వాళ్లకు గూడూ లేదు, నీడా లేదు... భూములూ లేవు, భుక్తీ లేదు... హక్కులు లేవు, అసలు గుర్తింపే లేదు. ఏ పేరుతోనైతే వాళ్లను పిలుస్తున్నామో అది వాళ్ల పేరే కాదు. పక్క రాష్ట్రం నుంచి పొరపాటునో గ్రహపాటునో తెలుగు నేలకు వలస వచ్చి దీనస్థితిలో జీవనపోరాటం సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కుల కోసం చేయిచాచి ఆర్ద్రతగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆ వ్యధాభరిత ఆదివాసీలే ‘గొత్తికోయలు’. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా వీరు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా పొందలేక పోతున్నారు. ఈ అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా దక్కుతాయి.
దండకారణ్యంలోని బస్తర్ అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు 1980వ దశకం నుంచీ వామపక్ష తిరుగుబాటు ఉద్యమాలు ఊపందుకున్నాయి. అడవులపై నక్సలైట్ల ఆధిపత్యం పెరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల పునర్విభజనలో ఈ ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లో భాగమైంది. నక్సలైట్లకు వ్యతిరేకంగా మహేంద్ర కర్మ అనే కాంగ్రెస్ నాయకుడు 2005లో సల్వా జుడుమ్ (గోండి భాషలో ‘పవిత్ర వేట’) పేరుతో ఆదివాసులతో సాయుధ పోరాటం మొదలుపెట్టారు. రెండువైపుల తుపాకి గర్జనల మధ్య ఆదివాసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఐతే సల్వా జుడుమ్ శిబిరాలలో తలదాచుకోవాలి, లేదంటే నక్సలైట్ల వేధింపులను భరించలేక ఊరొదిలి పారిపోవాలి.
అలా వేలాది మంది ఆదివాసులు ప్రాణాలు అరచేత పట్టుకొని దండకారణ్యంలోని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషాలకు వలసపోయారు. తెలుగు రాష్ట్రాలలో వారిని గొత్తికోయలు అని పిలవడం మొదలుపెట్టారు. వాస్తవానికి గొత్తికోయలు అనే పేరు ఏ ఆదివాసీ తెగలకూ లేదు. గొత్తి అంటే కొండలు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ ప్రాంతంతో పోలిస్తే దండకారణ్యంలోని బీజాపూర్, సుకుమా, దంతేవాడ సముద్రమట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఎగువ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కారణంగా వారిని గొత్తికోయలు అని వ్యవహరించడం మొదలుపెట్టారు. వారిలో ఎక్కువ శాతం గోండులలో ఉపజాతులైన మురియా తెగకు, మిగతావారు దొర్ల తెగకు చెందినవారు. 1980వ దశకం నుంచీ వలసలు సాగినప్పటికీ 2005 నుంచి 2011 మధ్య సల్వా జుడుమ్ కాలంలోనే అధిక శాతం ఆదివాసులు చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.
ఉన్నచోటి నుంచి దేశంలో మరో ప్రాంతానికి వలసపోయి, ఎటువంటి ఆదరువూ లేనివారిని స్వదేశ విస్థాపితులుగా (ఇంటెర్నల్లీ డిస్‌ప్లేస్డ్ పర్సన్స్–ఐడీపీస్) వ్యవహరిస్తారు. బస్తర్ ప్రాంతం నుంచి వలస వచ్చిన జనాభాకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన సమాచారం లేదు. ఆదివాసుల బాగు కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా గొత్తికోయలు ఉన్నారు. అడవి మధ్యలో పోడు చేసుకొని పొట్టపోసుకోవడం తప్ప వారికి మరో ఉపాధి మార్గం తెలియదు.
దేశీయంగా విస్థాపితులైన ఆదివాసుల గుర్తింపునకు, పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్– ఆర్‌ఓఎఫ్‌ఆర్) తీసుకువచ్చింది. 2008లో కొద్దిమంది స్థానిక గిరిజనులకు భూమిపై హక్కు కల్పించి, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారిని పక్కనపెట్టారు. ఆ చట్టం నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వలస వచ్చి మూడు తరాలుగా 75 ఏళ్లపాటు సాగు చేసుకుంటున్న వాళ్లకే భూములపై హక్కు దఖలు పడుతుంది. అందులోనూ ఒక్కొక్కరికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్ల వరకు భూమిపై హక్కు కల్పిస్తారు.
అయితే, ప్రస్తుతం భూమి హక్కుల కోసం ఎదురుచూస్తున్న గొత్తికోయలు 2016 తర్వాత వలస వచ్చారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. అంతకు ముందటి ఉపగ్రహ చిత్రాలను తమ వాదనకు మద్దతుగా చూపుతున్నారు. అయితే, నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం కాకుండా దట్టమైన అడవులలో పోడు చేసుకుంటూ జీవనం సాగించే ఆదివాసుల అచూకీని ఉపగ్రహాలు ఎలా నిర్ధారిస్తాయన్న వాదనను అధికారులు పట్టించుకోవడం లేదు.
రెండు రాష్ట్రాలలోని 28 జిల్లాల నుంచి దాదాపు 13 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కు కోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. 2006 నుంచి ఇటీవలి కాలం వరకు వీటిలో అధిక శాతం దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుదారులలో మైదానప్రాంత గిరిజనేతరులు ఉన్నారనీ, అక్రమంగా అటవీ భూములు సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ అధికారులు వాదిస్తున్నారు. దరఖాస్తుల తిరస్కారాలకే పరిమితమైన అధికారులు నామమాత్రంగానైనా అర్హులకు పట్టాలు అందించడం లేదు.
భూమి హక్కుతో సంబంధం లేకుండా అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా వీరికి దక్కి ఉండేవి. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా వారు పొందలేకపోతున్నారు. వాళ్ల పిల్లలకు విద్య ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. గొత్తికోయలు అడవి మధ్యలో ఉండటం వల్ల సుదూర మైదాన ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లలేరు. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు బ్రిడ్జ్ స్కూళ్లను ప్రారంభించినప్పటికీ, ప్రాథమిక విద్య తర్వాత ముందుకు సాగడం లేదు. బాలికలు తమ ఇళ్లలో పనులకు, చిన్న పిల్లలను చూసుకోవడం వరకే పరిమితమవుతున్నారు.
బాలురు అతికష్టంగా హైస్కూలు దాకా వచ్చి అర్ధాంతరంగా ఆపేసి కూలీలుగా మారిపోతున్నారు. షెడ్యూల్డ్ తెగలుగా గుర్తింపు లేకపోవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో ప్రవేశం పొందలేకపోతున్నారు. చదువులే ఇలా ఉన్నాయంటే, ప్రజారోగ్యం మరీ దయనీయంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అడవి బిడ్డలకు అందని చందమామలు. అప్పుడప్పుడు నర్సులు రావడం, గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకుపోవడం మినహా మిగతావాళ్లకు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందడం లేదు.
హక్కులు దక్కకపోవడమే కాకుండా పుండు మీద కారం చల్లినట్లు పోలీసు కేసులు గొత్తికోయలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా గూడేలలో వయసుతో నిమిత్తం లేకుండా పురుషులు సమీప పోలీసు స్టేషన్లకు వెళ్లి హాజరు వేసి రావలసి ఉంటుంది. అలా వెళ్లినవారితో చాకిరీ చేయిస్తుంటారు. అప్పుడప్పుడు తప్పుడు కేసులతో నిరుత్సాహ పరుస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు గిరిజన గూడేలను రెవెన్యూ గ్రామాలుగా గానీ, అటవీ గ్రామాలుగా గానీ గుర్తించరు. కాబట్టి, ప్రభుత్వ లెక్కల ప్రకారం గొత్తికోయల ఆవాసాలు మనుగడలో ఉండవు. తరచుగా అటవీ అధికారులు వారిని ఖాళీ చేయించడం, వారు మరో చోట గూడు చూసుకోవడం పరిపాటిగా మారింది.
గొత్తికోయలకు గుర్తింపు ఇవ్వాలనే విషయంలో రెండు రాష్ట్రాలలోని పాలక, ప్రతిపక్షాలకు అభ్యంతరాలు లేవు. కానీ తగిన చొరవ కరవైనందున సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి కాడువడిన అడవిబిడ్డలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందించాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికులు, స్పందించే మనసున్న వ్యక్తులు కూడా దగాపడిన అడవి బిడ్డలకు ఊతమివ్వాలి. విద్య, వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి.
త్రిపురలో దశాబ్దాలుగా నలుగుతున్న ఇలాంటి సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిష్కరించింది. 1990వ దశకంలో మిజోరంలో జాతుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. బ్రూ– రియాంగ్ తెగకు చెందిన ఆదివాసులు పెద్దఎత్తున త్రిపురకు వలస వెళ్లారు. మన గొత్తికోయల మాదిరిగానే వాళ్లు కూడా స్వదేశంలో శరణార్థులై గుర్తింపు, హక్కులు లేకుండా రెండు దశాబ్దాలు దయనీయమైన పరిస్థితుల్లో జీవించారు.
2020లో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. వలస వచ్చిన 43 వేల మంది బ్రూ– రియాంగ్ ఆదివాసులకు త్రిపురలో పునరావాసం కల్పించింది. వాళ్లకు గుర్తింపునిచ్చి ఇళ్లు కట్టించింది. వాళ్ల జీవితాలలో వెలుగు నింపేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల గొత్తికోయలు కూడా సరిగ్గా బ్రూ– రియాంగ్ ఆదివాసుల మాదిరిగానే ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలు సత్వరం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి.
- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net
Comments
Please login to add a commentAdd a comment