ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పనులూ ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఫలితంగా అట్టడుగు జనం జీవన ప్రమాణాలు పెరుగుతూ పోతున్నాయి. అభివృద్ధికి నిజమైన నిర్వచనం ఇదే కదా! పారిశ్రామిక పార్కులు, పోర్టుల నిర్మాణం – అభివృద్ధి, విమానా శ్రయాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో ఏపీలో ఉద్యోగ కల్పన వేగం పుంజుకొంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాల్లో అధిక భాగం దక్కడం ఈ అభివృద్ధి నమూనా ప్రత్యే కతగా చెప్పుకోవాలి.ఏపీ ప్రభుత్వం నెలకొల్పిన పారిశ్రామిక పార్కుల ప్రాంతాల్లో ఒకప్పుడు బతుకు తెరువు కోసం పట్నాలకు వలస పోయే పరిస్థితి ఉండేది. మిగిలిన వారు పెత్తందారుల చుట్టూ పని కోసం తిరిగే వారు. ప్రస్తుతం ఆ యా ప్రాంతాల్లో పరి శ్రమలు రావడంతో పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి.
తిరుపతి జిల్లాలోని ‘శ్రీసిటీ పారిశ్రామిక పార్క్’ సమీపంలోని మల్లావారి పాలెం గ్రామస్థుడు సన్యాసయ్య చెప్పినట్లు ‘బడుగు జీవుల పొలాలకు మంచి ధరలు వచ్చాయి. ఇంటికో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎవరి ముందు తలవంచక ఆత్మ విశ్వాసంతో’ బతుకుతున్నారు.‘‘టెన్త్ మాత్రమే చదివిన నాకు ఎక్కడా పని దొరక లేదు. సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తూ... కాలం వృధా చేస్తున్న సమయంలో, సెల్‌ఫోన్లు తయారీ కంపెనీలో పని దొరికింది. ఇంటి నుండి కంపెనీకి వెళ్లి రావడానికి బస్‌సౌకర్యం, క్యాంటీన్, 24 గంటల హెల్త్ సెంటర్ ఉంది’– తిరుపతికి చెందిన మరో యువతి మనోగతం ఇది. వీరంతా ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలకు చెందిన పేద మహిళలు.
ఇక్కడ ఉద్యోగాలు చేసే వారిలో 90 శాతం మహిళలే. టెన్త్ నుండి ఇంజనీరింగ్ వరకు చదివిన వారే. ఈ అవకాశం తైవాన్ బహుళజాతి సెల్‌ఫోన్ తయారీ సంస్థ ‘ఫాక్స్‌కాన్’ ద్వారా మహిళలకు దొరికింది. తిరుపతి జిల్లా శ్రీసీటీలో ఈ కంపెనీ 30 ఎకరాల్లో ఏర్పాటయింది. ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు సరిహద్దుల్లో, నెల్లూరు జిల్లా తడ, తిరుపతి జిల్లా సత్యవేడు మధ్య ఏర్పాటయ్యింది శ్రీసిటీ పారిశ్రామిక పార్క్. 2006లో ఇక్కడ భూసేకరణ సమయంలో అనేక ఆందోళనలు జరిగాయి. అప్పటి దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులతో స్వయంగా సమావేశమై అప్పటి మార్కెట్ ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి 14 గ్రామాల్లో భూములు తీసుకున్నారు. ఇది 2008లో ప్రారంభమై 7,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. జాతీయ రహదారి, రైల్వే, విమానాశ్రయం, ఓడరేవు అన్నీ దగ్గరగా ఉండడం ఈ పారిశ్రామిక పార్కుకి బాగా కలిసొచ్చింది.
ఇందులో ఇప్పటి వరకు 220 కంపెనీలు ఏర్పాటై 62 వేల మందికి ఉపాధి కలిగింది. వారిలో సగం మంది మహిళలే. గత 55 నెలల్లో, రాష్ట్రంలో 311కి పైగా ప్రధాన పరిశ్రమలు స్థాపించారు. 1.3 లక్షల ఉద్యోగావకా శాలు ఉన్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రూ. 13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 386 అవగాహనా ఒప్పందాలు జరిగాయి. దీనివల్ల మరో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఏపీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. సీ పోర్టుల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆరు పోర్టులకు తోడు కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టి వాటిని అభివృద్ధి చేస్తోంది. దాదాపు రూ. 16,000 కోట్లతో రామా యపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టులను నిర్మిస్తున్నారు.
కొత్త పోర్టుల వల్ల 110 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓడరేవుల ద్వారా 75 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు మత్స్యకారుల జీవనోపాధిని పెంచుతాయి. 3,793 కోట్ల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్‌లు, ఆరు ఫిష్‌ల్యాండింగ్ సెంటర్‌లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ప్రతి 50 కిలోమీటర్ల తీరప్రాంతానికి ఓడరేవు లేదా ఫిషింగ్‌హార్బర్ ఉంటుంది. భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమా నాశ్రయం రూ. 4,592 కోట్ల ప్రాజెక్ట్. దీనివల్ల 10,000 మందికి ప్రత్యక్షంగా, 80,000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలుగబోతున్నాయి.
గన్నవరం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాల విస్త రణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రామ్‌కో సిమెంట్, సెంచరీ ప్యానెల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్‌లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమల నుండి భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. దేశంలోనే అత్యధిక జీఎస్‌డీపీ వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈడీబీ) ఇండెక్స్‌లో వరుసగా మూడేళ్లుగా భారత్‌లో నంబర్‌వన్‌గా నిలవడం ఈ సందర్భంగా గమనార్హం.
- వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్ మొబైల్: 94405 95858
- శ్యాంమోహన్
Comments
Please login to add a commentAdd a comment