
టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేని అనుకూల మీడియా, తమ పెత్తనం పోయిందన్న బాధో, దుగ్ధో తెలియదు కానీ ఏపీకి ఏ పరిశ్రమా రాకూడదని, అక్కడ ఎలాంటి అభివృద్ది జరగకూడదని కోరుకుంటూ కుట్రపూరితంగా వార్తలు రాస్తోంది. ఆ కుట్రలు ఫలించలేదని అర్థం అయినప్పుడు కుళ్లు రాతలు రాస్తున్నారు. నాడు ఐటీ రాజధానిగా విశాఖ జోరు.. నేడు తరలిపోయే దిశగా కంపెనీలు అంటూ పెద్ద, పెద్ద హెడ్డింగ్‌లను పెట్టి ప్రస్తుత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు అదానీ గ్రూప్ డేటా సెంటర్‌కి 130 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించగానే అది అప్పుడే వచ్చింది టీడీపీ హయాంలోనే రాష్ట్రానికి అన్న హెడ్డింగ్‌లు పెట్టి చంద్రబాబుకు వంతపాడటం కుళ్లుమోత్తనంలో భాగమే.
తెలుగుదేశం పార్టీ ఒక వైపు కుట్రల రాజకీయాన్ని, మరో వైపు కుళ్లు రాజకీయాలను చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సైతం అలాగే కొన్ని విషయాలలో కుళ్లుతున్నట్లు అర్థం అవుతుంది. ఇందుకు తాజా ఉదాహరణ ఇది. విశాఖలో ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ డేటా సెంటర్, తదితర ఐటీ కార్యకలాపాల నిమిత్తం 130 ఎకరాల భూమిని రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. తద్వారా వేలాది మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ గురించి, మరికొన్ని సంస్థల గురించీ టీడీపీ నేతలు, ఆ పార్టీ మీడియా ఏమని ప్రచారం చేసిందో గుర్తుకు తెచ్చుకోండి.
మనమెవరం గుర్తు తెచ్చుకోనవసరం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న క«థనాలు చూస్తే టీడీపీ , ఆ పార్టీ మీడియా ఎంత కుళ్ళుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొద్ది నెలల క్రితం టీడీపీ పత్రిక విశాఖ నుంచి అదానీ కంపెనీ వెళ్లిపోతోందని, చంద్రబాబు ఆ గ్రూపువారిని ఒప్పించి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దానిని దెబ్బతీస్తోందని ఆరోపించింది. నాడు ఐటీ రాజధానిగా విశాఖ జోరు.. నేడు తరలిపోయే దిశగా కంపెనీలు అంటూ పెద్ద, పెద్ద హెడ్డింగ్‌లను పెట్టి ప్రస్తుత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఆ పత్రిక ప్రయత్నించింది. టీడీపీకి మద్దతు ఇచ్చే మరికొన్ని మీడియా సంస్థలూ అదే తరహా ప్రచారం చేశాయి.
ఇప్పుడు అదే పత్రిక ఏమి రాసిందో చూడండి. అదానీ అప్పుడే వచ్చింది. టీడీపీ హయాంలోనే రాష్ట్రానికి వచ్చింది అన్న హెడ్డింగ్‌లు పెట్టారు. దీనినే కుళ్లుమోతుతనంతో వ్యవహరించడం అని అంటారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయి, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు పరిశ్రమలకు సంబంధించి పలు అబద్ధపు కథనాలను ప్రచారం చేశారు. నిజంగానే వైసీపీ అధికారంలోకి వచ్చాక అదానీ కంపెనీ విశాఖ నుంచి వెళ్లిపోయి ఉంటే, ఇప్పుడు 130 ఎకరాలు ఎందుకు తీసుకుంటుంది? అంటే అప్పుడు అదానీ కంపెనీ గానీ, ప్రముఖ పారిశ్రామిక గ్రూపులు కానీ ఆంధ్రప్రదేశ్‌కు రాకూడదని కొన్ని శక్తులు కుట్ర చేశాయన్నమాట. అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు కుళ్లు రాజకీయం చేస్తున్నారు.
అదానీ గ్రూపునకు 130 ఎకరాలు ఇచ్చాక ఏమని రాసిందో చూడండి. అది అప్పుడే వచ్చింది. టీడీపీ హయాంలోనే రాష్ట్రానికి అన్న హెడ్డింగ్‌లు పెట్టి కుళ్లు రాతలు రాశారని అర్థం అయిపోతుంది. ఈ రెండు వార్తలూ పక్కపక్కన సోషల్ మీడియాలో రావడంతో ఆ పత్రిక పరువు పోయింది. వారి కుళ్లుబుద్ధి బయటపడింది. కొద్ది నెలల క్రితం అదానీ గ్రూపు కానీ, మరికొన్ని ఐటీ కంపెనీలు కానీ వెళ్లిపోతున్నాయని అబద్ధాలు రాయకుండా ఉంటే, ఇప్పుడు కనీసం టీడీపీ హయాంలో కొంత వచ్చింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అది మరింత పెద్దగా ఎదుగుతోంది అని రాసే అవకాశం వచ్చేది. కానీ ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకత్వం, టీడీపీ అనుకూల మీడియా అడ్డగోలుగా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, అది కుదరకపోతే ఇలా కుళ్లు రాజకీయాలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?
ఇదే కాదు. అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ కియా గురించి వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎలా రాశారో గుర్తు చేసుకోండి. కియా తరలిపోతోందని, అక్కడ వైఎస్సార్‌సీపీ నేతలు దందాలు చేస్తున్నారని ఆరోపించారు. తీరా చూస్తే ఈ ప్రభుత్వం వచ్చాక కియా కంపెనీ మరో 450 కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. దీనిని మాత్రం పోకస్ చేయకుండా కుళ్లు రాజ కీయం చేశారు. రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించినా, మీడియా స్పోర్టివ్‌గా ఉండి వాస్తవాలు రాయడానికి యత్నించాలి. లేదా కనీసం కుళ్లకుండా అన్నా ఉండాలి. టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేని ఆ మీడియా, తమ పెత్తనం పోయిందన్న బాధో, దుగ్ధో తెలియదు కానీ ఏపీకి ఏ పరిశ్రమా రాకూడదని, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకూడదని కోరుకుంటూ కుట్రపూరితంగా వార్తలు రాస్తోంది.
ఆ కుట్రలు ఫలించలేదని అర్థం అయినప్పుడు కుళ్లు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విశాఖలో ప్రతి ఏటా పారిశ్రామిక సదస్సుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టేది. అలాగే డావోస్ అని, ఆ దేశం అంటూ, ఈ దేశం అంటూ ప్రత్యేక విమానాలలో తిరిగేవారు. ఆ పర్యటనలపై టీడీపీ మీడియా ఎలా రాసేదో గుర్తుకు వస్తే ఆశ్చర్యం కలిగేది. చంద్రబాబును చూసి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు బిల్డప్ ఇచ్చేవి. ఒకసారి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నా చంద్రబాబుకే న్యూయార్క్‌లో ఎక్కువ ఫాలోయింగ్ కనిపించిందని రాసేంతవరకు టీడీపీ మీడియా వెళ్లింది. కానీ ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మలేదు. టీడీపీ మీడియా అబద్ధపు ప్రచారాన్ని విశ్వసించలేదు. ఇక అమరావతిలో అది వచ్చేసింది, ఇది వచ్చేసిందని కూడా ప్రచారం చేసేవారు. అలాంటి వాటిలో ఒకటి బీఆర్ షెట్టి గ్రూపు. తీరా ఇప్పుడు ఆ కంపెనీ యజమాని దుబాయిలో మోసం కేసులో చిక్కుకున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటివి చెప్పాలంటే ఇంకా ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని ప్రచారం చేశారు. తీరా కేంద్రం నిధులు ఇవ్వగానే పల్లవి మార్చేశారు. అసలు చంద్రబాబు టైమ్‌లో పాత ధరలకు ప్రాజెక్టు నిర్మాణానికి ఎందుకు ఒప్పుకున్నారు అన్న ప్రశ్నను మాత్రం ఈ మీడియా వేయదు. ఏపీలో చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేసి ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వమే ఆ అప్పులకు వడ్డీ చెల్లిస్తుంది. ఈ స్కీము మీద ఏమి రాశారో తెలుసా? బ్యాంకులు ఈ అప్పులు ఇవ్వడానికి భయపడిపోతున్నాయని ఒక పత్రిక రాసింది. మరి అదే సుజనా చౌదరి మరికొందరు వందల, వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసినా ఈ మీడియా సుజనా వంటి వారిని చాలా గొప్పవారిగా అభివర్ణిస్తూ కథనాలు ఇస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ పోలికతో కామెంట్లు వచ్చాయి. టీడీపీ నేతలతోపాటు, టీడీపీ మీడియా కుళ్లు బుద్ధితో వ్యవహరిస్తున్నాయని తేలికగానే అర్థం చేసుకోవచ్చు. ఇక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, ఎమ్మెల్సీ అయిన లోకేశ్ ట్విట్టర్‌లో కూడా ఇలాగే అధ్వానపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయంలో అచ్చంగా తన తండ్రినే ఫాలో అవుతున్నారు. జగన్ పాలనను తుగ్లక్ పాలన చూసి కంపెనీలు పరార్ అని రాశారు. ఈ 18 నెలల్లో జరిగినవి కూల్చివేతలు, కక్ష సాధింపులు తప్ప సాధించింది శూన్యం అని తేల్చారు. అదే సమయంలో మరో వ్యాఖ్య చేస్తూ రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడం చేతగాని వైఎస్ జగన్, చంద్రబాబు కష్టాన్ని కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
కంపెనీల పేర్ల పక్కన ఎంత పెద్దగా వైఎస్ జగన్ ఫోటోలు వేసినా అందులో కనిపించేది కంపెనీలు రాష్ట్రానికి తెచ్చి యువతకి ఉపాధి కల్పించిన చంద్రబాబు గారి కష్టమే అని అర్థం చేసుకోవాలట. కంపెనీలన్నీ పరారైపోతే ఇక చంద్రబాబు కష్టం ఎక్కడ ఉన్నట్లు? మరి ఇప్పుడు వస్తున్న డేటా కంపెనీ ఎవరి కష్టంతో వస్తున్నట్లు? ఏడాదిన్నర తర్వాత కూడా చంద్రబాబును చూసే పరిశ్రమలు వస్తున్నాయా? లోకేశ్ ఇలా అర్థం పర్థంలేని ట్వీట్‌లు పెట్టి తన పరువు తానే తీసుకుంటున్నాడు.
చంద్రబాబు మాదిరి ఏదో ఒక అబద్దాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలను భ్రమలలో పెట్టాలని లోకేష్ కూడా ప్రయత్నిస్తున్నారు. యువకుడిగా నిజాయితీగా, కాస్త నిర్మాణాత్మకంగా ఉండవలసిన ఈ వయసులోనే ఈయన కూడా కుట్ర రాజకీయాలు, కుళ్లుబుద్ధులు ప్రదర్శిస్తే టీడీపీకి ఏమి ప్రయోజనం ఉంటుంది? అయినా వారి ఇష్టం. కానీ ప్రజలు ఈ కుట్రలను, కుళ్లును సరిగానే అర్థం చేసుకుంటున్నారు. వీరు ఇలా వ్యవహరిస్తున్నంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా పెద్దగా ఇబ్బంది పడనవసరం ఉండకపోవచ్చు.
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment