"క్రిస్మస్ రోజున శాంటా తాత వస్తాడు. బహుమతులెన్నో తెస్తాడు. శాంటా ఉత్తర ధ్రువం నుంచి వస్తాడని అందరూ అంటారు. కాదు శాంటా మా ఊరి నుంచి వస్తాడు అంటారు ఫిన్‌లాండ్ దేశస్తులు. ఫిన్‌లాండ్‌లోని ‘రొవానియమి’ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ప్రతి క్రిస్మస్‌కు పర్యాటకులు అక్కడకు వెళ్లి శాంటా ఊరు ఇదేనంటూ సందడి చేస్తారు. ఈ ఊరి విశేషాలు చాలానే ఉన్నాయి. పిల్లలకు చెప్తే అబ్బుర పడతారు."
‘జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగల్ ఆల్ ద వే’.. ఎర్రని దుస్తుల్లో, తలమీద టోపీతో, గుబురు గెడ్డంతో, రైన్ డీర్లు లాగే స్లెడ్జ్ బండి మీద, బోలెడన్ని కానుకలు మూటగట్టుకుని క్రిస్మస్ రాత్రి ఆకాశ వీధుల గుండా క్రిస్మస్ తాత వస్తాడని పిల్లలకు ఒక నమ్మకం. క్రిస్మస్ వచ్చే ముందే తల్లిదండ్రులు పిల్లల్ని ‘క్రిస్మస్ తాత ఏం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నావు’ అని అడుగుతారు. కొందరు పిల్లలు ‘ఫలానాది ఇవ్వు’ అని క్రిస్మస్ తాతకు లెటర్లు రాస్తారు. కొందరు పిల్లలు ఇవేవీ అడక్కుండా తమకోసం ఏం ఇస్తాడో చూద్దాం అని ఉత్సుకతతో ఎదురు చూస్తారు.
ఎవరి బాల్యంలో అయినా ఇది అద్భుతమైన జ్ఞాపకం. క్రిస్మస్ తాత అంటూ ఎవరూ రారు అని పిల్లలకు తెలిసినా.. ఏమో వస్తాడేమో అనుకునే అమాయకమైన వయసు అది. వస్తాడేమో అనిపించే ఉత్సుకత ఉండేప్రాయం అది. అందుకే తల్లిదండ్రులు, బంధువులు చిన్నారులు ఉన్నచోట వారు నిద్రపోయాక వారి కోసం తల దగ్గర కానుకలు పెట్టి వెళతారు. పిల్లలు తెల్లారి లేచి వాటిని చూసుకుని ‘శాంటా ఇచ్చాడు’ అని సంబర పడతారు.
శాంటా తాత ఎవరు?
ఇది బైబిల్ పాత్ర కాదు. క్రీ.శ.280 కాలంలో టర్కీలో సెయింట్ నికొలస్ అనే ఒక బిషప్ క్రిస్మస్ పండుగ నాడు పేదవారికి, ముఖ్యంగా పిల్లలకు ఎంతో కొంత సహాయం చేసేవాడట. నిద్రపోతున్న వారి పక్కన కానుకలు, డబ్బు పెట్టి వెళ్లేవాడట. సాక్సుల్లో బంగారు నాణెలు పెట్టి ఇళ్లల్లో పడేసేవాడని అంటారు. పండగంటే ఆనందం పంచడమే కదా. ఇది అందరికీ నచ్చింది. ఇలా ఒక తాత వచ్చి కానుకలు ఇస్తే బాగుండు అనే కోరిక పెరిగింది. మంచి కోరికను తీర్చడానికి ప్రపంచమంతా ముందుకొస్తుంది. అందుకే క్రిస్మస్ తాత అందరి తాత అయ్యాడు. సెయింట్ నికోలస్ కాస్తా శాంటా క్లాజ్ అయ్యాడు.
శాంటా ఊరు..
నిజమైన శాంటా క్లాజ్ టర్కీ వాడైనా కాలక్రమంలో నార్త్‌పోల్ వాడయ్యాడు. దీనికి కారణం 1893–96ల మధ్య థామస్ నాస్ట్ అనే అమెరికన్ కార్టూనిస్టు శాంటా క్లాజ్ బొమ్మలు పత్రికలకు గీసి శాంటా నార్త్‌పోల్ వాడని అడ్రస్ పెట్టాడు. దానికి కారణం ఆ రోజుల్లో నార్త్ పోల్ (ఉత్తర ధ్రువం) ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కనుక దాని చుట్టూ ఒక దైవిక కల్పనలు సాగేవి. సెయింట్స్ అక్కడే ఉంటారని అనుకొని ఉండొచ్చు. అదీగాక అక్కడ ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుంది కనుక క్రిస్మస్ అంటే మంచుకాలం కనుక థామస్ నాస్ట్ ఏకంగా 24 గంటలూ మంచు ఉండే ప్రాతాన్ని శాంటా క్లాజ్ తావును చేసి ఉంటాడు. ఇక అక్కడ రైన్‌డీర్లు ఉంటాయి కాబట్టి వాటిని వాహనంగా మార్చారు.
ఫిన్‌లాండ్ ఊరు..
ఫిన్‌లాండ్ దేశం వారు శాంటా తమ ఊరి వాడేనని ఒక వాదన మొదలుపెట్టారు – పర్యాటక ఎత్తుగడే కావచ్చు. ఫిన్‌లాండ్ ఆర్కిటిక్ సర్కిల్‌లో వచ్చే దేశం కాబట్టి అక్కడ ఎప్పుడూ మంచే కాబట్టి శాంటా ఊరు తమ దేశంలోదే అనుకుని ఉండొచ్చు. అంతటితో ఆగక ‘రొవానిఎమి’ అనే ఊరిని శాంటా ఊరిగా టూరిస్ట్ ఎట్రాక్షన్ చేశారు. ఇక్కడ శాంటా ఇల్లు, శాంటా పోస్టాఫీసు, శాంటా తిరిగే స్లెడ్జ్‌బళ్లు అన్నీ ఉంటాయి. మైనస్ 12 డిగ్రీల చల్లదనం ఉండే క్రిస్మస్ కాలంలో కూడా టూరిస్టులు శాంటా ఊరికి వెళ్లి సందడి చేస్తారు. మత భావనలు పొందుతారు.
ఈ ఊరి వారు శాంటాతో మాట్లాడాలనుకునే పిల్లల కోసం ఒక టెలిఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడి పోస్టాఫీసుకు ప్రతి సంవత్సరం 200 దేశాల నుంచి రెండు లక్షల ఉత్తరాలు శాంటా నుంచి పిల్లలకు వస్తాయి. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులు ఇక్కడి పోస్టాఫీసులో ఉత్తరం రాసి పడేస్తే కరెక్ట్‌గా క్రిస్మస్‌కు అందేలా పంపుతారు. అంటే శాంటా పంపినట్టు పంపుతారు. అదో సరదా. 'శాంటా అబద్ధం కావచ్చు. కాని శాంటా ఉంటాడన్న పిల్లల అమాయక కామన అబద్ధం కాకూడదు. ఈ క్రిస్మస్ రోజున అందరు పిల్లలకూ, ముఖ్యంగా ఆట వస్తువులు లేని పేద పిల్లలకు మీరే శాంటాగా మారండి. హ్యాపీ క్రిస్మస్.
ఇవి చదవండి: ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనమే మేలు.... ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment