ప్రజల మనస్తత్వాలను అంచనా వేయాలంటే ఇకమీదట కరోనాకు ముందు, కరోనాకు తరువాత అని లెక్కేయ్యాల్సి ఉంటుంది. చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం విస్తరించి సుమారు ఎనిమిది లక్షలమంది ప్రాణాలను హరించిన కోవిడ్–19 ప్రజలకు కొన్ని విలువైన పాఠాలను నేర్పింది. ముఖ్యంగా అనేకమంది జీవనశైలిలో ఊహించనంత మార్పును తీసుకొచ్చింది. విశ్వవిద్యాలయాలలో కూడా బోధించని అనేక విలువైన ఆర్థిక గుణపాఠాలను నేర్పించింది. మొన్నమొన్నటిదాకా కోటీశ్వరుల నుంచి మధ్యతరగతివారి వరకూ వీకెండ్ అనేది ఒక పెద్ద పండుగ లాంటిది. ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందా అని గురువారం నుంచే ఎదురు చూసేవారు. నలుగురు సభ్యులున్న కుటుంబం కూడా శుక్రవారం రాత్రి నిద్రపోకుండా ఎపుడెపుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవారు. కానీ, ఈ విలాసాలపై కరోనా భూతం తన పంజా విసిరింది. దీని దెబ్బకు ప్రపంచమే స్తంభించిపోయింది.
రెండు దేశాల మధ్య యుద్ధాలో, రాష్ట్రాల్లో ఎక్కడైనా మతకల్లోలాలో, విధ్వంసకాండలు చెలరేగినపుడు కూడా నిర్విరామంగా పనిచేసిన సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, ప్రయాణ సాధనాలు మొత్తం మూసుకునిపోయాయి. ఫలితంగా లక్షలాదిమంది తమ ఉపాధిని కోల్పోయారు. మధ్యతరగతివారి జీవి తాలు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతివారు కూడా ఒక్కసారి కుదేలైపోయారు. ఆఫీసులు మూతపడిపోవడం, చేయడానికి పనిలేకపోవడం, జీతాల్లో కోతలు పడటం. ఉద్యోగాలు పోవడం, ఉన్న ఉద్యోగాలు కూడా ఎప్పుడు పోతాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొనడంతో ఒక్కసారిగా జనజీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. డబ్బు విలువ ఏమిటో ప్రతి ఒక్కరికీ అర్థం అయింది. ఆదాయం కోల్పోయినా, బ్యాంకులకు ఈ నెలసరి వాయిదాలు కట్టక తప్పదు కదా!
ఇప్పటివరకు ఏదో దాచుకున్న డబ్బుతో ఎలాగో నెట్టుకుంటూ వచ్చారు. కానీ, ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే అప్పుడు కర్తవ్యం ఏమిటి అనే స్పృహ ప్రతి ఒక్కరిలో భయాన్ని కలిగిస్తున్నది. కరోనా నివారణకు రాబోయే డిసెంబర్ వరకూ వ్యాక్సిన్ లేదా నివారణ లభించే సూచనలు కనిపించకపోవడంతో ఉద్యోగులు, వ్యాపారులతో పాటు చిరు ఆదాయాలమీద జీవించేవారు కూడా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ముఖ్యంగా అన్ని విలాసాలకు కత్తెర వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద మాల్స్ తెరిచి నెలరోజులు దాటినప్పటికీ, అక్కడ వినియోగదారులు చాలా పలుచగా కనిపిస్తున్నారు. అత్యంత అవసరం అయితే తప్ప విందులు విహారాలకు వెళ్లడం లేదు. పుట్టినరోజు లని, పెళ్లిరోజులని బంధుమిత్రులని పిలిచి పెద్ద ఎత్తున పార్టీలు ఇవ్వడం ప్రస్తుతానికి ఆగిపోయింది. వివిధ రాష్ట్రాల మధ్యన రాకపోకలు అనుమతించబడినప్పటికీ, ఊరు విడిచి వెళ్ళడానికి సాహసించడం లేదు. ఒకప్పుడు ఆన్‌లైన్‌లో ఎడాపెడా ఆర్డర్స్ ఇచ్చినవారు కూడా, ఈ వస్తువు మనకు అవసరమా కాదా? అని ముందుగా ప్రశ్నించుకుంటున్నారు. గత ఆరు నెలలుగా కరోనా వలన తాము ఎంత పొదుపు చెయ్యగలిగామో లెక్కలు వేసుకుంటున్నారు మరికొం దరు. నెలకు నాలుగు సినిమాలు, నాలుగుసార్లు రెస్టారెంట్స్‌కు వెళ్లడం, నెలకొకటైనా దూరప్రయాణం, పూర్తిగా అరికట్టబడిన కొనుగోళ్లు లాంటివాటి వలన మధ్యతరగతి జీవులకు నెలకు కనీసం పదివేల రూపాయలైనా మిగిలి ఉంటాయి. ప్రతి చిన్న సుస్తీకి ఆసుపత్రికి వెళ్లడం తగ్గించడం వలన వేలరూపాయలు పొదుపయింది.
అప్పటివరకు డాక్టర్లు చెప్పినా కూడా వినకుండా మద్యపానం, ధూమపానం చేసినవారు కరోనా పుణ్యమా అని భయంతో కొంత, అవి అందుబాటులో లేకపోవడంతో కొంత ఆ అలవాట్లను మానేశారు. మానవాళికి కరోనా చేసిన అతి పెద్ద మేలు ఇది. అలాగే నగరం మధ్యలో నెలకు పదిహేను వేలు, ఇరవై వేలు అద్దె చెల్లించి ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నవారు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి నగర శివార్లకు వెళ్లిపోయారు. నగరంలో జీవించలేము అనుకునేవారు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఫలితంగా నగరాల్లో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో మళ్ళీ పూర్వవైభవం వచ్చినా, మధ్యతరగతి జీవులు విలాసాల జోలికి వెళ్ళడానికి సాహసించడం కష్టమే. ముఖ్యంగా వచ్చిన దానిలో భవిష్యత్తు కోసం కొంచెం దాచుకోవాలి అనే పెద్ద పాఠం కరోనా మహమ్మారి మానవులకు నేర్పిందని చెప్పుకోవాలి. దేన్నైనా పాజిటివ్ కోణంలోనుంచి పరి శీలిస్తే కొన్నైనా మంచి గుణాలు కనిపించకపోవు!
ఇలపావులూరి మురళీ మోహనరావు
వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment