
ప్రతీకాత్మక చిత్రం
Winter Season: Asthma Diet Tips By Doctor What To Eat In Telugu: చలికాలం వచ్చిందంటే చాలు.. అలర్జీ, ఆస్తమా బెడద ఎక్కువవుతుంది. నిజానికి ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరు కాదు. ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ అని చెప్పవచ్చు. మనకు ఏదైనా మనకు సరిపడని పదార్థం లోనికి ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ! ఈ క్రమంలో ఒక్కోసారి... దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. మరి చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించే ఆహారాలు, వంట ప్రక్రియల గురించి తెలుసుకుందాం!
అలర్జీ.... ఆస్తమాగా ఎప్పుడు మారుతుందంటే...?
అలర్జీతో తొలుత ఏమవుతుందో అర్థం చేసుకోడానికి కళ్లను ఉదాహరణగా తీసుకుందాం. కళ్లలో దుమ్ముపడితే ఎర్రబారి, నీళ్లుకారినట్టుగా... నులుముకోవాలన్నంత దురదలాంటి ఫీలింగ్ వచ్చినట్లుగానే... సాధారణంగా అలర్జీ కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న అప్పర్ ఎయిర్‌వేలోనూ అక్కడి సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. స్రావాలు వెలువడతాయి. ముక్కు , కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట పెట్టడం వంటివి కనిపిస్తాయి. ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికి మాత్రమే అలర్జీ పరిమితమైనప్పుడు దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు.
అదే అలర్జీ తీవ్రతరమై లోవర్ ఎయిర్‌వేస్‌తో పాటు ఊపిరితిత్తులూ, గాలిగదులు ఎర్రబారడం... గాలి పీల్చుకునే నాళాలు (బ్రాంకై) వాచి, బాగా సన్నబారిపోయి శ్వాసతీసుకోవడం కష్టం అయ్యే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో ఊపిరి అందని ఆయాసపడే స్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే... అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. అప్పుడు ఆస్తమాకు గురైన వారి శరీరం నీలంగా మారిపోయి, వారు స్పృహ కోల్పోయే పరిస్థితి రావచ్చు.
అలర్జీ / ఆస్తమా చికిత్స :
►అలర్జీ అయినా, ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కూ, ‘ఇరిటెంట్స్’కు దూరంగా ఉండటం మేలు.
అలర్జీకి చికిత్సగా మందులు వాడాల్సి వస్తే... దాని తీవ్రతను తగ్గించేందుకు యాంటీ హిస్టమైన్స్, మాంటెలుకాస్ట్ లాంటి మందులు వాడతారు.
ఇక ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్‌హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని అరికట్టే ‘రిలీవర్స్’ అనే ఇన్‌హేలర్లు వాడటం తెలిసిందే. కొందరు ఈ ఇన్‌హేలర్స్ హానికరం అనుకుంటారుగానీ అవి పూర్తిగా సురక్షితమైనవి.
►ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్‌లలాంటి పీల్చే చికిత్స (ఇన్‌హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలూ అందుబాటులో ఉన్నాయి. అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, గాలి తేలికగా లోపలికీ, బయటకూ వెళ్లేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్‌లో వచ్చిన ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు.
►అలర్జీల విషయానికి వస్తే ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి తోడు అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్‌డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలూ విజయవంతమయ్యాయి. అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండకపోవచ్చు. అయితే అవి తీవ్రమైన ఆస్తమాతో బాధపడే కొందరిపైన ప్రభావపూర్వకంగానే
పనిచేస్తాయి.
అలర్జీలు / ఆస్తమాను తగ్గించే ఆహారాలు
►టొమాటో
►కాలీఫ్లవర్
►బెల్‌పెప్పర్స్
►బ్రాకలీ
►కివీ ఫ్రూట్స్,
►స్ట్రాబెర్రీలు
►అయితే నిమ్మజాతి పండ్లు సాధారణ వ్యక్తుల్లో అలర్జీలను తగ్గించి, ఆస్తమా వంటి వాటిని ఎదుర్కొనేలా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అయితే కొందరికి నిమ్మజాతి పండ్లలో ఉండే పులుపుతోనే అలర్జీ వస్తుంది. అదే ఆస్తమాను ప్రేరేపిస్తుంది. అలాంటివారు మాత్రం నిమ్మజాతి పండ్లకు దూరంగా ఉండాలి లేదా చాలా పరిమితంగా తీసుకోవాలి.
అలర్జీలు / ఆస్తమాను తగ్గించే వంట ప్రక్రియలు
ఆయిలీ ఫుడ్స్, నూనెలో బాగా వేయించే వేపుళ్లు (డీప్ ఫ్రైడ్, రోస్టెడ్) పదార్థాలు, మసాలాలు చాలా ఎక్కువగా ఉపయోగించి చేసే ఆహారపదార్థాలు చాలామందిలో అలర్జీ కలిగించడం కంటే ఆస్తమాను నేరుగా ప్రేరేపిస్తాయి. అందుకే ఉప్పు, మసాలాలూ, నూనెలు తక్కువగా ఉండేలాగా... అలాగే వేపుళ్లు కాకుండా ఉడికించి వండేవాటితో అలర్జీలు/ ఆస్తమాను చాలావరకు నివారించవచ్చు.
--డాక్టర్ రఘుకాంత్..సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment