గంగేమాం పాహి... అంటూ ముత్తుస్వామి దీక్షితార్ వారు చేసిన కీర్తన చివరి చరణాల్లో. ‘‘..సకల తీర్థమూలే సద్గురు గుహలీలే/వరజహ్నుబాలే వ్యాసాది కృపాలే’’ అంటారు. దీక్షితార్ వారి కీర్తికి ప్రధాన కారణం గంగమ్మ ప్రసాదంగా లభించిన వీణకాగా మరొకటి తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం. సద్గురువు అయిన గుహుడు.. సుబ్రహ్మణ్యుడు గంగానది ఒడ్డున ఆడుకునేవాడని అన్నారు. అక్కడ ఆడుకునేవాడని చెప్పడం వెనుక సుబ్రహ్మణ్య జననం గురించి గుర్తు చేస్తున్నాడు. శివవీర్యం తేజస్సు భరించలేని దేవతలు దానిని అగ్నిహోత్రునివద్ద ఉంచారు.
ఆయన ఒకనాడు గంగమ్మ దగ్గరకు వెళ్ళి...‘‘ఇది దేవతాకార్యం. దీనిని నీవు ఉంచుకుని గర్భం ధరించు’’ అన్నాడు. గంగ అంగీకరించింది. అయితే శివ తేజస్సు శరీరం అంతటా ప్రవహించేసరికి తట్టుకోలేక..‘నేను వదిలిపెట్టేస్తాను.. ఎక్కడ వదిలిపెట్టేయను’ అనడిగింది. ‘‘రెల్లుగడ్డి పొదలో వదిలి పెట్టు’’ అని అగ్నిహోత్రుడు సలహా ఇచ్చాడు. అదే శరవణ భవ.. మంత్రం. అక్కడ సుబ్రహ్మణ్య జననం జరిగింది. అందువల్ల బాల సుబ్రహ్మణ్యుడు గంగానదీ ప్రవాహ తీరంలో ఆడుకునేవాడు. అదే సద్గురు గుహలీలే... అన్న చరణం.
బ్రహ్మ, విష్ణు స్పర్శ పొందిన గంగ... సగరుల భస్మరాశిమీదుగా ప్రవహించడానికి పాతాళానికి భాగీరథుడి రథం వెంట పరుగెడుతూన్నది. మార్గమధ్యంలో జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచెత్తడంతో ఆయన ఆగ్రహించి మొత్తం గంగను తపశ్శక్తితో లోపలకు పుచ్చేసుకున్నాడు. భగీరథుడి అభ్యర్థన మేరకు మళ్ళీ విడిచిపెట్టాడు. అలా గంగ రుషి పుత్రిక జాహ్నవి అయింది. వ్యాసాది కృపాలే... అని కూడా అన్నాడు.. వ్యాసమహర్షికి గంగానది అంటే ఎంత వ్యామోహమో! పరమశివుడు శపిస్తే... గంగను, కాశీని వదిలిపెట్టి పోవడానికి వ్యాసుడు క్షోభిల్లాడు.
గంగకు ఒకగొప్పదనం ఉంది. గంగావతరణమ్ గురించిగానీ, గంగను గురించిగానీ వింటే చాలు... అంటారు భీష్ముడు అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని ధర్మరాజుతో మాట్లాడుతూ –‘‘గంగానది పేరు తలచుకోవడం గానీ, గంగలో స్నానం చేయడం గానీ, ఒక చుక్క గంగనీటిని నాలుకమీద వేసుకోవడం గానీ చేయాలి. ఆచరించవలసినవే అయినప్పటికీ యజ్ఞయాగాదులకన్నా, బ్రహ్మచర్యం కన్నా, తపస్సుకన్నా, దానం కన్నా, గంగాస్నానం గొప్పది’’ అంటాడు.
కాశీఖండంలో శ్రీనాథుడు...‘‘గౌరియొక్కతె యాకాశగంగ యొకతె/కాశియొక్కతె దక్షిణకాశి యొకతె/నలుగురును శంభునకు లోకనాయకునకు/రాణ్ వాసంబులనురాగ రసమ పేర్మి?’’ అని అంటాడు భీమేశ్వర పురాణంలో. అంటే గౌరిని ఎంతగా ప్రేమిస్తాడో శంకరుడికి గంగ, కాశి, దక్షిణ కాశి అన్నా కూడా అంతే అనురాగమట. ఎవరయితే భక్తితో గంగానది పేరు తలచుకుని ఒక్క గంగనీటి చుక్కను నాలుకమీద వేసుకుంటారో వారికి యమధర్మరాజుతో సంవాదం లేదన్నారు. అంటే వారికి యమదూతల దర్శనం ఉండే అవకాశం లేదు. అంతగొప్పగా గంగానదీ వైభవాన్ని కీర్తించిన ముత్తుస్వామి దీక్షితార్ వారి నోట కీర్తనల రూపంలో ప్రవహించిన శాబ్దికగంగను కూడా మనం నిత్యం వింటూ ఉండాలి.
(చదవండి: అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!)
Comments
Please login to add a commentAdd a comment