
స్వాతంత్య్రానంతర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాశ్చాత్య ప్రపంచంతో భారత్ ఇప్పుడు చాలా సరళమైన సంబంధాలను నెరుపుతోంది. ఇప్పుడు భారత విదేశాంగ విధానం కనీవినీ ఎరుగని క్రియాశీలతతో వ్యవహరిస్తుండటం విశేషం. ఒక బలమైన దేశంగా భారత్ పురోగమన గాథకు ఇది అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సుకు భారత్ హాజరుకావడం అనేది దేశ వారసత్వ బలానికి ప్రతీకగా నిలుస్తోంది. తరచుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప దేశంగా భారత్‌ను ఇక ఎవ్వరూ తక్కువ చేసి చూడలేరని ఈ సదస్సులో భారత్ భాగస్వామ్యం తేల్చి చెబుతోంది.
శుక్రవారం బ్రిటన్‌లో ప్రారంభమైన జీ–7 దేశాల కూటమి సదస్సు ప్రపంచానికి కొత్త ఆశల్ని కల్పిస్తోంది. గత ఏడాది, నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ–7 దేశాల కూటమిని కాలం చెల్లిన బృందంగా తోసిపుచ్చారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలతో కూడిన జీ–7 కూటమి ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సరిగా ప్రాతినిధ్యం వహించనందున అదొక కాలం చెల్లిన గ్రూప్‌గా ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఈ సంవత్సరం అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన దౌత్య విస్తరణకు ప్రారంభ వేదికగా జీ–7 దేశాల కూటమిని ఉపయోగించుకుని ప్రపంచ రాజకీయాలపై తనదైన ముద్రను వేయడానికి ప్రయత్నించండం మరొక భిన్నమైన కథ అనుకోండి. అమెరికా తిరిగి ముందుపీఠికి వస్తోందనీ, మన భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన అంశాలు, కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా ముందుకొస్తున్నాయని పేర్కొనడం ద్వారా బైడెన్ తన తొలి విదేశీ ప్రయాణాన్ని విజ యవంతంగా ముగించాలని భావిస్తున్నారు.
బ్రిటన్‌తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గతంలో ట్రంప్ కల్లోల పాలన, బ్రెగ్జిట్ సర్దుబాటు అనంతరం ఇరుదేశాల సంబంధాలను పునరుజ్జీవింప చేసే లక్ష్యంతో ముందుకు సాగవచ్చు. తమ రెండు దేశాల ప్రత్యేక బాంధవ్యం భావనను మరోసారి ముందుకు తీసుకురావడం ద్వారా అట్లాం టిక్ ఒడంబడిక తాజా వెర్షన్‌పై జో, బోరిస్ సంతకం చేశారు. అంతే కాకుండా, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, సామూహిక భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, న్యాయబద్ధమైన, నిలకడైన ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నిర్మించడానికి తగు చర్చలు తీసుకుంటామని ఇరు దేశాల నేతలు ప్రతిజ్ఞ చేశారు. అయితే ఐరిష్ సముద్రం పొడవునా సాగుతున్న వాణిజ్యంపై ఇరుదేశాల మధ్య స్వల్ప భేదాలు ఉంటున్నాయి. గుడ్‌ఫ్రైడే ఒడంబడిక ద్వారా ఇరుదేశాలూ రూపొందించుకున్న స్థిరత్వాన్ని దెబ్బతీసేలా నార్తరన్ ఐర్లాండ్ ప్రొటోకాల్‌ను వాషింగ్టన్ ఉల్లంఘిస్తుండటంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయి.
తన ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో బైడెన్ ముఖ్యమైన ఎజెండాలను పెట్టుకున్నారు. విండ్సార్ కాజిల్‌లో బ్రిటన్ రాణితో సమావేశం, జీ–7 దేశాల సమావేశానికి హాజరవడం, అమెరికా అధ్యక్షుడిగా తొలి నాటో సదస్సులో పాల్గొనడం, తర్వాత జెనీవాలో రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావడం.. ఇలా బైడెన్ విదేశీ పర్యటన తీరిక లేని కార్యక్రమాలతో సాగనుంది. చివరిదైన పుతిన్‌తో సమావేశం అత్యంత స్పర్థాత్మకం కావచ్చు కాబట్టే యావత్ ప్రపంచం వీరిరువురి భేటీ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. బ్రిటన్ అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమైన జీ–7 దేశాల సదస్సు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించింది.
భవిష్యత్తులో మహమ్మారులపై పోరాటానికి ముందే సన్నద్ధమవుతూ, ప్రస్తుత కరోనా వైరస్ ఉపద్రవం నుంచి ప్రపంచాన్ని బయటపడేయడం; స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన వాణిజ్యానికి తలుపులు తెరవడం ద్వారా భవిష్య సమాజ సౌభాగ్యానికి ప్రోత్సాహమివ్వడం; పర్యావరణ మార్పును ఎదుర్కొని, భూగ్రహం జీవవైవిధ్యతను పరిరక్షించడం; స్వేచ్చాయుత సమాజాలు, వాటి ఉమ్మడి విలువలను ఎత్తిపట్టడం వీటిలో కొన్ని. వీటిలో కోవిడ్–19 మహమ్మారి నుంచి బయటపడటమే కీలకం. ఇదే ఇప్పుడు యావత్ ప్రపంచానికి కేంద్ర బిందువు. బ్రిటన్‌లో ప్రస్తుత జీ–7 దేశాల సదస్సు మహమ్మారిని ఎదుర్కోవడంపై నూతన ప్రపంచ ఒడంబడికను రూపొందిస్తుందని, తద్వారా మన ప్రపంచం ఇక ఎన్నడూ ఇలాంటి మహమ్మారుల బారిన పడకుండా బయటపడు తుందని బోరిస్ జాన్సన్ దృఢనమ్మకాన్ని వ్యక్తపరిచారు.
ఈ నేపథ్యంలో, యావత్ ప్రపంచానికి కరోనా వైరస్ నిరోధక వ్యాక్సినేషన్ విషయంలో ఘనమైన అంతర్జాతీయ సమన్వయానికి జీ–7 దేశాల కూటమి పిలుపునిస్తుందని భావిస్తున్నారు. కోవిడ్–19పై పోరుకోసం యావత్ ప్రపంచానికి టీకాలు అందించడమే అమెరికా ప్రాధాన్యతల్లో ఒకటిగా పేర్కొన్న బైడెన్ యంత్రాంగం, ప్రపంచంలోని 90 నిరుపేద దేశాలకు తన వంతుగా వ్యాక్సిన్ డోస్‌లను విరాళంగా అందిస్తానని ఇప్పటికే ప్రకటించింది. ఇది ఎంతగానో స్వాగతించవలసిన అంశం కానీ వచ్చే ఏడాది ప్రారంభానికి అంతర్జాతీ యంగా 180 కోట్ల కరోనా టీకాలను అందించడంలో ఇతర ప్రపంచ శక్తులు కూడా తమవంతుగా గరిష్ట సహాయం ప్రకటించాల్సి ఉంది.
ప్రధానంగా జీ–7 దేశాల కూటమి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కలయికగా ఉంటున్నందున ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, నిలకడతో కూడిన అభివృద్ధి వంటి ఉమ్మడి విలువల పరిరక్షణకోసం కట్టుబడి ఉంటున్నాయి. అగ్రదేశాలమధ్య భౌగోళిక రాజ కీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జీ–7 దేశాల కూటమి ఉద్దేశాన్ని పునర్నిర్వచించడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుత జీ–7 కూటమి సదస్సుకు ఆస్ట్రేలియా, కొరియా రిపబ్లిక్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌ను కూడా బ్రిటన్ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలతో భావ సారూప్యం కలిగిన దేశాలను కలిపి ఉంచే ప్రయత్నంలో భాగంగా వీటిని జీ–7 సదస్సుకు అతిథ్య దేశాలుగా ఆహ్వానించారు. ఇది ప్రపంచ పరిపాలనను మరింత సమర్థతతో నిర్వహించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. చైనా ద్వారా ఎదురవుతున్న భౌగోళిక రాజ కీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి తమ ప్రభావాన్ని మరింతగా విస్తరించుకోవలసిన అవసరం ఉందని పారి శ్రామిక సంపన్న దేశాలు గుర్తిస్తున్నాయి. ఈ మొత్తం క్రమంలో భారత్ ఒక కీలకమైన భాగస్వామిగా ఆవిర్భవించింది.
2014 నుంచి జీ–7 దేశాల సదస్సులో పాలుపంచుకోవడం ప్రధాని నరేంద్రమోదీకి ఇది రెండోసారి. గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ సైతం మోదీని ఆహ్వానించాలనుకున్నారు కానీ అమెరికాలో మహమ్మారి కారణంగా అది సాధ్యపడలేదు. ఈ ఏడాది మోదీ నేరుగా ఈ సదస్సుకు హాజరు కావలసినప్పటికీ, భారత్‌లో మహమ్మారి తీవ్రత దృష్ట్యా సదస్సు సమావేశాల్లో ఈయన వర్చువల్‌గా మాత్రమే పాలుపంచుకోవలసి ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా జీ–7 దేశాలతో భారత్ నిలకడైన సంబంధాలను సాగిస్తున్నందువల్ల, పశ్చిమదేశాలతో భారత్ బాంధవ్యం మరొక మెట్టు పైకి ఎదగనుంది. అంతర్జాతీయ పాలనలో తన వంతు పాత్రను పోషించాలని, తన సమర్థతలను మరింతగా విస్తరించాలని భారత్ ఆశిస్తున్నందున పారిశ్రామిక సంపన్న దేశాలతో బలమైన భాగస్వామ్యాలకోసం ప్రయత్నిస్తోంది.
స్వాతంత్య్ర భారత చరిత్రలో మునుపెన్నడూ లేనివిదంగా పాశ్చాత్య ప్రపంచంతో భారత్ ఇప్పుడు చాలా సరళమైన సంబంధాలను నెరుపుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ భాగస్వాములతో కలిసి పనిచేయడం నుంచి, పాశ్చాత్యదేశాలతో మంచి సబంధాలను ఏర్పర్చుకోవడం వరకు ఇప్పుడు భారత విదేశాంగ విధానం కనీవినీ ఎరుగని క్రియాశీలతతో వ్యవహరిస్తుండటం విశేషం. భారత్ దేశీయంగా ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఉత్తాన పతనాలను చవిచూస్తున్నప్పటికీ ఒక బలమైన దేశంగా భారత్ పురోగమన గాథకు ఇది అద్దం పడుతోంది. తక్కిన ప్రపంచంలో భారత్ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నందున ప్రపంచం కూడా భారత్‌తో మంచి సంబంధాలను ఏర్పర్చుకోగలుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సుకు భారత్ హాజరుకావడం అనేది దేశ వారసత్వ బలానికి ప్రతీకగా నిలుస్తోంది. తరచుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఒక అభివృద్ధి చెందుతున్న గొప్ప దేశంగా భారత్‌ను ఇక ఎవ్వరూ కించపర్చలేరని, తక్కువ చేసి చూడలేరని ఈ సదస్సులో భారత్ భాగస్వామ్యం తేల్చి చెబుతోంది.
హర్ష్ వి. పంత్
వ్యాసకర్త ప్రొఫెసర్, డైరెక్టర్, అబ్జర్వేషన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment