‘గుండె బాగుండాలి’ అనే శీర్షికతో సుప్రసిద్ధ ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు ఇటీవల ఒక వ్యాసం రాశారు. అది సాక్షి ఈ–పేపర్ అనుబంధంలో శుక్రవారం నాడు అచ్చయింది. సంస్కృతిని ఒక సమాజపు గుండెకాయతో ఆయన పోల్చారు. దేహంలోని ఇతర భాగాలకు గాయాలైతే నయం చేసుకోవచ్చు. గుండెకు గాయమైతే ప్రాణాపాయం. అదేవిధంగా ఒక సమాజం నిర్మించుకున్న సంస్కృతి–దాని విలువలు ధ్వంసమైపోతే ఆ సమాజపు కీర్తిప్రతిష్టలు నశించిపోతాయని ఆయన అభిప్రాయ పడ్డారు. జగద్విఖ్యాతులైన కొందరు తత్వవేత్తల అభిప్రాయా లకు దగ్గరగానూ, ప్రస్తుత పరిణామాలపై హెచ్చరికగానూ చాగంటివారి అభివ్యక్తిని పరిగణించవచ్చు. అసలు సంస్కృతి అంటే ఏమిటి? అదెలా నిర్మితమవుతుంది?. సంగీతమూ, నాట్యమూ, చిత్రలేఖనమూ, శిల్పమూ వగైరా కళారూపాలన్నీ ఏ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తాయో, ఆయా కళారూపాలను సృజిం చిన కళాకారులు ఏ సందేశాన్ని ఈ సమాజానికి ఇవ్వాలను కుంటున్నారో వాటి సమాహారమే సంస్కృతి అంటారు చాగంటి.
వ్యవస్థలో పౌర సమాజాన్ని మూడో కార్యక్షేత్రంగా (థర్డ్ డొమెయిన్) హెగెల్, కార్ల్ మార్క్స్ వంటి దార్శనికులు నిర్ధారిం చారు. మిగతా రెండు కార్యక్షేత్రాల్లో ఒకటి ఉత్పత్తి సంబంధా లతో కూడిన ఆర్థిక రంగమైతే, రెండవది రాజకీయ రంగం. పౌర సమాజంలో వేర్వేరు భాగాలుగా ఉండే కుటుంబం, కులం, మతం లేదా కార్మికులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రకాల ఆలోచనారీతులు, భావజాలాలు, కళలు– సాహిత్యం, వ్యక్తిగత–సమష్టి జీవనం, వీటన్నింటి ద్వారా ప్రసరించే ఒక ప్రాపంచిక దృక్పథమే సంస్కృతని ఇటాలియన్ మార్క్సిస్టు తత్వవేత్త గ్రామ్‌సీ నిర్వచించారు. అయితే దేశ–కాల పరిస్థితులను బట్టి అక్కడ ఆధిపత్య భావజాలం ఆ సంస్కృతిని ప్రభావితం చేస్తుందని కూడా గ్రామ్‌సీ అభిప్రాయపడ్డారు.
శాస్త్రవిజ్ఞాన రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేసిన సర్ ఐజాక్ న్యూటన్ ఒక గొప్ప మాటన్నాడు. "If I have seen further, it is by standing on the shoulders of giants ’’. దాని తాత్పర్యం.. ‘‘ఇవాళ నేను కొత్త దూరతీరాలను దర్శించ గలుగుతున్నానంటే, మహామహుల భుజాలపై నేను నిలబడి ఉండటమే అందుక్కారణం’’. అప్పటికే ఎంతోమంది తత్వ వేత్తలు, శాస్త్రవేత్తలు శ్రమించి, శోధించి ప్రోదిచేసిన విజ్ఞాన భూమిక ఆసరాతోనే మనం కొత్త విజయాలను సాధించగలుగు తున్నామని ఆయన భావన. ఈరోజున మన పౌర సమాజం రూపొందించుకున్న సంస్కృతీ–విలువలు, దిద్దుకున్న ప్రాపం చిక దృక్పథం, ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ.. ఇవన్నీ కూడా వేనవేల సంవత్సరాల పాటు మానవ జాతి నిరంతరం సంఘర్షించీ, సంశోధించీ, స్వప్నించీ, తపించీ చేరుకున్న మజిలీల్లోని ఉన్నతస్థాయి రూపాలు. ‘భూగోళం పుట్టుకకోసం రాలిన సురగోళాలెన్నో... ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో...’ అన్నారు మహాకవి దాశరథి.
ఈ మానవరూపం సంప్రాప్తించిన తర్వాత సంస్కృతీ– విలు వలతో కూడిన నాగరిక సమాజం రూపొందడానికి కూడా జరి గిన పరిణామాలెన్నో. చెలరేగిన యుద్ధాలకూ, తెగిపడిన శిర స్సులకూ, ప్రవహించిన నెత్తురుకూ లెక్కలు లేవు. దురా క్రమించి చెరబట్టే అలెగ్జాండర్లనూ, చెంఘిస్‌ఖాన్‌లను చరిత్ర మోసింది. బానిస సంకెళ్లను తెంచడానికి స్పార్టకస్‌లూ, చేగు వేరాలూ చరిత్రలో మొలకెత్తారు. మూడు ఖండాలను ఏలిన రోమ్ సామ్రాజ్యం పతనమైంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించింది. హిట్లర్, ముస్సోలినీలు ఓడి పోయారు. గాంధీలు, మండేలాలు గెలిచారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థది పైచేయి అయింది. అందులో భారత్ అత్యున్నత స్థానాన్ని అధిష్టించింది.
భారతీయ సంస్కృతిని ‘గంగా–యమునా తెహజీబ్’ అంటారు. అంతటి సహజమైన సంగమ, సమ్మిళిత సంస్కృతి ఈ దేశానిది. ఈ సంస్కృతికి వెయ్యేళ్ల కథ ఉన్నది. ఈ కథలో తులసీదాస్ ఉన్నాడు, కబీర్‌దాస్ ఉన్నాడు, గురునానక్ ఉన్నాడు. స్వామి వివేకానంద, మదర్ థెరిసా, అబ్దుల్ కలామ్ ఆధునిక భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లు. గంగా–యమునా తెహజీబ్ ఫిలాసఫీని భారత రాజ్యాంగంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేర్చారు. ఆరాధనా స్వేచ్ఛ మన ప్రాథమిక హక్కు. విశ్వాసాల ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపడాన్ని రాజ్యాంగం అంగీకరించదు. భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి దక్షిణ భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరింత పటిష్టంగా ఉన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదగిరి అనే పేరు ఎంతమందికి ఉంటుందో సైదులు అనే పేరు కూడా అంతమందికి ఉంటుంది.
నెల్లూరు జిల్లాలో రమణారెడ్డి పేరుతో ఎంతమంది ఉంటారో మస్తాన్‌రెడ్డి పేరుతో కూడా అంతమంది ఉంటారు. తెలుగు ప్రజలకు తిరుపతి తర్వాత నంబర్ టూ పుణ్యక్షేత్రం షిర్డీ. విజయవాడలో కనక దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఎంత కోలాహలంగా ఉంటాయో, మేరీమాత ఉత్సవాలు కూడా అంతే సందడిగా ఉంటాయి. కడివెడు పాలలో విషం చుక్క కలిపినట్టు గంగా–యమునా తెహజీబ్ సంస్కృతిని కలుషితం చేయడానికి సాక్షాత్తు ఒక సీని యర్‌మోస్ట్ రాజకీయ నాయకుడు ఇప్పుడు కంకణం కట్టుకున్న వైనం చూసి తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆ మహానాయకుడికి దళితులంటే గిట్టదు. ఆ సంగతి ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. దళితులకు చదువు అబ్బదు అనేది ఆ పార్టీ ఫిలాసఫీ. బీసీలకు తెలివితేటలుండవు కనుక, వాళ్లు జడ్జీలుగా పనికిరారని ఆయన నిశ్చితాభిప్రాయం. ఈమేరకు కేంద్ర న్యాయశాఖకు ఆయన ఉత్తరం కూడా రాశాడు. గిరిజన జాతుల ప్రజలు మంత్రులుగా పనికిరారనే అభిప్రాయం కూడా. ఆయన ఐదేళ్ల కాలంలో చివరి నాలుగు నెలలు మాత్రమే అదీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక గిరిజనుడికి మంత్రి అవకాశం కల్పించారు. ఇప్పుడు క్రైస్తవులు, ముస్లిములు, బౌద్ధులు మొద లైన మైనారిటీ మతస్తులు ముఖ్యమంత్రులుగా వుండకూడదని చాటింపు వేస్తున్నారు. ‘ముఖ్యమంత్రి క్రైస్తవుడు, జెరూసలేం వెళ్తాడు, నేను హిందువును తిరుపతికి వెళ్తాను’ అని ఆయన చేసిన బహిరంగ ప్రకటనను పిండితే వచ్చే అర్థం అదే. ఈ ప్రక టన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం.
ఈ వ్యాఖ్యలలో ఆయన ప్రజాస్వామ్యం మీదనే కాదు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద కూడా తీవ్రమైన దాడికి పాల్పడ్డాడు. అమెరికా చట్టసభల భవనం మీద ట్రంప్ అనుయాయులు చేసిన దాడి కంటే ఇది తీవ్రమైనది. ఆ దాడి బయటకు కనిపించే గాయాన్ని చేసింది. ఈ దాడి మన పౌరసమాజం గుండెకు గాయాన్ని చేసింది. గడిచిన వారం ప్రజాస్వామ్య వ్యవస్థలకు చేటుకాలం. ఈ రెండు ఘటనల వెన్నంటే ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈయన వ్యవహారం హరిశ్చంద్ర నాటకంలో నక్షత్ర కుని పాత్రను గుర్తు చేస్తున్నది. తన యజమాని విశ్వామిత్రుని సంతృప్తిపరచడం కోసం నక్షత్రకుడు ఎంత అతిగా వ్యవహరిం చాడో, తనకీ పదవిని కల్పించిన నాయకుడిని సంతృప్తిపరచడం కోసం ఈ వ్యక్తి అంతకంటే ఎక్కువ అతిగా వ్యవహరించడం జనం దృష్టిలో పడింది. ఎన్నికల కోడ్ సాకుతో పేదల ఇళ్లస్థలాల పంపిణీని అడ్డుకోవడం, 45 లక్షలమంది మహిళలకు ఉపయోగ పడే అమ్మఒడి పథకాన్ని అడ్డుకోవడం ద్వారా తమ ‘నాయకుని’ మెప్పుపొందడం కోసమే ఈ అకాల షెడ్యూల్‌ను ప్రకటించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేదవర్గాల అభ్యున్నతి అంటే ఏమాత్రం సహించలేని ఈ నాయకునికి వెన్నుదన్నుగా వున్న కోస్తా సంపన్నవర్గాల విజయ యాత్ర ఎప్పుడు ప్రారంభమైందో ఒకసారి గుర్తుకు చేసుకుం దాము. ఆరేడు దశాబ్దాలకు పూర్వం ఈ వర్గాల్లోని పెద్ద రైతులు వ్యవసాయంలో భారీగా లాభాలు తీయడం ప్రారంభించారు. ట్రాక్టర్లు, యంత్ర పరికరాలేవీ ప్రవేశించని ఆ రోజుల్లో ఏసయ్యలూ–సుబ్బయ్యలూ కండలు కరిగించిన ఫలితంగా, ఎలీశమ్మలూ–సుశీలమ్మలూ చెమటలు ధారపోసిన కారణంగా బంగారు పంటలు పండి లాభార్జన సాధ్యమైంది. ఆ లాభాలతో వారు వ్యాపార సామ్రాజ్యంలోకి ప్రవేశించారు. సినిమా పరిశ్రమను ఆక్రమించారు. మీడియా ప్రపంచాన్ని హస్తగతం చేసుకోగలిగారు. ఇప్పుడీ మీడియా–వ్యాపార సామ్రాజ్యాల అండదండలతోనే వారి నాయకుడు పేదవర్గాలపై యుద్ధం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో ఆ పార్టీ సిద్ధాంతాన్ని ఎన్టీ రామారావు ఒక్క వాక్యంలో ప్రకటిం చారు. ‘‘సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్లు’. ఇదే తన ఎజెండా అని ఆయన ప్రకటించుకున్నారు.
‘మానవసేవయే మాధవసేవ’ అన్నాడు వివేకానందస్వామి. దేవుడు ఎక్కడో లేడు నీ ఎదురుగా ఆకలితో అల్లాడుతున్న పేదవాడిలోనే ఉన్నాడు. అతడికి సాయపడు అన్నాడు. పేదవాడిలో సాక్షాత్తు నారాయణ స్వరూపాన్ని వివేకానందుడు చూశాడు. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో అద్భుతమైన ప్రసంగం చేస్తూ ‘నా దేశం సకల మతాలకు నిలయమ’ని సగర్వంగా ప్రకటించు కున్నాడు. ‘నా దేశం పరమత సహనాన్ని ప్రపంచానికి బోధిం చిన దేశం. అన్ని మతాలూ సత్యమైనవే. అన్ని మతాలూ నిత్యమైనవే అని నమ్మే దేశం నాది’ అని వివేకానందుడు ప్రక టించాడు. వివేకానందుని బోధనలా? లేక కొందరు కొత్త బిచ్చ గాళ్లు ఒంటినిండా దిద్దుకుంటున్న నామాలా?... ఏవి హిందుత్వ ప్రతీకలు?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదేమిటి? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు విప్లవాత్మకమైనవి కావా? దారిద్య్రంలో ఉన్న ప్రజలకు ఆత్మగౌరవ జీవితాన్ని ప్రసాదించ డానికి ప్రయత్నించడం పేదవాడిలో నారాయణ స్వరూపాన్ని దర్శించడం కాదా? నిలువ నీడలేని పేద కుటుంబానికి సొంత ఇల్లు కట్టించి ఇవ్వడం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను ప్రతిబిడ్డకు జన్మ హక్కుగా అమలుచేయాలనుకోవడం, నాణ్య మైన వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందుబాటులోకి తేవడం, ప్రతి రైతూ, ప్రతి కూలీ, ప్రతి పేదా ఉన్నత జీవనాన్ని అందు కునేందుకు ఆలంబనగా నిలబడాలనుకోవడం మానవ సేవ కిందకు రావా? మానవసేవే మాధవ సేవ అన్నారు మహా త్ములు. వివేకానందుడు చెప్పిన హిందూత్వ స్ఫూర్తి కూడా అదే.
మానవ సేవనే మేనిఫెస్టోగా అమలు చేస్తున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆ మానవసేవా కార్యక్రమాలను అడ్డుకుంటున్నది ప్రతిపక్ష నేత. ఇప్పుడు హిందువులకు బంధువులెవరో, హిందు వుల పాలిట రాబందువులెవరో స్పష్టంగా కనిపించడం లేదా! కేవలం ఒక వ్యక్తి, ఆయన తైనాతీలు తమ స్వార్థంకోసం, మన జాతి వందలయేళ్ల కాలగమనంలో నిర్మించుకున్న సంస్కృతిని విలువలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర పౌరసమాజం అప్రమత్తంగా ఉండవలసిన తరుణం.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment