అందరూ అన్నీ చేసేస్తున్నారు. ఇక కొత్తగా నేనేం చేయాలి? ఇంతమంది మధ్యలో నేను పెట్టిన స్టార్టప్ మనుగడ సాధ్యమేనా? సొంతంగా పరిశ్రమ స్ఠాపించాలనుకునే యువతలో ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. అయినా ఒక సమస్యకు పరిష్కారాన్ని మించిన ఉపాధి మరేముంటుంది? తన కళ్ల ముందున్న సమస్య నుంచి కెరీర్ మొదలుపెట్టారు షీతా మిట్టల్. ఆ సమస్య కూడా నిరంతరం ఉండేదే అయినప్పుడు ఆ పరిష్కారం కూడా భూమి ఉన్నంత కాలం ఉండి తీరుతుంది. ఇంతకీ ఆమె ప్రారంభించిన పరిశ్రమ ఏమిటంటే.. మహిళల ఆరోగ్య ఉత్పత్తుల తయారీ. సమాజం మాట్లాడడానికి సందేహించే ఆరోగ్య సమస్యలకు ఆహారంతో పరిష్కారం చెబుతున్నారు షీతా మిట్టల్.
‘‘ఆహార ఉత్పత్తులు, హెల్త్ డ్రింకులు తయారు చేసే కంపెనీలన్నీ మహిళల మహిళల ఎముకల పటిష్టత వరకే ఆలోచిస్తున్నాయి. వార్ధక్యం లో ఎదురయ్యే కీళ్ల నొప్పుల గురించి మాట్లాడుతున్నాయి. అక్కడితోనే ఆగిపోతున్నాయి. నిజానికి మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే గర్భాశయ సమస్యల గురించి మాట్లాడవలసింది చాలా ఉంది. ఇప్పటికీ సమాజంలో ఆ విషయంలో గోప్యత, కళంక భావన బలంగానే ఉంది. ఆ శూన్యతను భర్తీ చేసే ప్రయత్నం చేశాను. మా అమ్మ తన ఆరోగ్యం విషయంలో ఎంత బాధపడిందో స్వయంగా చూశాను. అమ్మ శారీరకంగా బాధపడుతుంటే, నాది మానసికమైన వేదన. ఆమె బాధ చూస్తుంటే గుండె పిండేసినట్లయ్యేది.
టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా ఈ ఇబ్బందులకు పరిష్కారం లేకపోవడం ఏమిటి అని కూడా అనిపించేది. ఆ పని నేనే ఎందుకు చేయకూడదు... అనే ఆలోచనకు ప్రతిరూపమే ‘అండ్ మీ’! మూడేళ్ల కిందట మొదలైన మా సంస్థ ఈ కరోనా సమయంలో కూడా ప్రయోగాలను కొనసాగించి... మెనోపాజ్ కుకీస్‌ను తయారు చేసింది. మెనోపాజ్ దశకు చేరిన మహిళలు తీసుకోవాల్సిన ఆహారం ప్రత్యేకమైనదై ఉండాలి. అయితే ఆధునిక మహిళకు ఆ దినుసులన్నీ మార్కెట్‌లో సేకరించి, వండుకుని తినగలిగే సమయం ఉండడం లేదు. అందుకే తినడానికి సిద్ధంగా కుకీస్ తయారు చేశాం. ప్రతి ఉత్పత్తినీ గైనకాలజిస్టులు, పోషకాహార నిపుణుల సూచనలను పాటించి తయారు చేస్తాం. తయారైన వాటిని ల్యాబ్‌లో పరీక్ష చేసిన తర్వాత మాత్రమే మార్కెట్‌లో విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు షీత.
లక్ష్యం కోసం కలిశారు
ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన షీతా మిట్టల్ యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేశారు. యోగా శిక్షకురాలు కూడా. ఐదేళ్ల కిందట యూఎస్‌లోని స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదువుతున్న అంకుర్ గోయెల్ కూడా తన తల్లి ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ అధ్యయనంలో అతడికి తెలిసిన సంగతి ఏమిటంటే... ‘మనదేశంలో ఐరన్‌లోపం ఉన్న మగవాళ్లు 23 శాతం ఉంటే మహిళలు 54 శాతం మంది. అలాగే క్యాల్షియం లోపం కూడా మగవాళ్లలో 25 శాతంలో ఉంటే ఆడవాళ్లలో 50 శాతం మందిలో ఉంది. ఈ పోషకాల లోపం జీవనశైలితోపాటు సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల వస్తోంది’ అని. షీతా మిట్టల్ కూడా అదే ప్రయత్నంలో ఉండడంతో ఇద్దరూ కలిసి మహిళలకు ఎదురయ్యే అనారోగ్యాలను తగ్గించే ఆహారం మీద దృష్టి పెట్టారు.
అవసరాలను గుర్తించారు
కరోనా సమయంలో అన్ని పరిశ్రమలూ స్తంభించిపోయినట్లే షీతా మిట్టల్ పరిశ్రమ కూడా ఒడిదొడుకులను ఎదుర్కొంది. కానీ అవసరం ఆగదు కదా! ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్‌లు ఎక్కువయ్యాయి. దాంతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రయోగాలను, ఉత్పత్తులను తిరిగి ప్రారంభించిందామె. బెంగళూరు నుంచి మనదేశంలో ప్రముఖ నగరాలకు, విదేశాలకు కూడా విస్తరించించాయి ‘అండ్ మీ’ మహిళల ఆరోగ్య ఉత్పత్తులు. ప్రస్తుతం షీతామిట్టల్ పరిశ్రమ పెద్ద కంపెనీలకు దీటుగా సాగుతోంది. సమాజం లోని అవసరాన్ని మానవీయ కోణంలో చూడగలిగి, మనసు పెట్టి పరిష్కారాన్ని అన్వేషిస్తే... అంతకు మించిన ఉపాధి రంగం మరొకటి ఉండదని నిరూపించారు షీతామిట్టల్.
చాకొలెట్‌లు, ‘టీ’లే ఔషధం!
షీతా మిట్టల్ ‘అండ్ మీ’ పరిశ్రమ ద్వారా పీసీఓఎస్‌ను అదుపు చేసే పానీయంతోపాటు పీరియడ్స్ సమయంలో నొప్పిని నివారించే చాకొలెట్‌లు, టీ తయారు చేస్తోంది. ఇటీవలి కాలంలో మహిళలను తరచూ వేధిస్తున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించే మూలికా పానీయంతోపాటు యువతులను ఇబ్బంది పెడుతున్న యాక్నే, జుత్తు రాలడం, చర్మం పేలవంగా మారడం వంటి సమస్యలకు కూడా పోషకాలతో కూడిన ప్రత్యామ్నాయాలను రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment