చికిత్స ఎప్పుడూ రోగం కన్నా ఘోరంగా ఉండకూడదు. అల్‌ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల తాట తీస్తామని అమెరికా అఫ్గాన్‌లో చేరింది. ఇదే అఫ్గాన్ నుంచి 1990లలో రష్యా వైదొలగిన నాటి కంటే, 2001లో అమెరికా అక్కడ కాలూనిన నాటికంటే, తాను అర్థాంతరంగా వైదొలగుతున్న నేటి పరిస్థితులే దారుణం. 3 లక్షల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు, శిక్షణ-ఆయుధాల కోసం తొమ్మిది వేల కోట్ల డాలర్లు (రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఇంత చేసి అమెరికా, నాటో దేశాలు ఏం సాధించినట్టు?
నేలను చీల్చుకువచ్చే పచ్చని పసరికను ఎంతో ఆశావహంగా చూస్తుంది ప్రపంచం. ఆకుల స్వరూపం ఏర్పడని లేతపిలక ఏం మొక్కై ఉంటుందా? అన్న ఆసక్తి చూపరులకు సహజం! ఎవరి సంగతెలాఉన్నా.... విత్తు అలికిన వాడికి తెలుస్తుంది మొలుచుకు వచ్చే మొక్క ఏంటో? అమెరికా అధ్యక్షుడు బైడన్ మాటలు... ‘‘ఇంకా ఒకటో, ఐదో, ఇరవయో.. ఏళ్లు మేం ఇక్కడే ఉండి సహాయం చేసినా, అప్పటికీ తుది ఫలితం ఇలాగే ఉంటుంది’’ అని అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంపై చేసిన వ్యాఖ్యలు సాపేక్షంగా ఇదే వెల్లడిస్తాయి. ‘పుల్లగుంజుడు ఆట’లో నెపం నెత్తిన పడ్డ ఆఖరివాడు బైడన్... ఓ నలుగురు అమెరికా అధ్యక్షులు, ఇరవై ఏళ్ల కాలం, వేల కోట్ల డాలర్ల సాక్షిగా జరుగుతున్న మారణ హోమమిది. పెనంలోంచి పొయ్యిలోకి పడ్డ అఫ్ఘాన్ తాజా దుస్థితి కారణాల్లో అమెరికా మొదటిది. ఎందుకంటే, తమ గూడాచార సంస్థ సీఐఏని వాడి తాలిబన్లను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది అమెరికాయే! రష్యా, చైనాలకు వ్యతిరేకంగా మొదట తాలిబన్లను, వారి స్థావరాలను పెంచి పోషించింది. తర్వాత వారు రష్యాకు దగ్గరైన పరిస్థితులు అమెరికా వైఖరిలో మార్పు తెచ్చాయి. ఉగ్రవాద ముప్పు వేడి తమకు తాకిన ‘జంట భవనాల విధ్వంసం’ తర్వాత అఫ్గానిస్తాన్నే స్వాధీనపరచుకుంది. అల్‌ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల పీఛమణచడానికని నాటో మిత్ర దేశాల సహకారంతో తిష్ట వేసింది. అఫ్గానిస్తాన్‌ని సుస్థిర–ఆధునిక దేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి, అందుకు భిన్నంగా గడచిన రెండు దశాబ్దాలుగా చేస్తున్న నిర్వాకం కూడా బైడన్ మాటల వెనుక నుంచి తొంగి చూసింది. తాలిబన్లతో ఒప్పందం, దేశం నుంచి వైదొలగిన సమయం, కార్యాచరణ తీరు, వైఖరి సమర్థన... ఇదంతా ఘోర వైఫల్యాల శృంఖలం. మరోవైపు, ‘ఇప్పుడు మేం మారిన మనుషులం, విధానాలు మార్చుకున్న పాలకులం’ అంటున్న తాలిబన్ల మాటల్ని అంతర్జాతీయ సమాజం వింతగా చూస్తోంది. ఏ మాత్రం ప్రతిఘటన ఎదుర్కోకుండా కాబూల్‌ని స్వాధీనపరచుకున్న ఆదివారం నుంచి తాలిబన్లు చెబుతున్న మాటలకు భిన్నంగా గత 24 గంటల్లో హింసాత్మక పరిణామాలు, తాలిబన్లు సంయమనం కోల్పోయిన ఉదంతాలు సందేహాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి (యూఎన్) తో సహా ముఖ్య దేశాలు ఒకటొకటిగా స్పందిస్తున్నాయి. (కనీసం మా బిడ్డల్ని అయినా కాపాడండి! బావురుమంటున్న అఫ్గన్లు వైరల్ వీడియో)
భారత్ ఒంటరవుతోందా?
దక్షిణాసియాలో క్రమంగా భారత్ ఒంటరవుతోందా? విస్తరణ తత్వాన్ని పెంచుకున్న చైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ, భారత్ స్థానే దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం ఎత్తులు వేస్తోంది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) చప్పబడిన ప్రస్తుత పరిస్థితుల్లో, భారత్‌ను మినహాయించి, మెజారిటీ సార్క్ సభ్యదేశాలతో చైనా కొత్తగా జట్టుకడుతోంది. ఈ దిశలో ‘ఒక బెల్టు, ఒక రోడు’్డ పథకం వారికి కలిసివచ్చిన అదృష్టం! ఇప్పుడు అఫ్గాన్‌లో స్వేచ్ఛ లభించిందని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ బహిరంగ ప్రకటన చేశారు. (Afghanistan: అశ్రఫ్ ఘనీ స్పందన, ఫేస్‌బుక్‌లో వీడియో)
ఇటీవలి కాలంలో, భారత్ విదేశీ విధానంలో కొట్టిచ్చిన మార్పు అమెరికాతో అతిగా అంటకాగటం! అలా అని, అమెరికా ఏమైనా భారత్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అంటే, అదేం లేదు. అమెరికాకు ఎంతసేపూ, తన ప్రయోజనాలే ముఖ్యం. అఫ్గాన్ విషయంలోనూ అదే జరిగింది. దేశం విడిచివెళ్లాక కూడా మధ్య ఆసియాపై పెత్తనానికి అమెరికా ఏర్పాటు చేసుకున్న ‘చతుష్ట కూటమి’ (క్వాడ్)లో తనతో పాటు అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్‌లను చేర్చింది తప్ప భారత్‌కు చోటు లేదు. అమెరికా శక్తిసా మర్థ్యాలపై అతినమ్మకం, ముఖ్యంగా అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికా చర్యలన్నింటికీ మద్దతిచ్చిన మనతీరు దౌత్య వైఫల్యంగానే నిపుణులు చెబుతారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇప్పటికి రెండు మార్లు భేటీ అయిన రక్షణ మంత్రివర్గ సంఘం (సీసీఎస్) వేచి చూసే «ధోరణికే ప్రాధాన్యతనిస్తోంది. ‘జియోపాలిటిక్స్’ ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఈ రోజుల్లో, పలు దేశాల సరిహద్దులతో భౌగోళికంగా ఎంతో కీలక స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్, రష్యా, చైనాలకు దగ్గరవడం... మనను అస్థిరపరిచేదే! ఎలా చూసినా ఇది భారత్‌కు ప్రమాదకరమనే భావన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా ఉగ్రవాదం–కశ్మీర్ సమస్యల దృష్ట్యా ఈ లెక్కలు. తాలిబన్లతో ఒక దొడ్డిదారి సంపర్కం భారత్‌కు ఏర్పడిందని, తద్వారానే సురక్షితంగా మన దౌత్య సిబ్బందిని కాబూల్ నుంచి ఢిల్లీ రప్పించగలిగారనీ వార్తలు.
కవలలతో ప్రపంచమే కలవరం
బయటకు పోరాడుతున్నట్టే కనిపించినా, పరస్పరం పెంచి పోషించుకునే సామ్రాజ్యవాదం, మతోన్మాదం... ఈ రెండూ ప్రమాదకర కవలలే! విస్తరణ తత్వంతో ఆధిపత్య పోరు జరిపే అగ్రరాజ్యాలు వివిధ దేశాల్లో పెట్టే చిచ్చు చరిత్ర చెప్పే సత్యం. జాతి–మత–ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి అంతర్యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధాఓలను ఆయా దేశాలపై రుద్దిన సందర్భాలెన్నో! ఉగ్రవాదాన్ని ఒక్కో సందర్భాన్ని బట్టి పుట్టించడం, పెంచి పోషించడం, పీఛమడచినట్టు వ్యవహరించడం ఈ పెద్దన్నలకు రివాజు! మతోన్మాద సంస్థలు కూడా తమ సంకుచిత ప్రయోజనాలకు, ఆయుధాలు, స్థావరాలు, డబ్బు కోసం సామ్రాజ్యవాద శక్తుల చేతుల్లో సందర్భాన్ని బట్టి పావులుగా మారతాయి. వారి స్థూల ప్రయోజనాలు నెరవేర్చి, తమ పబ్బం గడుపుకుంటాయి. చికిత్స ఎప్పుడూ రోగం కన్నా ఘోరంగా ఉండకూడదు. అల్‌ఖైదా, దానికి దన్నుగా ఉన్న తాలిబన్ల తాట తీస్తామని అమెరికా అఫ్గాన్‌లో చేరింది.
ఇదే అఫ్గాన్ నుంచి 1990లలో రష్యా వైదొలగిన నాటి కంటే, 2001లో అమెరికా అక్కడ కాలూనిన నాటికంటే, తాను అర్థాంతరంగా వైదొలగుతున్న నేటి పరిస్థితులే దారుణం. 3 లక్షల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు, శిక్షణ–ఆయుధాల కోసం తొమ్మిది వేల కోట్ల డాలర్లు (రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఇంత చేసి అమెరికా, నాటో దేశాలు ఏం సాధించినట్టు? నిజానికి ఏమీ లేదు. తన సామ్రాజ్యవాద ప్రయోజనాలు, ఆధిపత్య అవసరాలు, ఆయుధ విక్రయాలు, వ్యాపార లాభాలు... ఇవే అమెరికాకు కావాలి. కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను 2011, పాకిస్తాన్‌లో మట్టుపెట్టిన తర్వాత అఫ్గాన్‌లో అమెరికా మిషన్ ముగిసింది. తర్వాత దశాబ్దం, గడువు మించి ఉండటమే! తాలిబన్ల శక్తి–విస్తరణని, అఫ్గాన్ సైనిక చేవను, అక్కడి కీలుబొమ్మ ప్రభుత్వ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో అమెరికా ఘోరంగా విఫలమైంది. సర్కారు మనుగడ 3 నెలలని జోస్యం చెప్పినా, రెండు వారాల్లో ప్రభుత్వం చేతులెత్తి పలాయనం చిత్తగించింది. ఇదంతా, అమెరికా చరిత్రలోనే హీనమైన ఓటమికి తార్కాణమన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య అక్షర సత్యం! ఇక ఆయన నిర్వాకానికి వస్తే, అఫ్గాన్ ప్రభుత్వాన్ని, ప్రజల్ని భాగం చేయకుండా 2020 ఫిబ్రవరి, దోహా(కతర్)లో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందమే ఓ గుల్ల, ఏకపక్షం! అనుచిత జోక్యాలు, ఆధిపత్య పోకడలు, సొంత మేళ్లు, నికర నష్టాలు, జారుకొని వైదొలగడాలు అమెరికాకు కొత్తేమీ కాదు. 1970లలో వియత్నాం నుంచి, 2011లో ఇరాక్ నుంచి వైదొలగడాలూ వైఫల్యాలే తప్ప వారి ఖాతాలో విజయాలు శూన్యం! (Afghanistan: ఆమె భయపడినంతా అయింది!)
అఫ్గాన్‌లో ఛాందసవాదం వీడిన సమ్మిళిత సర్కారును అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. అప్పుడే... మహిళలు, పిల్లలు, మైనారిటీలకు రక్ష! మానవహక్కులు భద్రం! పాకిస్తాన్ నిఘా సంస్థ (ఐఎస్‌ఐ) అదుపాజ్ఞల్లో, ఇస్తామాబాద్ కనుసన్నల్లో పనిచేసే సర్కారయితే... అఫ్గాన్‌లో ఇక నిత్యం రగిలేది రావణ కాష్టమే! ప్రపంచంలోని దాదాపు ఉగ్రవాద సంస్థలన్నిటికీ అక్కడ ఇప్పటికే స్థావరాలున్నాయి. తాలిబన్ల వైఖరిని బట్టే వాటి భవిష్యత్ మనుగడ! ఉగ్రవాద పోషణకు, ఎగుమతికి అఫ్గాన్‌ను కేంద్రం చేస్తే అంతర్జాతీయ సమాజం ఉపేక్షించదు. తాలిబన్లు ఆశిస్తున్నట్టు అధికారం సుస్థిరం కావాలంటే, అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందాలంటే, వారే చెప్పుకుంటున్నట్టు వారి పంథా మారాలి. అప్పుడే తాలిబన్ల విజయం సార్థకం!
దిలీప్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment