బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు జాతీయ భద్రతకు భిన్న మార్గాల్లో ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే రెండూ కూడా అత్యాధునిక మిలటరీ ఆయుధాలను సమకూర్చుకోవటానికి ఏమంత ప్రాముఖ్యం ఇవ్వలేదు.
దేశంలోని ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత రక్షణ, భద్రత అంశాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కొంత మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది కానీ... త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ... జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని రూపొందించే విషయం రెండు మేనిఫెస్టోల్లోనూ స్పష్టంగా లేదు. అంతేకాదు, మన రక్షణ రంగానికి ఇప్పుడు దిగ్దర్శనం చేసే ఒక ‘ప్రొఫెషనల్’ అవసరం కూడా ఎంతైనా ఉంది.
బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో స్వావలంబనకు పెద్దపీట వేశారు కానీ... అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సమకూర్చుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. జాతీయ భద్రత, రక్షణ వంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రస్తావించింది కానీ... ఏవీ అంత సమగ్రంగా ఉన్నట్టు కనిపించవు. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ సురక్షిత్ భారత్’ పేరుతో మోదీ ప్రభుత్వం తను సాధించిన విజయాలను వెల్లడించింది, భవిష్యత్తు కోసం కొన్ని హామీలను ఇచ్చింది.
2014 తరువాత దేశంలోని ఏ నగరంలోనూ ఉగ్రదాడి ఏదీ జరగలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందులో కీలకం ‘నగరం’ అన్న పదం. 2016లో పఠాన్‌కోట వైమానిక స్థావరం, యూరీలు; 2019లో పుల్వామా ఘటనల్లో ‘నగరాల’పై దాడులు జరగలేదు కాబట్టి తాము తప్పుగా ఏమీ చెప్పలేదని బీజేపీ సమర్థించుకోవచ్చు.
దీంతోపాటే ఆర్టికల్ 370 రద్దు ప్రభావం జమ్మూ కశ్మీర్‌లో ఎలా ఉందో కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత హింస 52 శాతం వరకూ తగ్గిందనీ, ఈశాన్య భారతదేశంలో చొరబాటుదారుల సమస్య 71 శాతం నెమ్మదించిందని కూడా ఇందులో వివరించారు. ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదని చెబుతూ మేనిఫెస్టోలో 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ దాడి గురించి చెప్పారు.
చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యాధునికమైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామనీ, కార్యక్రమాలను వేగవంతం చేస్తామనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే.. మణిపుర్ కూడా మన దేశ సరిహద్దులో ఉన్నా దాని ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
‘మోదీకి గ్యారెంటీ ఫర్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్’ విభాగంలో రక్షణ రంగ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో తయారు చేస్తామనీ, ‘మేడిన్ భారత్’ ఎగుమతులకు ఊతమిస్తామని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రయత్నాల వల్ల వాయు, పదాతిదళాలకు అవసరమైన ఆయుధాలు, వ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు.
గత ఏడాది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన తరువాత ‘నేషన్ ఫస్ట్: ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ పేరుతో బీజేపీ ఒక బుక్‌లెట్ విడుదల చేసి. అందులో తాము సాధించిన ఘనతలను ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో రక్షణ, అంతర్గత భద్రతను, బయటి నుంచి రాగల సవాళ్లను వేర్వేరుగా సమీక్షించారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల వైశాల్యమున్న భారత భూభాగాన్ని, మొత్తం 65 పెట్రోలింగ్ పోస్టుల్లో 25 పోస్టులపై పట్టు కోల్పోయామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే జాతీయ భద్రతా వ్యూహం (ఎన్‌ఎస్‌ఎస్) ఒకదాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది.
అలాగే ఎప్పుడో 2009లో రక్షణ మంత్రి జారీ చేసిన ఆపరేషనల్ డైరెక్టివ్‌లను సమీక్షిస్తామనీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. రక్షణ శాఖకు తగినన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఈ రంగంలో తిరోగమిస్తున్న అంశాలను మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపింది.
‘అగ్నిపథ్’ పథకం రద్దుతో పాటుగా, జాతీయ భద్రతా కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లను పార్లమెంటు పర్యవేక్షణలో పనిచేసేలా మార్పులు చేస్తామనీ, వ్యూహాత్మక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనీ ‘వన్ ర్యాంక్– వన్ పెన్షన్’ అమల్లోని లోపాలను సవరిస్తామనీ వివరించింది.
వైకల్యం కారణంగా లభించే పెన్షన్‌పై పన్నులు రద్దు చేస్తామని కూడా చెప్పింది. అంతర్గత భద్రత విషయాలను ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, హింసలకు తావు ఇవ్వమనీ, ఇతర మతాల నిరాదరణనూ సహించబోమనీ స్పష్టం చేసింది. ‘నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్’ను ఆచరణలోకి తేవడం, ఏడాది లోపు ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ ఏర్పాటు తమ లక్ష్యాలని వివరించింది.
దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత కాంగ్రెస్ మేనిఫెస్టో రక్షణ, భద్రత అంశాల విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన ప్రభుత్వం రక్షణ రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తూండటం! ఫలితంగా మన మిలటరీ సామర్థ్యాలను చైనాకు దీటుగా మార్చుకునే విషయంలో వెనుకబడిపోయాం.
త్రివిధ దళాల ఆధునికీకరణకు మరిన్ని నిధుల కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అగ్నిపథ్ లాంటి పథకాల పుణ్యమా అని ఈ ఆధునికీకరణ మరో పదేళ్లకు కానీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వన్ ర్యాంక్– వన్ పెన్షన్ బకాయిలు 2002–23లో మిలటరీ ఆధునికీకరణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కావడం, మిలటరీ సిబ్బంది సంఖ్యను మదింపు చేయడం ద్వారా ఈ లోటును అధిగమిస్తామని బీజేపీ చెప్పడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు.
ఈ చర్యల కారణంగా మన యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం తగ్గిపోయాయి. 2022లో కేవలం ఒక్క ఆర్మీలోనే 1.18 లక్షల ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’ కార్యక్రమం కూడా స్వావలంబనపై ఎక్కువ దృష్టి పెట్టింది కానీ... అత్యాధునిక ఆయుధాలనూ, వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకోవడంపై కాదు.
ఈ విషయాన్ని దేశ తొలి సీడీఎస్, దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలోనే కచ్చితంగా అంచనా కట్టారు. తగినన్ని, నాణ్యమైన ఆయుధ వ్యవస్థలు లేకపోయేందుకు ప్రస్తుతం అవలబిస్తున్న ‘ఎల్1’ టెండర్ వ్యవస్థ కారణం. మిత్ర దేశాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడంతో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయి. ఈ దేశాలన్నీ ప్రాణాంతకమైనవి కాకుండా ఇతర పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి.
త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. ముసాయిదా ఒకదాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2021లోనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని అప్‌డేట్ చేస్తూనే ఉన్నారు.
ఆర్మీ దళాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య వనరుల కొరత. దీంతోపాటే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించక పోవటం కూడా. జాతీయ భద్రత విషయంలో 1980 మధ్య కాలం మిలటరీకి స్వర్ణయుగం అని చెప్పాలి. త్రివిధ దళాలు 15 ఏళ్ల రక్షణ ప్రణాళికను 1988లో పార్లమెంటులో ప్రస్తావించడం గమనార్హం.
పదేళ్లలో బీజేపీ ఐదుగురు రక్షణ మంత్రులను నియమించింది. వీరిలో ఒకరు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. రెండుసార్లు రక్షణ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు కూడా! మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్‌ను ఆ శాఖ మంత్రిగానూ నియమించింది ఈ ప్రభుత్వం. జయశంకర్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభను వెలిగించారనడంలో సందేహం లేదు.
అయితే దేశ రక్షణ రంగం కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఏర్పాటును కోరుకుంటోంది. రక్షణ మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రికైనా మిలటరీ విషయాలపై ఎంతో కొంత పట్టు ఉండాలి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువు అవుతుంది. పథకాల అమలు వేగవంతమవుతుంది. ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది.
– వ్యాసకర్త మిలటరీ వ్యవహారాల వ్యాఖ్యాత
- మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా (రిటైర్డ్)
Comments
Please login to add a commentAdd a comment