పీసీసీ పీఠం... పరీక్షై వచ్చిన ఓ అవకాశం! | Dilip Reddy Writes Guest Column About PCC Post | Sakshi
Sakshi News home page

పీసీసీ పీఠం... పరీక్షై వచ్చిన ఓ అవకాశం!

Published Sat, Sep 14 2024 8:57 AM | Last Updated on Sat, Sep 14 2024 8:57 AM

Dilip Reddy Writes Guest Column About PCC Post

నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడొచ్చారు. పీసీసీ పీఠ మెక్కనున్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పాత నాయకుడే! కాకపోతే, పాత కొత్త నాయకుల నడుమ సమ న్వయ సాధన అవసరంతో పాటు పలు సవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆయనకు పీసీసీ పీఠం దక్కింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు ముంచుకురాను న్నాయి. కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ఆధిపత్యం సాధించాలని అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ పొంచి చూస్తున్నాయి. ఈ ఎన్నికలు పార్టీగా కాంగ్రెస్‌కు, పీసీసీ అధినేతగా మహేశ్‌ గౌడ్‌కు ప్రతిష్ఠాత్మకమే!

తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిభ, వ్యూహం, శ్రమలను మేళవించి స్వయంగా ఎదిగారు. అతి తక్కువ కాలంలో ఆశించిన లక్ష్యం చేరుకున్న సాహసి! ఆయన ఆశీస్సులుండటం పీసీసీ కొత్త నేత మహేశ్‌కు కలిసివచ్చే అంశం. అదే సమయంలో, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంతో కాంగ్రెస్‌ పార్టీని సమన్వయపరచి విజయవంతంగా నడపటమ న్నది పరీక్షే! ఏ కోణంలో చూసినా, మహాశక్తిమంతుడైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సయోధ్య నెరపుతూ, పార్టీ సీనియర్లు నొచ్చుకోకుండా శ్రేణుల్ని పీసీసీ నేత నడపాలి. ఉభయుల సహాయ సహకారాలు పొందాలి. 

అందు లోనూ, సమయం, సందర్భం బట్టి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్త నాయకులకు, సుదీర్ఘ కాలంగా పార్టీనే నమ్ముకొని సేవలందిస్తున్న పాతతరం నాయకు లకు మధ్య సమన్వయం కుదుర్చాలి. పంతాలు, తప్పుడు అహా (ఇగో)ల వల్ల వచ్చే నష్టాల్ని ముందే పసిగట్టి, సయో ధ్యతో నివారించాలి. కీలక ప్రభుత్వ నిర్ణయాలప్పుడు, మేనిఫెస్టో అమలులో... ఎంత వరకు పార్టీ నాయకత్వానికి ప్రాతినిధ్యం కల్పిస్తారన్నది ప్రశ్నార్థకమే! డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, కాంగ్రెస్‌ ఎన్ని కల హామీల అమలు పర్యవేక్షణకు ప్రభుత్వం–పార్టీ ముఖ్యులతో ఒక కమిటీ ఉండేది. అందులో ఏఐసీసీ నాయకుడొకరు సభ్యులుగా ఉండేది. 

అటువంటి ఏర్పాటు ఇప్పుడేమైనా ఉంటుందా అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటివరకైతే... ముఖ్యమంత్రే జోడు పదవుల్లోఉండటం వల్ల ప్రభుత్వమైనా, పార్టీ అయినా ఆయనే అన్నట్టు సాగింది. సమన్వయంలో ఏ ఇబ్బందీ రాలేదు. ఢిల్లీ అధిష్టానం ఆదేశాలయితేనేం, సీఎం స్వయంగా ఏర్ప రచుకున్న వైఖరి అయితేనేం.... కీలక నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మల్లు, పీసీసీ మాజీ నేత ఉత్తవ్‌ు కుమార్‌రెడ్డి, మరో సీనియర్‌ మంత్రి శ్రీధర్‌బాబు వంటి సీనియర్లతో విధిగా ఆయన సంప్రదిస్తున్నారు. 

మీడియాలో వచ్చే ప్రకటనల్లో ఫోటోల నుంచి ముఖ్య నిర్ణయాల్లో సమాలోచనల వరకు వారికి తప్పనిసరిగా స్థానం లభిస్తోంది. పార్టీకి, పీసీసీ నేతకు, ఇతర ముఖ్య కార్యవర్గ ప్రతినిధులకు ఇటువంటి చర్చలు, సంప్రదింపుల్లో రేపు ఏ మేరకు స్థానం లభిస్తుంది? అన్నది వేచి చూడాలి! పదేళ్ల విపక్ష స్థానంలో ఉండి పోరాటాలు చేసిన తర్వాత లభించిన అధికారం కావడంతో పదవులు, హోదాలు, సేవా అవకాశాలంటూ పార్టీ ఆశావహులు నిరీక్షి స్తున్నారు. ముఖ్యమంత్రి కూడా వారి పట్ల ఉదారంగాఉండి, సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇప్పటికే కొంత మందికి నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్లు, రాజకీయ అవకాశాలు లభించినా, ఇంకా ఎదురుచూస్తున్న వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిలో అత్యధికులకు న్యాయం చేయడం ఎలా? ఈ విషయంలో పార్టీ నాయకత్వం ఏ మేర చొరవ తీసుకుంటుంది? అన్నది కూడా కీలకాంశమే! 

ఇప్పటిదాకా పార్టీ విధేయత మహేశ్‌కు పనికొచ్చింది. ఇక ముందు, విధేయతకు తోడు సమయస్ఫూర్తి, సామర్థ్యం కూడా అవసరమే! ఓపికతో అందరినీ కలుపుకు పోయే తత్వం కావాలి. నాయకత్వం విషయంలో మహేశ్‌ గౌడ్‌కు ఇది, తనను తాను నిరూపించుకోవాల్సిన అవ కాశం! ఓ పరీక్షా కాలం కూడా! సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకొని ఎదిగిన నాయకుడాయన. దాదాపు పదేళ్లు పార్టీ విద్యార్థి విభాగం (ఎన్‌ఎస్‌యూఐ) అధినేతగా ఉన్నారు. 

ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో సహా పార్టీ పలు పదవుల్లో ఉన్నారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్నపుడు గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన గౌడ సామాజిక వర్గానికి ప్రతినిధి. 1994 (డిచ్‌పల్లి), 2014 (నిజామాబాద్‌ అర్బన్‌) నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయారు. 2018, 2023లో అవకాశాలు వచ్చినా, ఏ కారణంచేతో పోటీ చేయలేదు. మిగతా సందర్భాల్లో రాజకీయ కారణాల వల్ల ఆయనకు అవకాశాలు లభించలేదు.

 సీనియర్‌ నాయ కుడు, మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో స్పర్థల వల్ల పలు అవకాశాలు తనకు రాకుండా పోయా యనే భావన ఆయనకుంది. పార్టీలో ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారనే కోపంతో, ఓ ఆరు మాసాలు పార్టీని వీడి తెలుగుదేశంలోకి వెళ్లినా, వెంటనే తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ‘తానొవ్వక నొప్పించక...’ అన్నట్టు, అందరితో సఖ్యతగా ఉండే మంచివాడని పేరున్నా... ప్రభావవంత మైన నాయకుడిగా ముద్ర స్థిరపడలేదు. ఇప్పుడిదొక అవకాశం. సరిగ్గా ఎన్నికలప్పుడు ఇతర పార్టీల నుంచికాంగ్రెస్‌లో చేరి, కనీసం గాంధీ భవన్‌ మెట్లు ఎక్కకుండానే ఎమ్మెల్యేలు అయిన వారూ ఉన్నారు. ఏ పదవీ రాక పోయినా, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకొని సేవలు అంది స్తున్న వారూ ఉన్నారు. ఈ రెండు రకాలవారి మధ్య సమన్వయం, సయోధ్య కాంగ్రెస్‌కు ఒక పెద్ద కార్యభారమే!

వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్‌పీపుల్స్‌ పల్స్‌ సర్వే సంస్థ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement