్ రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశంలోనే గుర్తించదగిన వేడుక. కోట నగరం, దసరామేళా మైదాన్‌లో 25 రోజుల పాటు జరిగే ఈ వేడుక దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకే చోట చేరి పండగ చేసుకుంటున్నట్లు ఉంటుంది. విజయదశమి రోజున రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలను కాల్చివేయడంతో పూర్తవుతుంది. టపాకాయలు నింపిన బొమ్మల మీదకు రాముడి వేషంలో ఉన్న ఓ కుర్రాడు అగ్ని బాణం వేస్తాడు. దాంతో టపాకాయలు పేలుతూ బొమ్మలు మూడూ కుప్పకూలిపోతాయి.
ఈ వేడుకను చూడడానికి లక్ష మందికి పైగా వస్తారు. అన్ని రోజుల వేడుకలకూ కలిపి పదహారు లక్షలకు పైగా వస్తారు. కోట దసరా వేడుకలకు దేశం నలుమూలల నుంచి కళాకారులను ఆహ్వానించి ఆయా ప్రదేశాల సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో కవి సమ్మేళనాలు, భజన గీతాలాపనలు, సింధీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటె బండి సవారీలు, సంగీత కచేరీలు, జానపద కళలు, నాట్యరీతులు... ఇవీ అవీ అనే తేడా లేకుండా అన్ని దేశంలోని ప్రాంతాల కళలూ ప్రదర్శితమవుతాయి.
దసరా సందర్భంగా పదిహేను వందల స్టాల్స్ వెలుస్తాయిక్కడ. కళాకారులు మాత్రమే కాదు... వ్యాపారులు కూడా దేశం నలుమూలల నుంచి వస్తారు. కోటలో దసరా వేడుకలు 1893లో మహారావ్ ఉమేద్ సింగ్ హయాంలో మొదలయ్యాయి, ఈ 127 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే వేడుకలకు అంతరాయం కలిగింది. ఇండో– పాక్ యుద్ధం సందర్భంగా 1971లో బ్లాక్ అవుట్ నేపథ్యంలో వేడుకలు జరగలేదు. గత ఏడాది కోవిడ్ కారణంగా వేడుకలు ఘనంగా జరగలేదు.
చదవండి: Mysore: కాగడాల కవాతు... 4 వేలు పెట్టి విఐపి గోల్డ్‌కార్డ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే!
దసరా ఉత్సవాలు 75 రోజుల ముందే మొదలు