
‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ సమస్య ఉన్నవారు మూత్రవిసర్జనకు చాలా వేగంగానూ, అత్యవసరంగా వెళ్లాల్సిరావడం, మామూలు ఫ్రీక్వెన్సీతో పోలిస్తే చాలా ఎక్కువ సార్లు బాత్‌రూమ్‌కు వెళ్లడం, మూత్రవిసర్జన ఫీలింగ్‌తో బాత్‌రూమ్‌కు వెళ్లడం కోసం రాత్రిళ్లు మాటిమాటికీ నిద్రలేవడం (నాక్ట్యూరియా), మూత్రం ఆపుకోలేకపోవడం (ఇన్‌కాంటినెన్స్) వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. వైద్యసహాయం లేకుండానే ఈ సమస్యల నివారణకు అధిగమించడానికి మార్గాలివి...
∙జీవనశైలి మార్పుల్లో భాగంగా... దేహానికి అవసరమైనన్ని నీళ్లు మాత్రమే తాగాలి. కొంత పరిశీలన, అభ్యాసం ద్వారా తమకు రోజుకు ఎంత పరిమాణంలో నీళ్లు అవసరమో తెలుసుకోవచ్చు. నీళ్లు తక్కువైనప్పుడు డీహైడ్రేషన్ వల్ల కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) వంటివి కనిపిస్తాయి. ఈ పరిస్థితి రానంత మేర నీళ్లు తాగుతూ తమకు ఎన్ని నీళ్లు అవసరమో గుర్తించవచ్చు.
►నిద్రపోవడానికి రెండు గంటల ముందుగా నీళ్లు తాగాలి.
►పొగతాగే అలవాటు, కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీలూ, కోలాడ్రింక్స్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ను ప్రేరేపిస్తాయి. పైగా ఇవన్నీ సాధారణ ఆరోగ్యానికి కూడా హానికరం కాబట్టి ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి.
►కొన్ని మందులు వాడగానే మూత్రం ముదురు పసుపురంగులోనూ, తీవ్రమైన వాసనతోనూ రావచ్చు. ఇలాంటి మందుల్ని డాక్టర్ సలహా లేకుండా, తమంతట తామే (ఓవర్ ద కౌంటర్) కొని, వాడకూడదు. ఇలాంటి కొన్ని చర్యలతో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ నివారణ/నియంత్రణకు వీలవుతుంది. అయితే ఈ జాగ్రత్తల తర్వాత కూడా సమస్య తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.