ప్రగతిభవన్‌ వర్సెస్‌ రాజ్‌భవన్‌? | Kommineni Srinivasa Rao Review On Conflict Between Cm Kcr Governor Tamilisai Soundararajan | Sakshi
Sakshi News home page

ప్రగతిభవన్‌ వర్సెస్‌ రాజ్‌భవన్‌?

Published Thu, Feb 3 2022 12:59 AM | Last Updated on Thu, Feb 3 2022 1:17 AM

Kommineni Srinivasa Rao Review On Conflict Between Cm Kcr Governor Tamilisai Soundararajan - Sakshi

రాజకీయ నేతలను గవర్నర్‌లుగా నియమించినప్పుడు ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. రాజకీయేతర మాజీ బ్యూరోక్రాట్‌లను గవర్నర్‌లుగా చేసినప్పుడు తక్కువ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్‌లు కేంద్రం ఏజెంట్లుగా ఉండాలా? లేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మెలిసి ఉండాలా అన్నదానిపై మన రాజ్యాంగంలో స్పష్టత ఉన్నట్లు అనిపించదు. బహుశా అప్పటి పెద్దలు గవర్నర్‌లు ఇంత తీవ్రమైన వివాదాలలోకి వెళతారని ఊహించి ఉండకపోవచ్చు. తాజాగా తమిళిసైకి, కేసీఆర్‌కు మధ్య విభేదాలు ఏర్పడినట్టు అనిపిస్తోంది. అవి ఏ రూపం సంతరించుకుంటాయో? 

దేశంలో గవర్నర్‌లు, ముఖ్యమంత్రుల మధ్య వివాదాలు కొత్త కాదు. గతంలోనూ ఉన్నాయి. ప్రస్తుతమూ కొనసాగుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరడం విశేషం. గవర్నర్‌ తమిళిసైకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు ఏర్ప డ్డాయి. రిపబ్లిక్‌డే నాడు అవి మరింత బహిరంగంగా ప్రస్ఫుట మయ్యాయి. పరేడ్‌ గ్రౌండ్‌లో జరగవలసిన రిపబ్లిక్‌డే ఉత్సవాన్ని కరోనా పేరుతో రద్దు చేయడం, రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం, అక్కడికి సీఎం కానీ, మంత్రులు కానీ వెళ్లకపోవడం చెప్పుకోదగిన పరిణామమే. గవర్నర్‌ వైఖరికి కేసీఆర్‌ ప్రభుత్వం ఒకరకంగా నిరసన చెప్పినట్లు అనుకోవాలి.

తమిళిసై కూడా వెనక్కి తగ్గే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఆమె హార్డ్‌ కోర్‌ బీజేపీ నేత. తమిళనాడులో పార్టీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. గత లోక్‌సభ ఎన్నికలలో ఓడి పోయిన తర్వాత ఆమెను ప్రధాని మోదీ గవర్నర్‌గా నియమించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి బాధ్యతలను కూడా ఆమెకు అప్పగిం చడం ద్వారా ఆమె ప్రాధాన్యతను తెలియచేసినట్లయింది. హుజూరా బాద్‌ ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్‌ మంత్రివర్గం నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా స్థానిక నేత కౌశిక్‌ రెడ్డి పేరును సిఫారసు చేయగా, ఆమె ఉప ఎన్నిక పూర్తి అయ్యేవరకు పెండింగులో పెట్టి, తదుపరి తోసి పుచ్చారు. ఆ తర్వాత మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి పేరును ఓకే చేశారు. ఇక్కడే విభేదాలకు బీజం పడిందని అనుకోవచ్చు. 

అంతకుముందు రెండేళ్లపాటు తమిళిసై సౌందరరాజన్‌కి ప్రభుత్వంతో సతనబంధాలే కొనసాగాయి. కరోనా సమయంలో ప్రభుత్వం వద్దన్నా, నిమ్స్‌కు వెళ్లడం, కొన్ని విషయాలపై ప్రభుత్వ అధికారుల వివరణ కోరడం వంటివి చేసినా పెద్దగా సీరియస్‌ కాలేదు. కానీ ఎమ్మెల్సీ వ్యవహారంలో కేసీఆర్‌కు కొంత అప్రతిష్ఠ ఏర్పడింది. తదుపరి ఆమె ఏకంగా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక బాక్స్‌ను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌కు సహజంగానే అది రుచించదు. తాజాగా రిపబ్లిక్‌డే ఉత్సవం పరిణామాలు మరింత గ్యాప్‌ పెంచుతాయి. ఇటీవలి కాలంలో బీజేపీకి, టీఆర్‌ఎస్‌కు మధ్య విభేదాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో ఇరు వైపులా మాటల తూటాలు పేలుతున్నాయి. వడ్ల కొనుగోలుతో సహా పలు అంశాలలో కేంద్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందని కూడా టీఆర్‌ఎస్‌ ధ్వజమెత్తుతోంది. కానీ తమిళిసై ప్రధానిని తన ఉపన్యాసంలో ప్రశంసించారు. మరోవైపు బీజేపీ నేతలు తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ వైఖరికి బహిరంగంగా నిరసన తెలియ చేశారని అనుకోవచ్చు. 

నిజానికి తమిళిసై కొత్తగా వచ్చినప్పుడు కేసీఆర్‌ అప్పుడప్పుడు కలుస్తూ ఆయా అంశాలపై చర్చలు జరుపుతూ వచ్చారు. కేసీఆర్‌కు, బీజేపీ పెద్దలకు సఖ్యత ఉన్నంతకాలం తమిళిసై కూడా జోక్యం చేసుకోలేదు. కాని ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మరో రెండేళ్లలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నందున బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ పోరు పెరుగుతోంది. అది ముఖ్యమంత్రి, గవర్నర్‌ల మధ్య కూడా ప్రతిఫలిస్తోంది. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు రావడం కొత్త కాదు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్‌ పాలన కొనసాగినప్పుడు ఇవి తక్కువగా ఉండేవి. గవర్నర్‌ కాంగ్రెస్‌ హై కమాండ్‌కు దగ్గరగా ఉండే వ్యక్తి అయి ఉంటారు కాబట్టి ఎక్కువసార్లు ముఖ్యమంత్రులే తగ్గేవారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ నరసింహన్‌ దాదాపు నేరుగానే పర్యవేక్షించేవారంటే ఆశ్చర్యం కాదు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరసింహన్‌తో కొన్ని విభేదాలు వచ్చాయి. అప్పుడు ఒక నామినేటెడ్‌ ఎమ్మెల్సీ విషయంలోను, సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలో భేదాభిప్రా యాలు వచ్చాయి. ఆ రోజుల్లో నరసింహన్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో తరచుగా సంప్రదింపులు జరుపదతుండేవారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆనాటి గవర్నర్‌ రామ్‌ లాల్‌కు, ఎన్టీఆర్‌కు సంబంధాలు సజావుగా ఉండేవి కావు. గవర్నర్‌ చివరికి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కరరావుకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత ప్రజా ఉద్యమం రావడంతో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది. అది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి పరువు తక్కువ పనిగా మారింది. దాంతో రామ్‌లాల్‌ను  ఇందిరాగాంధీ తొలగించి శంకర్‌ దయాళ్‌ శర్మను నియమించారు. ఆయన అనవసర వివాదాలలోకి వెళ్లేవారు కాదు. ఎన్టీఆర్‌ కూడా చాలా మర్యాద ఇచ్చేవారు. తదుపరి కుముద్‌బెన్‌ జోషీ గవర్నర్‌గా ఉన్నప్పుడు మాత్రం తీవ్రమైన సమస్యలే వచ్చాయి. గవర్నర్‌ ఆఫీస్‌ కాంగ్రెస్‌ ఆఫీస్‌గా మారిందని టీడీపీ నేతలు ఆరోపించేవారు. ఆనాటి రెవెన్యూ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి అయితే కుముద్‌బెన్‌ జోషీ ఆఫీస్‌పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించడం ఆ రోజులలో సంచలనంగా ఉండేది. 

1995లో కృష్ణకాంత్‌ గవర్నర్‌గా ఉండేవారు. ఎన్టీఆర్‌పై అప్పట్లో తిరుగుబాటు అనండి, కుట్ర అనండి.. జరిగినప్పుడు కృష్ణకాంత్‌ పాత్రపై కూడా విమర్శలు వచ్చాయి. ఆయన చంద్రబాబుకు ఫేవర్‌ చేశారని ఎన్టీఆర్‌ విమర్శించారు. అసెంబ్లీని రద్దు చేయాలని సిఫారసు చేసినా, చంద్రబాబు సహా ఐదుగురిని టీడీపీ నుంచి బహిష్కరించినా, వాటిని పట్టించుకోకుండా చంద్రబాబుకు పట్టం కట్టారన్నది ఎన్టీఆర్‌ వర్గం అభియోగంగా ఉండేది. చంద్రబాబు టైమ్‌లో మాత్రం గవర్నర్‌లతో పెద్దగా ఇబ్బంది రాలేదు. ఎందుకంటే ఆయన హయాంలో కేంద్రంలో కూడా అనుకూల ప్రభుత్వం ఉండేది. కాని ‘ఓటుకు నోటు’ కేసు తర్వాత జరిగిన పరిణామాలలో ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌పై తెలుగుదేశం నేతలు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాని అదే సమయంలో నరసింహన్‌ ద్వారానే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో చంద్రబాబు రాయబారాలు జరిపే వారని కూడా అంటారు. 

కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఉత్తరప్రదేశ్‌లో గవర్నర్‌ రమేష్‌ భండారీ వైఖరికి నిరసనగా దీక్ష చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో గవర్నర్‌లు ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుంటారన్నది బహిరంగ రహస్యమే. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌కు, మమత బెనర్జీ ప్రభుత్వానికి మధ్య పెద్ద సంక్షోభమే నడుస్తుంటుంది. గవర్నర్‌ అసెంబ్లీ వద్దకు వెళ్లి గేటు వద్ద నిలబడవలసిన అరుదైన ఘట్టం జరిగింది. మమత ప్రభుత్వాన్ని రకరకాలుగా గవర్నర్‌ ఇబ్బందులకు గురి చేస్తుంటారు. కేరళలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు, సీపీఎం ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ప్రభుత్వానికి మధ్య అంతగా సంబంధాలు ఉండడం లేదు. ఇటీవల రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చే విషయంలో సైతం వివాదం ఏర్పడడం దురదృష్టకరం.

రాజకీయ నేతలను గవర్నర్‌లుగా నియమించినప్పుడు ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. రాజకీయేతర మాజీ బ్యూరోక్రాట్‌లను గవర్నర్‌లుగా చేసినప్పుడు తక్కువ వివాదాలు చోటు చేసు కుంటున్నాయి. గవర్నర్‌లు కేంద్రం ఏజెంట్లుగా ఉండాలా? లేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మెలిసి ఉండాలా అన్నదానిపై మన రాజ్యాంగంలో స్పష్టత ఉన్నట్లు అనిపించదు. గవర్నర్‌ వ్యవస్థ ఉండాలా? వద్దా అన్న చర్చ కూడా చాలాకాలంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఏకంగా గవర్నర్‌ల వ్యవస్థను రద్దు చేయాలని గతంలో తీర్మానాలు చేసింది. తమకు అనుకూలంగా ఉన్న గవర్నర్‌ అయితే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను రాజకీయ పక్షాలు వ్యవహరించడం సహజమే. అలాగే కేంద్రంలో ఉన్న పార్టీకి చెందిన వారు గవర్నర్‌లు అయితే ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో ప్రభుత్వాలతో నిత్యం తగాదాలు రావడం పరిపాటి అవుతుంటుంది. మరి తమిళిసైకి, కేసీఆర్‌కు మధ్య ఏర్పడిన విభేదాలు ఏ రూపం సంతరించుకుంటాయన్నది కాలమే తేల్చుతుంది.

కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement