జన్యుమార్పిడి ఆవాల విత్తన వినియోగానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని అక్టోబర్ 31 నాడు మూడు జాతీయ వ్యవసాయ శాస్త్ర సంస్థల (ఐసీఎంఆర్, ఎన్‌ఏఎస్‌ఎస్, టీఏఎస్‌ఎస్) అధిపతులు ప్రకటించారు. జన్యుమార్పిడి ఉత్పత్తుల వరదకు గేట్లు తెరవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. జన్యుపరంగా మార్పుచేసిన ఆహార పంటల వాణిజ్య సాగును అనుమతించడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసానా లను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. జన్యుమార్పిడి విత్తనాలు దిగుబడులు తేకపోగా, అనారోగ్యానికి కారణం అవుతాయని గత అనుభవాలు చెబు తున్నాయి. అయినా అవాంఛిత, హానికరమైన సాంకేతిక పరిజ్ఞాన వాడకానికి ప్రపంచంలోనే అతిపెద్ద చెత్తబుట్టగా భారత్ మారడానికి సిద్ధమవుతోంది.
యూరోపియన్ యూనియన్ జన్యు మార్పిడి (జీఎం) పంటలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వ్యతిరేకత తరువాత, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా జన్యు మార్పిడి పంటలను అనుమతించబోనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పాలన ఉన్నప్పటికీ చైనా కూడా ప్రమాదకరమైన సాంకేతిక పరిజ్ఞానం పట్ల అప్రమత్తంగా ఉంది. ఈ తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో జన్యు మార్పిడి విత్తన రంగం మరెక్కడకు మారగలదు, భారతదేశం తప్పితే.
సాంకేతిక ఆవిష్కరణ పేరిట, జన్యుమార్పిడి ఆవాల (డీఎంహెచ్–11 రకం) వాణిజ్య సాగుకు ఆమోదం ఇవ్వవలసి వస్తే, శాస్త్రీయ నిబంధనల ప్రక్రియ ఎంత అశాస్త్రీయంగా మారిందో అర్థమవుతుంది. జన్యు ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) జీఎం ఆవాలకు ఆమోదం మంజూరు చేసిన పద్ధతి అన్ని శాస్త్రీయ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్క రించడానికి జన్యు మార్పిడి టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసును ధ్రువీకరించడానికి జీఈఏసీ తన నియంత్రణను బలహీనపరిస్తే, విధాన రూపకర్తలు వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయినట్లే.
జన్యు మార్పిడి ఆవాలు 30 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయి, అందువల్ల రూ.1,71,000 కోట్ల వంటనూనె దిగుమతి బిల్లును తగ్గించడానికి అవకాశం లభిస్తుందని ఒక అసంబద్ధ వాదన చేస్తు న్నారు. ఆమోదించిన డీఎంహెచ్–11 రకం అధిక దిగుబడినిచ్చేది కాదు. దీని ఉత్పాదకత ప్రస్తుతం వాడుతున్న మూడు ఇతర నాన్– జీఎం రకాల కంటే తక్కువ. అన్ని శాస్త్రీయ నిబంధనల ప్రకారం, ఇది అసలు పరిశీలించాల్సిన రకం కూడా కాదు. అధిక ఉత్పాదకతతో ఇప్పటికే నాలుగు ఆవాల రకాలు ఉన్నాయని ఒక శాస్త్రవేత్త సెంటర్ ఫర్ జెనెటిక్ మానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సౌత్ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. మూడు రకాలు ఒకే డీఎంహెచ్ శ్రేణిలో ఉన్నాయి. సంప్రదాయ రకం అయిన డీఎంహెచ్–4, జన్యుమార్పిడి ఆవాల కంటే 14.7 శాతం అధిక దిగు బడి ఇస్తుంది. రెండు విత్తన కంపెనీల (పయనీర్, అడ్వాంటా ఉత్పత్తి చేసిన) మరో రెండు రకాలు కూడా 30 శాతం అధిక దిగుబడిని ఇస్తాయి. కాబట్టి వంటనూనెల దిగుమతులను తగ్గించేందుకే అను మతి ఇస్తున్నారన్న వాదనలో అర్థం లేదు.
2016–17లో భారతదేశం గణనీయ స్థాయిలో ఆవాలను పండించింది. అధిక ఉత్పత్తి నేపథ్యంలో ధరలు పడిపోయినాయి. రైతులకు సగటున క్వింటాలుకు రూ.400–600 వరకు ధరలు తగ్గాయి. దాదాపు 65 లక్షల హెక్టార్లలో సాగయ్యే ఆవాల పంట, దిగు బడి సమస్యలను ఎన్నడూ ఎదుర్కోలేదు. ఉన్న సమస్య కనీస మద్దతు ధర గానీ, గిట్టుబాటు ధర గానీ రాకపోవడం. నీతి ఆయోగ్ రైతులకు భరోసా ధర కల్పించే ప్రయత్నం చేయకుండా, దిగుబడి మాత్రమే సమస్య అన్నట్లుగా, అధిక దిగుబడితోనే అధిక ఆదాయం వస్తుందనే భావన కల్పిస్తున్నది.
1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం వంటనూనెల దిగుమతులను తగ్గించడం ద్వారా విదేశీ మారకంలో లోటును తగ్గిం చాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ సీడ్ టెక్నాలజీ మిషన్ ప్రారంభమైంది. ఫలితంగా, 1993–94 నాటికి భారత్ దాదాపు స్వయం సమృద్ధి సాధించింది. వంటనూనెల ఉత్పత్తి 97 శాతం దేశీయం కాగా, కేవలం 3 శాతం మాత్రమే దిగుమతి చేసుకున్నారు. కానీ ఈ ‘ఎల్లో రివల్యూషన్’ ఎక్కువ కాలం నిలవలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు క్రమంగా దిగుమతి సుంకాలను తగ్గించాయి. భారతదేశం విధించగల 300 శాతం దిగుమతి సుంకాల పరిమితికి వ్యతిరేకంగా, సుంకాలు దాదాపు సున్నాకు తగ్గిపోయాయి. చౌక నూనె దిగుమతులు పెరిగినాయి. ప్రధా నంగా పామాయిల్ దిగుమతులు దేశీయ మార్కెట్లను ముంచెత్తాయి. కేవలం 3 శాతం దిగుమతుల నుంచి, మళ్లీ 60 శాతానికి పైగా దిగు మతి చేసుకోవడం మొదలైంది. ఫలితంగా, వర్షాధార భూములలో ఎక్కువగా పండించే నూనెగింజల రైతులు ఇతర పంటలకు మార వలసి వచ్చింది. దేశీయ వంటనూనె పరిశ్రమ నష్టాల్లోకి పోయింది. కొన్ని భారతీయ కంపెనీలు శ్రీలంకకు కూడా తరలివెళ్లాయి.
వంట నూనెల దిగుమతి ఖర్చును తగ్గించడమే లక్ష్యం అయితే, మొదట దేశీయ నూనె ఉత్పత్తికి అనుకూల వాతావరణాన్ని కల్పిం చాలి. దిగుమతి సుంకాలను పెంచకపోతే, విదేశీ మారకంలో తరు గును తగ్గించే ఏ చర్య అయినా అర్థరహితం అవు తుంది. ఈ విషయం నీతి ఆయోగ్‌కు తెలుసు. వంటనూనె ఉత్పత్తిని దేశీయంగా పెంచాలనే ఉద్దేశం ఉంటే భారతదేశం ‘పసుపు విప్లవం’ మార్గంలో నడవవలసి ఉంటుందని దానికి తెలుసు. అయినా కొన్ని విత్తన కంపెనీల వ్యాపార అభివృద్ధికే జన్యుమార్పిడి ఆవాల అనుమతి ఇచ్చారు.
జన్యుమార్పిడి ఆవాల రకం వాస్తవానికి రసాయన కలుపు నాశిని తట్టుకునే పంట. కానీ జీఈఏసీ దీనిని ఖండించింది. కాకపోతే, ఖరీదైన కలుపు నాశక రసాయనాలను రైతులు కొనలేరు కనుక వాటిని వాడే అవసరం ఉండదని వాదిస్తున్నారు. ఇది అశాస్త్రీయ వాదన. జన్యుమార్పిడి ఆవాల రకం అనుమతి వెనుక కలుపునాశక రసాయ నాల కంపెనీల వ్యాపార విస్తరణ కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే, హెచ్‌టీ బీటీ ప్రత్తి గింజలకు అనుమతి లేకున్నా చట్ట వ్యతిరేకంగా వేల ఎకరాలలో సాగు అవుతోంది. ఈ పంట కోసం గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం పెరిగింది. ఇటీవల దాని ఉపయోగం అత్యంత ప్రమాదకరం అని గుర్తించిన ప్రభుత్వం, రైతులు కాకుండా, రసాయన పిచికారీ కంపెనీలు మాత్రమే చేయాలని నిబంధన తెచ్చింది. జన్యు మార్పిడి ఆవాల రకాన్ని అనుమతి ఇచ్చిన కొద్దీ రోజులలోనే ఆ నిబంధన తేవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు అనుమతులు ఒకదానికొకటి సంబంధం లేనట్లు ఉన్నా, జన్యు మార్పిడి విత్తనాలు ఈ కలుపునాశక రసాయనం తట్టుకునే రకాలు కావడం విశేషం.
అంటే, జన్యుమార్పిడి ఆవాల రకం విత్తనాలు రైతులు వాడితే తప్పనిసరిగా కలుపునాశక రసాయనం కొనవలసిందే. అవి వాడి రైతులు మరణిస్తే, మొత్తం ప్యాకేజికే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం రైతులు కాకుండా ప్రత్యేక కంపెనీలు పిచికారీ చేసే విధంగా నిబంధన తెచ్చారు. దీని వలన, రెండు ప్రయోజనాలు: గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం చట్ట బద్ధం అవుతుంది, జన్యుమార్పిడి పంటల విస్తీర్ణం పెరుగుతుంది. భారత దేశంలో గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం కేవలం తేయాకు తోటలలోనే చేయాలి. ఇంకెక్కడైనా చేస్తే అది చట్టవిరుద్ధం. ప్రత్యేకంగా ఆహార పంట మీద చేయడానికి వీలు లేదు. జన్యు మార్పిడి ఆవాల ద్వార హానిచేసే రసాయన అవశేషాలు కూడా విని యోగదారులకు అందుతాయి.
జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలు ప్రమాదకరమైనవి. ఆహార పదార్థాల జన్యు నిర్మాణం పక్కదారి పట్టినట్లయితే, జీవ క్రియలు, బయోకెమిస్ట్రీ ప్రభావితమవుతాయి. దాని వలన అలర్జీలు, అనేక ఇతర వ్యాధులు రావచ్చు. ఏ1, ఏ2 పాల నుండి లాక్టోస్ అలర్జీ, గోధుమల నుండి గ్లూటెన్ అలెర్జీ వంటి వాటిని ఇప్పటికే చూస్తున్నాం.
బహుళజాతి కంపెనీల లాభాపేక్ష ఆధారంగా విధానాలు రూపు దిద్దుకుంటున్నాయి. విత్తనాల మీద రైతుల హక్కులు తగ్గుతున్నాయి. బీటీ పత్తికి అనుమతి ఇచ్చిన 20 ఏళ్ళలో రైతుల పరిస్థితి మెరుగు పడకపోగా ఆత్మహత్యలు, అనారోగ్యం పెరిగినాయి. జన్యు మార్పిడి పంటల వల్ల లాభపడేది రైతులు, వినియోగదారులు కాదు. విత్తన కంపెనీలు మాత్రమే. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భారత పౌరులు జీఎం ఆవాలను వ్యతిరేకించాలి.
డాక్టర్ దొంతి నరసింహారెడ్డి
వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment