Women Wearing Stylishly Designed One Gram Gold Jewellery - Sakshi
Sakshi News home page

ఆ గోల్డ్‌కి పెరుగుతున్న క్రేజ్‌..రోజుకో నగతో మహిళామణులు ధగ ధగ మెరుస్తున్నారు!

Published Sat, Jul 29 2023 1:58 PM | Last Updated on Sat, Jul 29 2023 2:14 PM

Women Wearing Stylishly Designed One Gram Jewellery - Sakshi

శుభకార్యం ఏదైనా... మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించేది ఆభరణాలపైనే. చీర రంగు, డిజైన్‌కు తగ్గట్టుగా ఆభరణాలు ధరించాలనుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ బంగారం ధరలు చుక్కలనంటుతుండంతో ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు చూస్తున్నారు. చాలా మంది ‘వన్‌గ్రామ్‌ గోల్డ్‌’ వైపు మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువగా ఉండటం...వివిధ మోడళ్లలో అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతున్నారు. రోజుకో మోడల్‌ నగతో ధగధగ మెరుస్తున్నారు.

సాక్షి, పుట్టపర్తి: బంగారం.. కొనాలంటే ధర భయపెడుతోంది...ఎలాగోలా కొందామనుకున్నా కావాల్సిన మోడల్‌ అందుబాటులో ఉండటం లేదు. నచ్చిన మోడల్‌ నగ కొనుగోలు చేసినా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అందువల్లే బంగారు ఆభరణాల కొనుగోలు ఇప్పుడో పెద్ద ప్రహసనం. అందువల్లే సామాన్య, మధ్యతరగతి వారు ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. జిగేల్‌ మంటున్న వన్‌గ్రామ్‌ గోల్డ్‌ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేని సామాన్యులు, మధ్య తరగతి మహిళలకు ఇప్పుడు వన్‌గ్రామ్‌ గోల్డ్‌ కళ్లముందు జిగేల్‌మంటోంది.

ధరలు కూడా అందుబాటులో ఉండటం..కోరిన డిజైన్లలో దొరుకుతుండటంతో వన్‌గ్రామ్‌ గోల్డ్‌కే జై కొడుతున్నారు. చైన్‌ స్నాచింగ్‌ కేసులు నేపథ్యంలో చాలా మంది తాళిబొట్టు గొలుసు కూడా వన్‌గ్రామ్‌ గోల్డ్‌నే వాడుతున్నారు. వీటిని ధరించడం సులువు, రవాణాలో ఇబ్బంది ఉండదు, పైగా చోరీకి గురైనా నష్టం పెద్దగా ఉండదు. దీనికి తోడు రకరకాల డిజైన్లు ఆకట్టుకుంటాయి. తక్కువ మొత్తానికే భారీ తూకం నగలు ఇంటికి చేరుతాయి. అందువల్లే చాలా మంది వన్‌గ్రామ్‌ గోల్డ్‌ బెస్ట్‌ అంటుండగా...జిల్లాలో దుకాణాలు భారీగా వెలిశాయి. గతంలో బెంగళరు, హైదరాబాద్‌ వంటి ప్రముఖ నగరాల్లోనే ఎక్కువగా కనిపించే వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగల దుకాణాలు ఇప్పుడు హిందపురం, ధర్మవరం తదితర పట్టణాల్లోనూ మిరుమిట్లు గొలుపుతున్నాయి.

సంపన్నులదీ అదే దారి ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ర.55 వేలపైనే పలుకుతుండగా... ఏ ఆభరణం కొనాలన్నా ర.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. కొనుగోలు చేసిన వారు కూడా చోరుల భయంతో ధరించలేని దుస్థితి. అందువల్లే ఇంట్లో బంగారం ఎక్కువ ఉన్న వాళ్లు బ్యాంకుల్లోని లాకర్లలో ఉంచుతున్నారు. శుభకార్యాల సమయంలో వాటిని తీసుకుని ధరిస్తున్నారు. ఆ వెంటనే మళ్లీ లాకర్లలోనే భద్రపరుస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకునే సంపన్నులు వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగలను ధరించేందుకు ఇష్ట పడుతున్నారు.

బంగారం కొనుగోలు కోసం దాచిన డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా డిజైన్లు బంగారు ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. ఉంగరాల ధర .వెయ్యి నుంచి ర.10 వేల వరకు ఉంటోంది. మహిళలు ధరించే లాంగ్‌ చైన్లు రూ .5 వేల నుంచి ర.20 వేల వరకు రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్య తరగతి వారంతా విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ కళాశాలకు వెళ్లే యువతులు రెండు, మూడు సెట్ల నగలు కొంటున్నారు. ఫలితంగా అమ్మకాలు బాగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
 

వ్యాపారం బాగుంది

వన్‌గ్రామ్‌ గోల్డ్‌తో చేసిన ఆభరణాలకు నాలుగైదు ఏళ్లుగా విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. పట్టణ వాసులకు పోటీగా పల్లె వాసులు కొనుగోలు చేస్తున్నారు. ధరల విషయంలో రాజీ పడకుండా నచ్చి.. మెచ్చిన డిజైన్లను సొంతం చేసుకుంటున్నారు. రోజూ కనీసం ఐదుగురు చొప్పున వన్‌ గ్రామ్‌ గోల్డ్‌తో చేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.


– సాజిద్, బంగారు నగల వ్యాపారి, ధర్మవరం

కాలేజీ విద్యార్థులే ఎక్కువ

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వన్‌గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాలకు డిమాండ్‌ పెరిగింది. గ్రామీణ ప్రాంత వాసులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అందులో కూడా కాలేజీ విద్యార్థినులే అధికంగా ఉంటున్నారు. దొంగల బారి నుంచి నష్టపోకుండా ఉండేందుకు విరివిగా వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు.



– రమేశ్, వ్యాపారి, హిందూపురం

(చదవండి: చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement