ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధం విద్య మాత్రమే అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈ సిద్దాంతాన్ని బలంగా విశ్వసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విద్యా రంగ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో 35 శాతం సీట్లు పేదలకు కేటాయింపు చేయాలనే నిర్ణయాలు ఎంతో దార్శనికతతో తీసుకున్నవిగా స్పష్టమవుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకంలో భాగంగా, పాఠశాల విద్యార్థులకు ఉపయుక్తంగా అందిస్తున్న జగనన్న కిట్‌లు మధ్యతరగతి, పేద విద్యార్థులకు వరంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని మార్పుచేసే విధంగా 44,512 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం, తొలి దశలో రూ. 3,625 వేల కోట్లతో 15,715 పాఠశాలలను అద్దంలా, సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు అందించిన విధానం నభూతో న భవిష్యతి అన్న చందంగా సాగింది. ప్రధానంగా గతంలో గ్రామాలలో నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలచిన పాఠశాలలకు నాడు–నేడు పథకంలో పుష్కలంగా నిధులు సమకూర్చి అభివృద్ధి చేసిన విధానం పల్లె ప్రజల మనసులను చూరగొంది. (తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!)
పనుల్లో పారదర్శకతను పాటిస్తూ తమ పాఠశాలను తామే అభివద్ధి చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. పాఠశాల చిన్నారులను ఆకర్షించే విధంగా రంగురంగుల వర్ణ చిత్రాలు, తరగతి గదుల్లో విద్యుత్ దీపాలు, విద్యార్థులు కూర్చునే బెంచీలు వంటి సకల వసతులను కల్పించడంతో పాటు, బాలికలకు అత్యంత ఉపయుక్తంగా నిలిచే శౌచాలయాలను నిర్మించి అందించింది. బాలికల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ, హాజరు శాతం పెంపుదల చేయడానికి ఇది ఒక కారణంగా నిలుస్తుంది. గత పాలకులు పాఠశాల విద్య విషయంలో కాగితాల్లో లెక్కలకే పరిమితం అయ్యారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయివరకు విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నూతన పంథాలో నడిపించడానికి, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన రాష్ట్ర విద్యార్థులను సమాయత్తం చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం)
‘ప్రపంచంలో నిజమైన శాంతిని కోరుకుంటున్నట్లయితే మనం చిన్నారులను విద్యావంతులుగా తయారు చేయాల’న్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలను నిజం చేస్తూ పాఠశాల విద్యను అందరికీ చేరువ చేసే ప్రయత్నం ఏపీలో జరుగుతోంది. దీనిలో భాగంగా తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు ఖరారు చేయడం దేశంలోనే ఒక నూతన ఒరవడికి నాందిగా చెప్పవచ్చు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో పాఠశాలల ఫీజులు రూ. 10 వేల నుంచి 18 వేల వరకు, జూనియర్ కాలేజీలకు రూ. 12 వేల నుంచి 20 వేల వరకు ఉండాలని, అదే విధంగా హాస్టల్ రుసుములు సైతం రూ. 18 వేల నుంచి రూ. 24 వేల మధ్యలో ఉండాలని నిర్ణయించారు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తూ అందరికీ విద్యను చేరువ చేసే దిశగా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని మనందరం స్వాగతించాల్సిన తరుణమిది.
పేద విద్యార్థులకు అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిభ కలిగిన విద్యార్థులు పేదరికం కారణంగా విద్యకు దూరం కారాదనే దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ నిర్ణయం నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు వర్సిటీలలో ప్రవేశం పొందడం వలన పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెనతో వసతి భోజన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తూ విద్యార్థికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యను పొందే వ్యవస్థను కల్పించాలని సంకల్పించారు. ఈ విధానంలో రిజర్వేషన్ అమలు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బాలికలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్ అమలు జరిగి అట్టడుగు వర్గాలకు సంపూర్ణ న్యాయం చేకూరుతుంది. భవిష్యత్తులో జరిగే సంస్కరణలకు కేవలం ఇవి తొలి అడుగుగా భావించాలి. ఎంతో ఆర్థిక భారాన్ని భరిస్తూ రాష్ట్రంలో పేద, అట్టడుగు వర్గాల చిన్నారులకు విద్యను చేరువ చేయాలనే సమున్నత సంకల్పం ఎంతో అభినందనీయం. ఈ పథకాలను మరో దశాబ్ద కాలం అమలు జరిపితే ప్రతీ కుటుంబం విద్యావంతులతో సుసంపన్నం అవుతుంది. తద్వారా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, మరొకరికి చేయూతనందించే స్థాయికి చేరుకుంటారు.
- డా. టి. షారోన్ రాజు
వ్యాసకర్త విద్యా విభాగాధిపతి
ఆంధ్ర విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment