విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్నది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట. ‘విద్య ప్రభుత్వ బాధ్యత. అది పవిత్రమైన పెట్టుబడి, యువత భవిష్యత్తుకు అది బంగారు పెట్టుబడి’.. ఇది ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట. వీరిద్దరిలో ఎవరు రైట్? ఎవరు రాంగ్? చంద్రబాబు విద్యారంగంపై చేసిన వ్యాఖ్య చాలా తీవ్రమైనది. ఆయన రాసుకున్న పుస్తకంలో కూడా ఉన్న సంగతే ఇది. విద్యారంగానికి ప్రైవేటు రంగం బాధ్యత వహించాలనీ, కార్పొరేట్లు దాన్ని చేపట్టాలనీ అనడం ద్వారా ప్రభుత్వానికి దానితో సంబంధం అంతంత మాత్రమే అని చెప్పకనే చెప్పారు.
నిజానికి ప్రభుత్వాలు నిర్వహించవలసిన ముఖ్యమైన కర్తవ్యాలలో విద్య ప్రధానమైనది. ఆ తర్వాత వైద్యం, తదుపరి వ్యవసాయం వస్తాయి. మొత్తం రాష్ట్ర ప్రజలందరి జీవితాలనూ ప్రభావితం చేసే విషయాలివి. అందువల్లే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కానీ, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి కానీ, ఆయా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున స్కూళ్లు స్థాపించాయి. టీచర్ల నియామకానికి బాధ్యత తీసుకున్నాయి. స్కూళ్లకు భవనాలు, మైదానాలు సమ కూర్చాయి.
కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ధోరణిలో మార్పు వచ్చింది. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రముఖంగా మారాయి. విద్య వ్యాపారంగా మారిపోయింది. అందువల్ల 1998లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినా, ఆ తర్వాత ఏదో సాకుతో ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైనవారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. జనం కూడా క్రమంగా ప్రభుత్వ స్కూళ్లనూ, కాలేజీలనూ వదలి, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలవైపు చూడడం ఆరంభించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ స్కీమ్ గేమ్ ఛేంజర్‌గా మారింది. అంతవరకు ఆర్థికంగా స్థితిమంతులకూ, ఎక్కువ భాగం అగ్రవర్ణాలకే పరిమితం అయిన ఉన్నత విద్య, ఈ స్కీమ్‌తో పేదలకూ, బలహీన వర్గాలకూ కూడా అందుబాటులోకి వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఏకంగా ప్రైవేటు రంగంలోనే విద్యారంగం ఉండాలని అధికారిక కార్యక్రమాలలోనే చెప్పడం ద్వారా తన ప్రభుత్వ వైఖరి తెలియచెప్పారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు అంత ప్రాధాన్యత లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ చాలా నిర్దిష్టంగా విద్యా రంగానికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ‘అమ్మ ఒడి’ పేరుతో వినూత్న స్కీమ్‌ను ప్రవేశ పెట్టి పిల్లలను బడులకు పంపించే తల్లులకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారు. అది పేదలకు, మధ్య తరగతి పిల్లలకు వరంలా మారింది. స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకం కింద బాగు చేయాలని సంకల్పించి చకచకా పనులు ప్రారంభించారు. వాటి రూపురేఖలను మార్చడం మొదలుపెట్టారు. రంగులు వేయడం, పైకప్పులు బాగు చేయడం, స్కూల్ కాంపౌండ్‌ను ఆహ్లాద కరంగా తయారు చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా టాయిలెట్లకు ప్రయారిటీ ఇవ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ ప్రాధాన్యతలలో ముఖ్యమైనవాటిలో విద్య ఒకటి అని తెలియచెప్పారు. ఇక ‘జగనన్న విద్యా దీవెన’, ‘గోరు ముద్ద’... ఇలా వివిధ స్కీములు కూడా అమలు చేస్తున్నారు. ఫలితంగా ప్రజలలో జగన్ పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడింది.
దీంతో తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, తదితర మీడియా సంస్థలు కానీ తడబాటుకు గురయ్యాయి. ఇది ఇలాగే సాగితే ప్రజలలో జగన్ పలుకుబడిని దెబ్బతీయలేమని భావించి, రకరకాల వ్యతిరేక ప్రచారాలు ఆరంభించారు. అందులో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ‘అమ్మ ఒడి, నాన్న బుడ్డి’ అంటూ అవహేళనగా సభలలో మాట్లాడుతున్నారు. బైజూస్ టెక్నాలజీని ప్రభుత్వం తీసుకు వస్తే, దానిని ‘జగన్ జ్యూస్’ అంటూ చంద్రబాబు తన వయసు కూడా మర్చిపోయి అసహ్యకరమైన వ్యాఖ్య చేశారు. విద్యార్థులకు లోటుపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే, లీకేజీలను అరికడితే, రెండు లక్షల మంది పిల్లలు పాస్ కాలేదనీ, ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ చిత్రమైన వాదన కూడా వీరు చేశారు. ఇలా ఒకటికాదు, ఏ అవకాశం వస్తే దానిని వారు వినియోగించుకుని విషం చిమ్మినంత పనిచేశారు. అందువల్లే జగన్ ఏకంగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను దుష్టచతుష్టయంగా ప్రకటించి... వారికి దత్తపుత్రుడు తోడుగా ఉన్నారని విమర్శలు చేస్తున్నారు.
ఇలా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్న తరుణంలో కొన్ని ప్రశ్నలు సహజంగానే ముందుకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ, వారి అనుబంధ మీడియా ఒక వైపు రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో అమ్మ ఒడి లేదా ఇతర సంక్షేమ స్కీములలో ఇన్ని వేల మందికి, లక్షల మందికి ప్రభుత్వం కోత పెడుతూ అన్యాయం చేస్తోందని ద్వంద్వ ప్రమాణాలతో వార్తలు ఇస్తోంది. ఇంకో వైపు స్కూళ్ల విలీనం చేస్తున్నారంటూ రగడ సృష్టించే యత్నం చేస్తున్నారు. నిజంగానే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం సర్దుకోవడం తప్పుకాదు. కానీ అదే పనిగా ఈ మీడియా... వ్యతిరేక కథనాలు ఇస్తుండడంతో అవి విశ్వసనీయత కోల్పోతున్నాయి.
రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు, ఆయన వర్గం మీడియా చెబుతుంటారు. అదేమిటో వివరించరు. అంటే అమ్మ ఒడి స్కీమ్ అమలు చేసి, పేదలకు మేలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతున్నట్లా? ప్రభుత్వ బడులను బాగుచేస్తే ప్రభుత్వం రాష్ట్రాన్ని పాడు చేస్తున్నట్లా? పోనీ తాము అధికారంలోకి వస్తే అమ్మఒడి, నాడు–నేడు వంటి వాటిని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టగలుగుతుందా? లేక ఎప్పటి మాదిరి ప్రజలను మాయచేయడంలో భాగంగా అమ్మ ఒడి పేరు మార్చి మరింత ఎక్కువ మొత్తం ఇస్తామని ప్రకటిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఇందులో ఏది చేసినా టీడీపీకి చికాకే. రద్దు చేస్తామని అంటే పేదలెవరూ ఒప్పుకోరు. ఇంకా ఎక్కువ సాయం చేస్తామని అంటే ఇన్నాళ్లుగా చేస్తున్న ప్రసంగాలకు విరుద్ధం కనుక ఎవరూ నమ్మరు.
ఈ నేపథ్యంలో అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇది ఫ్లాగ్ షిప్ కార్యక్రమంగా మారింది. తెలుగుదేశం పార్టీకి అయోమయ పరిస్థితిని సృష్టించినట్లయింది. ఆయా ముఖ్యమంత్రులు చేపట్టిన వివిధ కార్యక్రమాలలో కొన్నిటినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అందువల్లే గతంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాత ఎన్టీఆర్, తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసే స్కీములను ప్రవేశ పెట్టి ప్రజాదరణ చూరగొన్నారు. చంద్రబాబు తనకంటూ ఒక బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేసుకోలేక పోయారు. వీటన్నిటినీ పరిశీలిస్తే జగన్ చెప్పినట్లు విద్యే పిల్లల భవిష్యత్తుకు అత్యంత కీలకం. అదే సంపద. మానవ వనరులపై పెట్టే పెట్టుబడి పవిత్రమైనదని భావించవచ్చు. అందువల్లే జగన్ సభలో ఒక చిన్నారి చక్కటి ఆంగ్లంలో ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రులు చరిత్రలో భాగం అవుతుంటారు; కానీ జగన్ చరిత్రను సృష్టిస్తుంటారు అని చెప్పినప్పుడు ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన కనిపించింది. చివరిగా ఒక మాట. ముఖ్యమంత్రిగా జగన్ ప్రసంగిస్తున్న ప్రతి సందర్భంలోనూ ఆ సభలో పాల్గొన్న ప్రజలు కానీ, విద్యార్థులు కానీ స్పందిస్తున్న తీరును గమనిస్తే జగన్ నిజంగానే చరిత్రను సృష్టించినట్లు అర్థమవుతుంది. కనుకే ప్రతిపక్ష టీడీపీకి గుండెల్లో రైళ్లు పరుగు పెడుతున్నట్లుగా ఉంది. (క్లిక్: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది?)
- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment