అయ్యో... sad news, RIP.
ఈ మెసేజ్ టైప్ చేయవలసిన అవసరం రాని ఒకరోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాము. పరిచయస్తుడు, ప్రాణ స్నేహితుడు, సహోద్యోగి, సహాధ్యాయి, పొరిగింటి మనిషి, ఎప్పుడో మనకు సాయం చేసిన వ్యక్తి, రోజూ వీధిలో కనిపించే మనిషి, మన బంధువు... ఇలా ఎవరో ఒకరు లేదా ఇద్దరు ప్రతి రోజూ కలవరపాటుకు గురిచేస్తున్నారు. గుండె దిటవు చేసు కోవాలని మన నాయకులు ఉద్బోధిస్తున్నారు. కరోనాపై తాము చేస్తున్న యుద్ధం తాలూకు జమాఖర్చులను చెప్పుకొస్తున్నారు. ఈ యుద్ధంలో గెలిచి తీరుతాం భయపడకండని భరోసా ఇస్తు న్నారు. బతుకు మీద తీపి కదా!. ధైర్యమనే దీపం ఎవరు వెలి గించినా ఎంతో ఊరట కలుగుతుంది.
నిరంతరం నీళ్లు పారవలసిన జీవనది గంగలో నిర్జీవ నరా వతారాలు ఎందుకు ప్రవహిస్తున్నాయి?. ప్రశ్నించాలని మన మనసులో ఉంటుంది. జనం మనస్సులను చదివే నాయకత్వం మనకుంది. అడక్కుండానే సంజాయిషీలు ఇచ్చుకున్నారు. ఆ శవాలది తమ రాష్ట్రం కాదని రెండు రాష్ట్రాల నేతలు ముల్కీ రూల్స్ చెప్పుకొచ్చారు. గంగ పుట్టిన గంగోత్రి ఈ దేశంలోనే ఉన్నది కనుక, జాతీయ నాయకత్వం దాటవేయలేక పోయింది. అవి భారతీయుల భౌతికకాయాలే. హిందూ శ్రాద్ధ సంస్కారం గంగలో కలిసిపోయింది.
శ్మశాన వాటికల్లో రెట్టింపు శవాలు దహనమవుతున్నాయి. వంతుకోసం మరిన్ని శవాలు క్యూలైన్లలో వేచి ఉంటున్నాయి. బహుశా... బతికి ఉన్నప్పుడు ఆస్పత్రిలో బెడ్డు కోసం, ఆ పిదప ఆక్సిజన్ సిలిండర్‌కోసం వేచి ఉన్న అనుభవం ఇప్పుడు అక్కర కొస్తున్నది. భౌతికదూరం పాటిస్తూ వరుసక్రమంలో దహనం కోసం శవాలు వేచి ఉంటున్నాయి. శవాలు కాలుతున్న కమురు వాసన క్రమంగా అలుముకుంటున్నది. దీప నిర్వాణ గంధం పరివ్యాపితమవుతున్నది. నాసికలకు మరో వాసన తెలియడం లేదు. వాతావరణంలో ఆమ్లజని మందగిస్తున్నది. ఆ స్థానాన్ని ఆందోళన ఆక్రమిస్తున్నది. పోలీసు అకృత్యానికి బలైపోతూ ‘ఐ కాంట్ బ్రీత్’ అన్న జార్జి ఫ్లాయిడ్ ఆఖరి మాటలు అమెరికాను కుదిపేశాయి. ఆ మాటల ప్రతిధ్వనులతో అమెరికా అధ్యక్ష పీఠమే కదిలి పోయింది. ఇప్పుడు అదే మాట మన ఊరూవాడా ఇంటింటా ప్రతిరోజూ వినపడుతున్నది.
ఇటువంటి ఎన్నో వార్తలు, వాస్తవాలు భీతిగొలుపుతు న్నాయి. సాంత్వన కోసం ప్రభుత్వం వైపు చూడక తప్పని పరి స్థితి. ప్రభుత్వ పెద్దలు నిజాలు చెబితే బాగుండునని మనసు కోరుకుంటున్నది. వారు చెప్పే లెక్కల్లో చాలా తప్పులున్నాయని ఇంగితజ్ఞాన పదార్ధం మాటిమాటికీ నస పెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం పారదర్శకత మీద దట్టమైన అనుమానపు చీకట్లు అల్లుకున్నాయి. భారత ప్రధానమంత్రి మీద ఈ దేశ ప్రజలకు చాలా గౌరవం. అనాలోచితమైన నోట్ల రద్దు నిర్ణయంతో జన జీవితాలను అతలాకుతలం చేసినప్పటికీ, ఆ గౌరవభావం వల్లనే ఆయన్ను మళ్లీ ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆ గౌరవం చెక్కుచెదరకుండా ఉండేటందుకు ఆయన తన ఆహార్యాన్ని కూడా మార్చుకున్నారు. అద్భుతమైన ఒక నేత కళాకారుడు వెండి జరీతో శ్రద్ధగా నేసినట్టు మెరిసిపోయే ఆయన గడ్డాన్ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. ఆయన మూర్తి టీవీలో కని పించినా సరే రాజర్షి విశ్వామిత్రుని సందర్శన భాగ్యం కలిగి నంత తృప్తి మిగులుతుంది.
కరోనా మొదటి తరంగం మందగించగానే, జనవరిలో ప్రధానమంత్రి విజయఢంకాను మోగించారు. కరోనాపై భారత్ విజయం సాధించిందని ప్రకటించారు. భారతదేశం పెద్దఎత్తున వ్యాక్సిన్లను తయారుచేయబోతున్నదనీ, ప్రపంచ దేశాలను కూడా మా వ్యాక్సిన్లతో ఆదుకుంటామని తన ఔదార్యాన్ని కూడా చాటుకున్నారు. అదే నెలలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం కూడా కరోనాపై విజయానికి మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేసినట్టు గుర్తు. సరిగ్గా నెల గడిచేసరికి కరోనా రెండో తరంగం ఒక సునామీగా రూపు దిద్దుకోవడం ప్రారంభమైంది.
ఈ సునామీ గురించిన ముందస్తు వాతావరణ హెచ్చరిక ప్రధానికీ, కేంద్ర ప్రభుత్వానికీ ఉన్నదని కూడా ఇటీవల సీసీ ఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ప్రకటించారు. ముందుగా తెలిసినప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి సన్నాహా లనూ చేయలేదని, రాష్ట్రాలను అప్రమత్తం చేయలేదనీ ఇప్పుడు కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్నది. పైపెచ్చు, ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో గెలవడంకోసం ఈ సునామీని విస్మరిం చారనీ, వచ్చేయేడు జరిగే యూపీ ఎన్నికలను ప్రభావితం చేయడం కోసం కుంభమేళాను అనుమతించారనీ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికారపక్షం దగ్గర సమా ధానం లేకుండా పోయింది. ఈ రెండు సందర్భాలు సెకండ్ వేవ్‌కు కావల్సినంత ఆజ్యం పోశాయి. ఈ పూర్వరంగ తప్పిదాలన్నింటినీ వదిలేసినా, ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా మారిన సార్వత్రిక వ్యాక్సినేషన్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లోపిం చింది. చిత్రవిచిత్రమైన నిర్ణయాలు, విధానాల మార్పులు ప్రజ లను గందరగోళ పరుస్తున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజ నాలకే ప్రభుత్వం ప్రాధాన్య మిస్తున్నదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచీ నేటివరకూ యూని వర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. శిశు మరణాలను నియంత్రించడం కోసం డెబ్బయ్యేళ్లుగా కేంద్రం అమలుచేస్తున్న ఈ సార్వత్రిక టీకా కార్యక్రమం ఘనవిజయం సాధించిన అనుభవం మన ముందున్నది. ఈ విధానం ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వరంగ సంస్థలు తయారుచేసిన వ్యాక్సిన్లను కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తుంది. కేంద్రం భారీ స్థాయిలో కొనుగోలు చేయడం, మరో కొనుగోలుదారుడు రంగంలో లేకపోవడం వల్ల వ్యాక్సిన్ ధరలపై బేరమాడే శక్తి కేంద్రానికే ఉంటుంది. ధరలపై అదుపు ఉంటుంది. ఇప్పుడు ఈ సంప్రదాయ విధానాన్ని వదిలేయడం ద్వారా కేంద్రం తన రాజ్యాంగ విహితమైన బాధ్యత నుంచి తప్పుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలను అమ్మకందార్ల మార్కెట్ (sellers market)కు అప్పగించడం జరిగిందని సుప్రీంకోర్టు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ‘బార్ అండ్ బెంచ్’ అనే లీగల్ వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో వాదించారు. రాజ్యాం గంలోని 7వ షెడ్యూల్ మూడో జాబితా నిర్దేశం ప్రకారం రాష్ట్రాల మధ్య అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయవలసి ఉంటుంది. కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించిన విధానం ప్రకారం దేశంలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న రెండే రెండు సంస్థలు, సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు 50 శాతం వ్యాక్సిన్లను 150 రూపా యల చొప్పున కేంద్రానికి అమ్మాలి. మిగిలిన యాభై శాతం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ ధరకు కంపె నీలు అమ్ముకోవచ్చు. వ్యాక్సిన్ల సత్వర సేకరణకోసం రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడుతుంది. మరోపక్కన ప్రైవేట్ సంస్థలతో పోటీపడాలి. ఇక్కడ బేరమాడే శక్తి అమ్మకందారుకే (కంపెనీలు) ఉంటుంది. ఈ విధానం ప్రాథ మిక హక్కుల్లో భాగమైన ఆర్టికల్ 14, 21లకు విరుద్ధమని ఆనంద్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు.
ఈ రెండు సంస్థలూ ఇప్పుడు కేంద్రానికి ఒక్కో వ్యాక్సిన్‌ను 150 రూపాయల చొప్పున అమ్ముతున్నాయి. ఉత్పత్తి చేసిన అన్ని వ్యాక్సిన్లనూ 150 చొప్పున అమ్మినా కూడా తాము లాభా ల్లోనే ఉంటామని సీరం ఇన్‌స్టిట్యూట్ అధిపతి అదార్ పూనా వాలా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పుకున్నారు. అటు వంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సీరమ్ (కోవిషీల్డ్) 300 రూపా యలకూ, భారత్ బయోటెక్ (కోవాగ్జిన్) 400 రూపాయలకూ అమ్మడమేమిటి? ప్రైవేట్ ఆస్పత్రులకూ, సంస్థలకు 600, 750 చొప్పున అమ్మడమేమిటి? ఇందుకు కేంద్ర ప్రభుత్వం తందానా అంటూ తలాడించడమేమిటి? ఇందులో ఉన్న మర్మమేమిటో ఈ దేశ ప్రజలు తెలుసుకోగోరడం తప్పెలా అవుతుంది? అసలు ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ప్రకటించిన వ్యాక్సిన్ పాలసీని ఎందుకు మార్చినట్టు?. ఈ విధానం ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు తీసుకునే ‘అర్హులందరికీ’ ఉచితం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకునే వారు రూ.250 చెల్లించాలి. ఈ ‘అర్హుల’ జాబితాలో వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, తొలిదశలో 60 యేళ్లు దాటినవారు, తర్వాత 45–60 మధ్యవయసు వారూ ఉన్నారు. ఈ విధానాన్ని మార్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద, ప్రజల మీద భారం పడేవిధంగా కొత్త పాలసీని తీసుకురావడానికి గల కారణాలేమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా?
ఇక్కడ అతిముఖ్యమైన అంశం... వేగంగా వ్యాక్సిన్లు ప్రజ లందరికీ అందుబాటులోకి తెచ్చేవిధంగా ఉత్పత్తిని పెంచడం. భారతదేశంలో ప్రస్తుతానికైతే ఉత్పత్తి చేస్తున్న సంస్థలు సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ మాత్రమే. ఈ రెండూ కలిసి నెలకు ఏడుకోట్ల వ్యాక్సిన్ల చొప్పున ఉత్పత్తి చేస్తున్నాయి. కనీసం 200 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేస్తేగానీ భారత్ సామూహిక రోగనిరోధక శక్తి (Herd immunity) సంతరించుకునే దశకు చేరుకోదు. నెలకు ఏడు కోట్ల చొప్పున ఏనాటికి 200 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమయ్యేను? ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారత ప్రధానికి ఒక లేఖ రాశారు. ఇప్పుడు భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ టెక్నాలజీని భారత ప్రభుత్వ సంస్థలైన ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు అభివృద్ధి చేసిన విష యాన్ని గుర్తుచేశారు. ఆ టెక్నాలజీని మరికొన్ని సంస్థలకు బదిలీ చేస్తే తప్ప అవసరమైన మేరకు వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసుకో లేమని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సామర్థ్య మున్న మరికొన్ని భారతీయ సంస్థలకు టెక్నాలజీని బదిలీ చేయాలని ప్రధానికి ఆయన సూచించారు. భారత ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేసిన విజ్ఞానంపై ప్రైవేట్ సంస్థకు గుత్తాధి పత్యమేమిటో, ఇందులో ప్రజలు తెలుసుకోగూడని చిదంబర రహస్యమేమిటో కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి. విజ్ఞానం దేశా నిది, వ్యాపారం ప్రైవేటుది. ఏమిటో ఈ వైచిత్రి.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖకు దేశవ్యాప్తంగా మద్దతు రావడంతో, కప్పదాటుగానైనా కేంద్రం స్పందించక తప్పలేదు. నిజానికి ఈ కీలకమైన అంశంపై కేంద్రంలోని రాజకీయ నాయ కత్వం స్పందించాలి. అలా స్పందించకుండా నీతిఆయోగ్‌లో వైద్య–ఆరోగ్య వ్యవహారాలు చూసే వీకే పాల్‌తో మాట్లాడిం చారు. ఆయన అనేక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ అంశంపై మాట్లాడారు. వైఎస్ జగన్ రాసిన లేఖ విషయం ప్రస్తావించకుండా, సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందనీ, అయితే ఆ వ్యాక్సిన్ ఉత్పత్తికి బీఎస్‌ఎల్–3 సామర్థ్యం ఉన్న కంపెనీలు ఉండాలనీ చెబుతూ రెండు వాక్యాల్లో ఈ అంశాన్ని ముగించారు. అదే రోజున డిసెంబర్ నాటికి దేశంలో 216 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి కాబోతున్నదంటూ ఒక కాకి లెక్కను మీడియా ముందుంచి అది ప్రముఖంగా ప్రచారమయ్యేట్టు జాగ్రత్తపడ్డారు. అవసరమైనంత వ్యాక్సిన్ ఉత్పత్తి కాబోతున్నది కనుక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయ వలసిన అవసరం లేదనేది కేంద్ర ప్రభుత్వం యొక్క కవి హృద యంగా మనం భావించాలి. ఈమేరకు కేంద్రం ప్రకటించిన ఉత్పత్తుల్లో చాలావరకు ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ ప్రస్తుతం నెలకు ఆరుకోట్ల డోసులు. దీన్ని ఆగస్టు నాటికి పదికోట్లకు పెంచుతా మని, ఆ తర్వాతి నెలల్లో కూడా అదే స్థాయిలో ఉత్పత్తి చేస్తామనీ ఆ సంస్థ చెబుతున్నది. ఈ లెక్కన డిసెంబర్ నాటికి 50 కోట్ల డోసులు దాటదు. కానీ, ప్రభుత్వ ప్రతినిధి కోవిషీల్డ్ 75 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భారత బయో టెక్ సంస్థకు ప్రస్తుతం కోటి నుంచి కోటిన్నర వరకు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి అందించిన సమాచారం ప్రకారం ఈ సంస్థ సామర్థ్యం జూలైలో 3.3 కోట్లకూ, ఆగస్టులో 7.8 కోట్లకు పెరగాలి. ఈ ప్రకారం ఆగస్టు–డిసెంబర్ మధ్య ఐదు నెలల కాలంలో 39 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి భారత్ బయోటెక్ ఖాతాలో 55 కోట్ల డోసులు వేశారు.
మీడియా సమావేశంలో కేంద్ర ప్రతినిధి సన్నాయి నొక్కుల లెక్క ప్రకారం బీఎస్‌ఎల్–3 సామర్ధ్యం ఉన్న ఫార్మా కంపెనీలు హైదరాబాద్ చుట్టుముట్టే 12 వరకు ఉన్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. దేశం మొత్తంలో ఇంకా ఎక్కువే ఉంటాయి. మనదైన విజ్ఞానాన్ని ఇతర కంపెనీలకు బదిలీ చేసి పెద్దఎత్తున ఉత్పత్తి చేసే రాచబాటను వదిలేసి, ఈ ఊహాజనిత దారులను ఎందుకు వెతుక్కుంటు న్నారో మనకు అర్థం కాదు. ఒకపక్క మహమ్మారిని ఎదుర్కో వడానికి పేటెంట్ హక్కులను సడలించాలని, విజ్ఞానాన్ని అందరికీ పంచాలని ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం నడుస్తున్నది. ఈ డిమాండ్‌ను అధికారికంగా చేసిన వంద దేశాల్లో భారత్ ప్రముఖమైనది. అంతర్జాతీయ విధానానికి– దేశీయ విధానానికి మధ్యన ఈ వైరుధ్యమెందుకు? జాతీయ విజ్ఞానాన్ని జాతి ప్రజలకు అంకితం చేయకుండా అడ్డు పడు తున్న ఆ మాయదారి రోగమేమిటో ప్రజలకు తెలియ జెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
వ్యాసకర్త: వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment