ఈ పిట్ట ఏ రాగం పాడేను? | How Will Twitter Run Under Elon Musk Control | Sakshi
Sakshi News home page

ఈ పిట్ట ఏ రాగం పాడేను?

Published Thu, Nov 10 2022 12:15 AM | Last Updated on Thu, Nov 10 2022 12:15 AM

How Will Twitter Run Under Elon Musk Control - Sakshi

బోలెడన్ని కప్పదాట్లు, మాటల యుద్ధాల తరువాత టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల సీఈవో ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్‌ను 4,400 కోట్ల డాలర్లు వెచ్చించి మరీ కొనేశాడు. మరి ఇప్పుడేంటి? ఈ పరిణామంతో ప్రపంచానికేమైనా ప్రమాదమా? అవుననే చెప్పాల్సి వస్తుంది.

ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలోనే అత్యంత ధని కుడే కాదు; ఒళ్లంతా అహం, అందుకుతగ్గ నోటి దురుసు ఉన్నవాడు. ఇంకో వైపు ట్విట్టర్‌ రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపగల వేదిక! ఈ విషయంపై కొందరికి అభ్యంత రాలు ఉండవచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టిక్‌టాక్‌లతో పోలిస్తే ట్విట్టర్‌ చాలా చిన్నదని వీరు చెప్పవచ్చు. కానీ, వీటితో పోలిస్తే ట్విట్టర్‌ ఉనికి, ఉద్దేశం పూర్తిగా వేరు. మిగిలిన సామాజిక మాధ్య మాలు జీవనశైలి అంశాల చుట్టూ తిరుగుతూంటే, ట్విట్టర్‌లో రాజకీ యాలు ఎక్కువగా ఉంటాయి. అస్తిత్వం, సిద్దాంతాలకూ చోటు చెప్పు కోదగ్గదే. పైగా చాలా సందర్భాల్లో ట్విట్టర్‌ విద్వేషానికి వేదిక అవుతూంటుంది కూడా. అందుకే అందరినీ రెచ్చగొట్టేలా మాట్లాడే మస్క్‌లాంటి వారి చేతుల్లో ట్విట్టర్‌ చేరడం ప్రమాదకర మవుతుంది. 

ట్విట్టర్‌లో మస్క్‌కు ఉన్న ప్రాచుర్యమూ తక్కువేమీ కాదు. ఈయ నకు ఏకంగా 11.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (13.3 కోట్లు) తరువాత ఇంతమంది ఫాలోవర్లు ఉన్నది ఈయనకే. అయితే అందరి దృష్టిని ఆకర్షించే విష యంలో, ట్విట్టర్‌ను వాడుకునే విషయంలో మస్క్‌కు తిరుగులేదు. ఈ కథనం రాసే సమయానికి ఒబామా చేసిన పది ట్వీట్లకు సగటున 25 వేల లైక్‌లు వస్తే, మస్క్‌కు ఏకంగా 5.27 లక్షల లైకులు వచ్చాయి. పైగా మస్క్‌ ట్వీట్లకు స్పందించేవారు అతడి దూకుడుతత్వాన్ని, స్వేచ్ఛాయుత రాజకీయ ఆలోచనలను మెచ్చుకునేవారు కావడం గమ నార్హం. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’కు మస్క్‌ ఎంత గట్టి మద్దతుదారు అంటే... అతడి పిన్డ్‌ ట్వీట్‌ (నిత్యం పేజీ పైభాగంలో కని పించేది) లోనూ ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ లేదా ‘రాజకీయంగా సరిగ్గా ఉండటం’(పొలిటికల్‌ కరెక్ట్‌నెస్‌) మధ్య ప్రకటనకర్తలు దేనికి ఓటేస్తా రని అడుగుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు 27.5 లక్షల మంది జై అన్నారు. పోలైన ఓట్లలో ఇది 78 శాతం వరకూ ఉండటం గమనార్హం. 

మస్క్‌ వైఖరి, ట్విట్టర్‌లో అతడి వైఖరులను బట్టి చూస్తే ప్రజా స్వామ్యానికి మేలే జరుగుతుందని అనిపించవచ్చు. కానీ కొన్ని విష యాలను నిశితంగా పరిశీలించాలి. మస్క్‌ భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేక అర్థం ధ్వనించేదిగా ‘రాజకీయంగా సరిగ్గా’ ఉండటాన్ని చూపించారు. ఇంకోలా చూస్తే ద్వేషపూరితమైన మాటలనూ భావ ప్రకటన స్వేచ్ఛలోకి చేర్చాడని చెప్పాలి. మస్క్‌ కొనుగోలు చేసిన గంటల్లోపు ట్విట్టర్‌లో బోలెడన్ని గుర్తుతెలియని ఖాతాల నుంచి నాజీ, జాతి వివక్ష పూరిత మీమ్‌లు మళ్లీ దర్శనమివ్వడం ఇందుకు నిద ర్శనం. మస్క్‌ చేతుల్లో ట్విట్టర్‌ ఎందుకు ప్రమాదకారో అర్థం చేసు కునేందుకు గత నాలుగు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలనూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

1980ల నుంచి ఒకరకమైన ద్వైదీభావం సమాజంలో పెచ్చరి ల్లింది. ఆర్థిక విధానాల విషయంలో నియో లిబరల్‌ ఆర్థడాక్సీ, సామా జిక అంశాల్లో లిబరల్‌ ప్లూరలిజమ్‌ పెత్తనం చలాయించాయి. అంతకు ముందు ఈ రకమైన మేళవింపును అస్సలు ఊహించలేము. ఎందు కంటే అప్పట్లో సామాజిక సమానత్వం, వామపక్ష రాజకీయాలు కలిసికట్టుగా పనిచేసేవి. ఒకదశలో ప్రజలు తాము సామాజిక అంశాల విషయంలో వామపక్షవాదులమనీ, ఆర్థిక విధానలకు వచ్చేసరికి మిత వాదులమనీ చెప్పుకోవడం సర్వసాధారణమై పోయింది. 

గత నాలుగు దశాబ్దాల్లో సమాజంలో ఒక కొత్త ఉన్నతస్థాయి వర్గ సృష్టి జరిగింది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు బయటకు స్వేచ్ఛా రాజకీయాలకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తూనే, మార్కెట్‌ శాసించే విధానాల ఫలాలు అందుకునేవారు! ఈ నాలుగు దశాబ్దాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అసమానతలు, నిరుద్యోగిత పెరగడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవ జీవన ప్రమాణాల్లో కనిపించిన వృద్ధి ఇటీవలి కాలంలో దాదాపు స్తంభించిపోయింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆర్థికంగా లేదా సామాజికంగా ఎదిగేం దుకు తగిన అవకాశాలు లేనందున అమెరికాలో ఓ తెల్లవాడు, భార త్‌లో అగ్రవర్ణ పురుషుడు... తమకు అన్యాయం జరిగిందను  కోవడం న్యాయమే అనుకునే పరిస్థితి ఉంది. కులం, మతం, జాతి, జాతీయ తల ప్రస్తావన వస్తే... వీరు అది తమ సహజమైన హక్కు అనేస్తారు. పురుషుడి ఆధిపత్యం కూడా ప్రకృతిలో సహజమని చెబుతారు. 

ఇలాంటివారు సమాజంలో ‘ఉన్నత స్థానం’లో ఉన్న వారిని తమ శత్రువులుగా భావించేందుకు ఎక్కువ సమయమేమీ పట్టదు. సమా నత్వ రాజకీయాలు ‘జనాలను’ అణచివేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసే కుట్ర అని వీరు భావిస్తూంటారు. ఈ రాజకీయాలెప్పుడూ ప్రజా స్వామ్యయుతం కాదు. అణచివేతకు గురైన ప్రజలందరినీ ఒక్కతాటి పైకి తెచ్చే అంశం ఆధారంగా ఉండేవి రాజకీయాలు. శక్తిమంతులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ సామాన్యులందరికీ వర్తించే ఒక కారణాన్ని చూపేందుకు ప్రయత్నం చేస్తూంటారు. 1930లలో జర్మనీలో జరిగింది ఇదే. యూదులను సంపన్నులు, ఉన్నతవర్గాల వారిగా చూపుతూ వారు జర్మనీ సైనికులకు వెన్నుపోటు పొడిచారనీ, అందుకే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందనీ ప్రచారం జరిగింది.  

ఈ కాలంలోనూ అసంతృప్తికి గురైన వర్గాలు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. అధికారం, సమృద్ధి తమ సహజసిద్ధమైన హక్కని వీరు భావిస్తూంటారు. వీరు సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ స్వేచ్ఛ, స్వయం పాలన వంటి భావజాలాన్ని ప్రచారం చేసేవారి పట్ల ఆకర్షితులవుతూంటారు. రాజకీయ సమానత్వం, లింగవివక్ష లేక పోవడం, జాతి, మతాల ఆధారంగా వివక్ష లేకపోవడం వంటి విష యాలకు వీరు వ్యతిరేకం. ఇలాంటి వారందరికీ ట్విట్టర్‌లో మంచి ఆదరణ కనిపిస్తూంటుంది. అసందర్భమైన అభిప్రాయాలను, విభజన వాదాలను ప్రచారం చేసేందుకు వేదికగా ఉపయోగపడుతుందన్న మాట! డబ్బులిచ్చే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇప్పటికే మస్క్‌ ప్రకటించాడు. నెలకింత రుసుము చెల్లించడం ద్వారా బ్లూటిక్‌ పొందవచ్చునని కూడా చెప్పాడు. ఇది తప్పుడు ప్రచారాలు చేసేవారికి మరింత ఉపయోగకారిగా మారనుంది. ట్విట్టర్‌ వేదికను తమ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.

అనింద్యో చక్రవర్తి, వ్యాసకర్త సీనియర్‌ ఆర్థిక విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement