22 అనేది చాలా చిన్న నంబర్ అనిపించొచ్చుగాని అటు 11 మంది ఇటు 11 మంది ఉండేలా 22 మందితో రెండు ఆడపిల్లల క్రికెట్ టీమ్‌లు ఏర్పాటు కావడానికి ఆ ఊరిలో పెద్ద ప్రతిఘటన చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ సమీపంలోని మురైలాపూర్‌లో 10–18 సంవత్సరాల మధ్య ఉన్న ఆడపిల్లలు క్రికెట్ ఆడాలనుకున్నారు.వంట గది గ్రౌండుగా,అంట్లే ఆటవస్తువులుగా పెరిగే అక్కడి ఆడపిల్లలు ఇలా అడగడం గ్రౌండ్‌లో కనిపించడం వింత.‘మగవాళ్ల ఆట’ అయిన క్రికెట్ ఆడటం ఇంకా వింత.కాని బాలికలు దానిని సాధించారు. ఇప్పుడు ఊరే వారికి గ్రౌండ్ శుభ్రం చేసి ‘ఆడుకోండి తల్లులూ’ అంటోంది.
ఆమిర్ ఖాన్ ‘లగాన్’ సినిమాలో ఫక్తు పల్లెటూరి భారతీయులు క్రికెట్ తెలిసిన ఇంగ్లిష్ వారిని క్రికెట్‌లో ఓడిస్తారు పట్టుదలతో. ఆ సినిమా ఒక సంచలనం. ఇటీవల తమిళంలో నిర్మితమై, తెలుగులో రీమేక్ అయిన ‘కౌసల్యా కృష్ణమూర్తి’లో ఒక రైతు కూతురు భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు సంపాదించి ఇంటర్నేషనల్ మేచ్ ఆడే స్థాయికి ఎదగడానికి సంఘర్షణ చేయడం కథ. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని మురైలాపూర్ అనే కుగ్రామంలో ఆడపిల్లలు చేస్తున్నది అంతకు తక్కువ కథ కాదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్న చైతన్య స్థాయి అలాంటిది, ఆడపిల్లల పట్ల వివక్ష అలాంటిది.
అత్తింటి కోసం శిక్షణ
ఉత్తరప్రదేశ్ పటానికి పాదాల దగ్గర ఉండే మిర్జాపూర్‌కు గంట దూరంలో ఉండే మురైలాపూర్ అనే ఏముంది అలాంటి సవాలక్ష గ్రామాల్లో ఆడపిల్లల గురించి ఒకటే ఆలోచన. ఆమెను పెద్ద చేసి అత్తారింటికి పంపడం ఎలా? అనేదే. వంట, అంట్లు, ఊడ్చడం, బట్టలు ఉతకడం, తమ కంటే వయసులో చిన్న అయిన తమ్ముణ్ణో చెల్లెల్నో చూసుకోవడం ఇవి మాత్రమే అక్కడ ఆడపిల్లలు నేర్పిస్తారు. స్కూళ్లకు దాదాపు పంపరు. పంపినా 5వ తరగతి తర్వాత ఆపేస్తారు. అలాంటి ఊళ్లలో కొన్ని ఎన్.జి.ఓలు బాలికా వికాసానికి ప్రయాత్నాలు చేయడం, ప్రభుత్వం కూడా వాటిని ప్రోత్సహించడం జరుగుతోంది. ఢిల్లీలోని ‘బ్రేక్‌త్రూ’ అనే సంస్థ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలను ఎంచుకుని అక్కడ లైంగిక వివక్ష గురించి, గృహ హింస గురించి, బాలికా విద్య గురించి, బాలికల సంపూర్ణ వికాసం గురించి చైతన్యవంతమైన కార్యక్రమాలు మొదలెట్టింది. అది మెల్లగా ఫలితాలు ఇవ్వడం మొదలెట్టింది.
తల్లులతో మొదలు
ఇంటి ఆడపిల్ల స్కూలుకు వెళ్లాలంటే మొదట తల్లిని ఒప్పించాలి. ఆ తల్లి తండ్రిని ఒప్పించాలి. అప్పుడే సాధ్యం. కాని తల్లి సాధారణంగా ఒప్పుకోదు. ఎందుకంటే ఇంట్లో ఉండే చాకిరిని ఇంటి ఆడపిల్ల కొద్దో గొప్పో పంచుకుంటుంది. పిల్ల స్కూల్‌కి వెళితే తను అవస్థ పడుతుంది. అది గమనించిన ఎన్.జి.ఓ కార్యకర్తలు పిల్లలు తల్లుల కోసం చేయాల్సిన పనిని చేసేకే స్కూళ్లకు రమ్మని కోరారు. అలా పిల్లలు మెల్లగా స్కూళ్లకు వచ్చారు. పాఠాలు బుద్ధికి. మరి శరీరానికి? వ్యాయామం కావాలి. ‘ఏవో ఒక ఆటలు ఆడండి’ అంటే ఆ ఊరి ఆడపిల్లలు మాకు క్రికెట్ ఇష్టం. క్రికెట్ ఆడతాం అన్నారు. క్రికెట్ నేర్పించడానికి ఎన్.జి.ఓ కార్యకర్తలు ఉన్నారు. కాని ఆడటానికి ఊరి వాళ్లతోనే సమస్య.
మగవాళ్ల ఆట మీకెందుకు
ఊరి ఆడపిల్లలు దాపున ఉన్న ఖాళీ చేలలో క్రికెట్‌కు దిగారు అని ఊళ్లో తెలిసిన వెంటనే తండ్రులు, అన్నయ్యలు రంగంలోకి దిగారు. ‘ఆడపిల్లలు ఈ ఆట ఎందుకు’ అని తండ్రులు అంటే ‘గ్రౌండ్‌లో దిగితే కాళ్లు విరగ్గొడతాం’ అని ఆ ఆడపిల్లల అన్నయ్యలు బెదిరించారు. ‘అబ్బాయిలు ఆడుతున్నారు కదా మేమెందుకు ఆడకూడదు’ అని అమ్మాయిలు అడిగారు. అంతేనా? తండ్రులకు అన్నయ్యలకు బెదరక అచ్చు సినిమాల్లో లాగా ఒక్కో అమ్మాయిని కలుపుకుంటూ టీమ్‌లు తయారు చేశారు. అయితే రెండు టీములకు అవసరమైన 22 మంది అమ్మాయిలు దొరకలేదు. ఇద్దరు ముగ్గురు తగ్గారు. ఆట ముఖ్యంకాని టీమ్ సంఖ్యదేముంది అని ఉన్నవాళ్లనే రెండు టీమ్‌లకు పంచారు. ఊరి మొత్తం టీమ్‌కు ‘మోర్ని క్రికెట్ టీమ్’ అని పేరు పెట్టారు. మోర్ని అంటే ఆడ నెమలి. ఊరి అమ్మాయి సంజనా చౌహాన్ ఆ టీమ్‌కు కెప్టెన్ అయ్యింది.
ఆట చూసి...
‘మేము గ్రౌండ్లో ఆడతాం. చూసి వద్దంటే చెప్పండి’ అని అడిగారు ఆడపిల్లలు తమ అన్నయ్యలని, తండ్రులని. బ్యాట్లు, వికెట్లు పట్టుకుని, క్రీజ్‌ను గీసి, ఆటకు అనువైన బట్టలు తొడుక్కుని వాళ్లు ఆడుతుంటే చూసిన తండ్రులు, అన్నయ్యలు సంతోషపడ్డారు. తమ ఇంటి ఆడపిల్లల లోపల ఇంత శక్తి, ఆసక్తి, నైపుణ్యం ఉంటుందని వారు అర్థం చేసుకున్నారు. పూర్తిగా ఆడపిల్లలే ఆడుతున్నారు కనుక ఒకరి మధ్య ఒకరికి పోటీ ఏర్పడి ఇంకా బాగా ఆడటం, దాని వల్ల వారి శరీరాలు ఫిట్‌గా మారుతుండటం కూడా గమనించారు. ఇప్పుడు ఆ ఊరి తల్లిదండ్రులు ఈ ఆడపిల్లల ఆటను ఒప్పుకోవడమే కాదు చదువును కూడా అంగీకరిస్తున్నారు. ‘పెళ్లికి తొందరేముంది. చదివేంతగా చదివిద్దాం’ అంటున్నారు.]
ఇప్పుడు మురైలాపూర్ ఆడపిల్లలు చదువుకోడమే కాదు క్రికెట్‌కు సంబంధించి ప్రొఫెషనల్ అకాడమీలలో కూడా చేరాలనుకుంటున్నారు. ‘ఒకరోజు మేము దేశానికి ఆడతాం’ అని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. చిన్న ఊళ్ల నుంచి ఎదిగిన పురుష క్రికెట్ ప్లేయర్ల గాథలు విన్నాం. ఒకనాడు మనం ఈ మోర్ని క్రికెట్ టీమ్ బయోపిక్ కూడా తప్పక చూస్తాం. వారి బ్యాట్ విసురు, బౌలింగ్ గురి అలా ఉంది మరి.
– సాక్షి ఫ్యామిలి
Comments
Please login to add a commentAdd a comment