శ్రియ సచిన్ పిల్‌గావ్‌కర్.. నటనావారసత్వంతో మేకప్ వేసుకున్నా పెర్‌ఫార్మెన్స్‌తోనే పేరు, అవకాశాలను తెచ్చుకుంటోంది. మాతృభాష మరాఠీతోపాటు హిందీ, ఇంగ్లిష్ థియేటర్, సినిమా, వెబ్ సిరీస్‌లతో కెరీర్‌ను ఫ్రేమ్ చేసుకుంటోంది.
జన్మస్థలం.. ముంబై. పెరిగింది కూడా అక్కడే. తల్లిదండ్రులు సుప్రియా పిల్‌గావ్‌కర్, సచిన్ పిల్‌గావ్‌కర్‌లు. ఇద్దరూ ప్రముఖ నటులే మరాఠీ, హిందీ భాషల్లో. సచిన్ పిల్‌గావ్‌కర్ రచయిత, దర్శకుడు కూడా. ఆ బహుముఖ ప్రజ్ఞకూ వారసురాలే శ్రియ. నటి మాత్రమే కాదు, కథక్ నర్తకి, గాయని, దర్శకురాలునూ. ∙‘పెయింటెడ్ సిగ్నల్స్’, ‘డ్రెస్‌వాలా’ అనే షార్ట్‌ఫిల్మ్స్‌కు దర్శకత్వం వహించింది. ‘పంచగవ్య’ అనే డాక్యుమెంటరీ తీసింది.
చదువు.. సోషియాలజీలో డిగ్రీ. పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్ సమ్మర్ స్కూల్ నుంచి నటనలో డిప్లొమా. స్పోర్ట్స్‌లోనూ ఫస్టే. ప్రొఫెషనల్ స్విమ్మర్. కొత్త భాషలను నేర్చుకోవడమంటే ఆసక్తి. జపనీస్ వచ్చు. నటి కాకముందు జపనీస్ ట్రాన్స్‌లేటర్ కావాలనేదే ఆమె లక్ష్యం. మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ థియేటర్‌తో పనిచేస్తూనే 2013లో తన తండ్రి దర్శకత్వం వహించిన ‘ఎకుల్తి ఏక్’ అనే మరాఠీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ అనే చిత్రంతో జాతీయ నటిగా మారింది.
‘మీర్జాపూర్’, ‘హౌస్ అరెస్ట్’ అనే వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌తో ఇల్లిల్లూ ఆమెను గుర్తుపెట్టుకుంది. ఆమె ప్రతిభా అకాడమీ అవార్డ్ విన్నర్ ఫ్రెంచ్ డైరెక్టర్ క్లాడె లెలోషే కంటాపడింది. తను తీసిన ‘అ ప్లుస్ ఇన్’ అనే ఫ్రెంచ్ సినిమాలో శ్రియను నటింపచేశాడు. ‘బీచమ్ హౌస్’ అనే బ్రిటిష్ సిరీస్‌లోనూ నటించింది. థియేటర్, సినిమా, వెబ్ సిరీస్ బిజీ షెడ్యూల్స్ నుంచి సేదతీరేది ప్రయాణాలు, పుస్తక పఠనంతోనే.
‘‘అమ్మ, నాన్న ప్రభావం ఉన్నా వాళ్లను అనుకరించను. అమ్మలోని సహనం, నాన్నలోని క్రమశిక్షణ నాకు వస్తే బాగుండు అనుకుంటా. ఇద్దరికీ ఉన్న షార్ట్ టెంపర్ మాత్రం దరిచేరకుండా జాగ్రత్త పడ్తా. నాకే గనుక చాన్స్ దొరికితే ఓ సీక్రెట్ సొసైటీ స్థాపిస్తా. సోషల్ మీడియాలో బుల్లీయింగ్‌కు పాల్పడేవాళ్ల పనిపట్టేందుకు’’ అంటుంది శ్రియ సచిన్ పిల్‌గావ్‌కర్.
Comments
Please login to add a commentAdd a comment