పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా? | Harish Rao on the manifesto released by the Congress party | Sakshi
Sakshi News home page

పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?

Published Sat, Nov 2 2024 2:47 AM | Last Updated on Sat, Nov 2 2024 2:47 AM

Harish Rao on the manifesto released by the Congress party

అభయ హస్తం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.2 వేలు నెలవారీ పింఛన్‌ తీసుకుంటున్న వారందరికీ రూ.4 వేలు ఇస్తామనీ, దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచుతామనీ హామీ ఇచ్చారు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్‌ పెంచి ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పెంచలేదు. వృద్ధులు, ఒంటరివాళ్లు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. 

ఫించన్‌ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా జీవితం గడుపగలుగుతారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్‌ డబ్బులు పెంచితే వాళ్లు నిశ్చింతగా బతుకుతారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం.

మాయమాటల కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటతప్పి మరోమారు ప్రజలను మోసపుచ్చింది. కాంగ్రెస్‌ పాలనలో మాటలకూ, చేతలకూ పొంతన ఉండదని ఇంకోమారు రుజువయింది. ‘‘వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్‌ బాధితులకు, డయాలసిస్‌ పేషెంట్లకు అందరికీ పెన్షన్‌... నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని మా నాయకుడు రాహుల్‌ గాంధీ చెప్పిన్రు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్‌ పెంచి ఇస్తాం...’’ అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 2023 జూలై నెలలో స్వయంగా పలికిన పలుకులివి! ఈయనే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... ‘‘ఒక్క నెల ఆగితే పెన్షన్‌ డబుల్‌ అయితది. డిసెంబర్‌ తొమ్మిదినాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ఖాతాలో రూ.4 వేలు పడుతాయి’’ అని కోతలు కోశారు. అయితే, అధికారంలోకి వచ్చి 10 నెలలైనా కాంగ్రెస్‌ బడా నేతలు ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాలేదు.

అభయ హస్తం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన 42 పేజీల మేనిఫెస్టోలోని చాప్టర్‌–2లో పేర్కొన్న ఆరో గ్యారెంటీలో ఏం చెప్పారు? ఇంతకుముందు రూ.2 వేలు నెలవారీ పింఛన్‌ తీసుకుంటున్న వారందరికీ తాము అధికారంలోకి వచ్చాక చేయూత కింద రూ.4 వేలు ఇస్తామనీ, దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచుతామనీ రాతపూర్వకంగా చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా... పెంచలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ లబ్ధిదారులకు ద్రోహం చేస్తున్నారు. పింఛను పెంపు లెక్కను పరిగణనలోకి తీసుకుంటే 10 నెలలుగా ప్రతి అవ్వ, తాతకు, దివ్యాంగుడికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం 20 వేల రూపాయిలు బాకీ పడిందని చెప్పవచ్చు.   

ఉలుకూ లేదు పలుకూ లేదు
రాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్‌ తీసుకుంటున్న వారితో పాటు అదనపు వ్యక్తి ఉంటే, ఇంట్లో ఇద్దరు వృద్ధులకూ పెన్షన్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు. దీంతో పది లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారనీ, ఈ లెక్కన దాదాపు 55 లక్షల మందికి కాంగ్రెస్‌ పెన్షన్‌ అందిస్తుందనీ గొప్పలు చెప్పారు. ఇప్పుడు దీని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. రెండు మూడు రోజుల్లో ఆసరా పింఛన్‌ దారులకు తీపి కబురు అందిస్తాననీ, ఆ బాధ్యత తనదేననీ ఈ ఏడాది జూన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పుడు దీనిపై నోరు మెదపడం లేదు! ఇక, ఇతర మంత్రుల సంగతి సరేసరి... ఉలుకూ, పలుకూ లేదు!

వృద్ధులు, ఒంటరివాళ్లు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ప్రభుత్వం 
అందించే పింఛన్‌ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా బతుకుతూ తృప్తిగా ఉంటారు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లతో లబ్ధిదారులు గౌరవంగా జీవించడమే కాకుండా కష్టమైన పనులు చేయాల్సిన అవసరం లేకుండా జీవితం గడుపగలుగుతారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్‌ డబ్బులు పెంచితే వాళ్లు నిశ్చింతగా బతుకుతారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం.

మాట నిలబెట్టుకున్న బీఆర్‌ఎస్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రూ.200 పెన్షన్‌ ఇచ్చి చేతులు దులుపుకొంది. 2014 ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్‌... ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్లను రూ.200 నుంచి రూ. 1,000, దివ్యాంగులకు రూ.500 నుంచి 1,500 రూపాయలకు పెంచారు. 2018 ఎన్నికల సమయంలో మరోసారి పింఛన్లు పెంచుతామని బీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే వృద్ధులు, వితంతువులు, ఇతర కార్మికుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ. 2,016, దివ్యాంగులకు రూ.1,500 నుంచి 3,016 రూపాయలకు పెంచింది. 

మారుతున్న కాలమాన పరిస్థితులు, వయసుతో వచ్చే వివిధ ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని 2020 మార్చిలో వృద్ధులకు  ఇచ్చే పెన్షన్‌ అర్హత వయసును 65 ఏళ్ళ నుండి 57 ఏళ్ళకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తగ్గించడంతో వృద్ధాప్య కేటగిరిలో అదనంగా సుమారు 8 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీంతో పాటు పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించి మరో లక్ష మందిని ఆసరాకు జోడించింది. దీంతో పథకంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 45 లక్షలు దాటింది. అయితే కాలక్రమేణ పింఛన్‌ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా కొత్తవారికి పింఛన్‌ ఇవ్వడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోలేదు. సమయానికి సదర్‌ క్యాంపులు నిర్వహించకపోవడం వల్ల కొత్తగా దివ్యాంగులుగా మారిన వారు చేయూత పథకంలో చేరడం కష్టంగా మారింది. ఇవన్నీ గడిచిన పది నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఘనతలుగా చెప్పుకోవచ్చు.

మంచిర్యాలలో 2023 జూన్‌ 9న జరిగిన సభలో దివ్యాంగుల పింఛన్‌ను రూ.3,016 నుంచి రూ.4,106కు పెంచుతున్నట్టు కేసీఆర్‌ ప్రకటించిన తర్వాతి నెల నుండే అవి అమలులోకి వచ్చాయి. ఇది బీఆర్‌ఎస్‌ విశ్వసనీయత! దేశంలోనే బీడీ కార్మికులకు సైతం ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది బీఆర్‌ఎస్‌కు పేదల పట్ల ఉన్న నిబద్ధత! కేవలం వృద్ధులే కాకుండా చేనేత కార్మికులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, వికలాంగులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఇలా అందరికీ కేసీఆర్‌ ‘ఆసరా’గా నిలిచిన సంగతిని కాంగ్రెస్‌ కప్పిపెట్టవచ్చుగానీ, బీఆర్‌ఎస్‌ తీసుకొచ్చిన మార్పు లబ్ధిదారుల మనసుల్లో ఇప్పటికీ ఉంది, ఎన్నటికీ చెరిగిపోదు. 

బాకీ చెల్లించాలి
ఆసరా పింఛన్‌ పేరును చేయూత పింఛన్‌గా మార్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, తను ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినట్టు పింఛన్‌ పెంచి ఇవ్వడం లేదు. అసలు సంగతి ఇలా ఉంటే, కొసరుగా... కాంగ్రెస్‌ అభయ హస్తం మేనిఫెస్టోలో చేయూత పింఛన్‌ దారులకు రూ. 10 లక్షల రాజీవ్‌ ఆరోగ్య శ్రీ బీమా కూడా అందిస్తామనీ, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. కానీ, ఏ హామీనీ నెరవేర్చకుండా, అభాగ్యుల పింఛన్‌ డబ్బులను దారి మళ్లించి, వారిని రేవంత్‌ రెడ్డి నట్టేట ముంచారు. 

ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను, సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలి. లేదంటే, అది తీవ్ర అసమానతలకు దారి తీస్తుంది. కాబట్టి, హామీ ఇచ్చినట్టు దివ్యాంగుల పెన్షన్‌ వెంటనే రూ.4,016 నుంచి రూ. 6 వేలకు పెంచాలి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులకు రూ. 2,016 నుంచి రూ. 4 వేలకు పెంచాలి. పింఛన్‌ డబ్బులను ప్రతి నెలా 5వ తేదీలోపే ఇవ్వాలి. పది నెలలుగా బాకీ పడ్డ పింఛన్‌ పైసలన్నీ వెంటనే చెల్లించాలి. ఈ డిమాండ్లు సాధించేవరకు లబ్ధిదారుల తరఫున బీఆర్‌ఎస్‌ పోరాడుతుంది.

-వ్యాసకర్త మాజీ మంత్రి, ఎమ్మెల్యే
-టి.హరీశ్‌ రావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement