ఇమ్రాన్‌పై భ్రమలు తొలగుతున్నాయా? | Naila Inayat Article On Pakistan Prime Minister Imran Khan | Sakshi
Sakshi News home page

Imran Khan: ఇమ్రాన్‌పై భ్రమలు తొలగుతున్నాయా?

Published Mon, Nov 22 2021 12:07 AM | Last Updated on Mon, Nov 22 2021 11:36 AM

Naila Inayat Article On Pakistan Prime Minister Imran Khan - Sakshi

భారత దేశానికి పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో రాజకీయం రంగు మారుతోంది. ఎన్నో ఆశలతో ప్రధాన మంత్రిగా గద్దెనెక్కించిన 1992 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ విజేత ఇమ్రాన్‌ఖాన్‌ ఇమేజ్‌ రోజురోజుకూ కిందకు పడిపోతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రధానమంత్రిగా దేశాన్ని ముందుకు నడిపిస్తారని తాము ఎన్నో ఆశలు పెట్టుకుంటే తీరా అధికారంలోకి వచ్చాక ఆయన తమ మనసులను మాత్రం గెలుచుకోలేకపోయాడని ఒకప్పటి మద్దతుదారులు, మీడియా మిత్రులు అంటున్నారు.

ఒక్క సీటు మాత్రమే ఉన్న పాకిస్థాన్‌ – ఏ – తెహ్రీక్‌ను తిరుగులేని శక్తిగా మార్చి ప్రధాని పదవికి ఆయనను ‘సెలెక్ట్‌’ చేసిన పెద్దలు కూడా ఇప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌ తీరుపై పెదవి విరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇమ్రాన్‌ఖాన్‌ పచ్చి స్వార్థపరుడనీ.. అతడికి మద్దతిచ్చి తప్పు చేశామనీ అంటున్న వీరు.. పాకిస్తాన్‌ అధికార పీఠంపై ‘మార్పు’నకు రంగం సిద్ధం చేస్తున్నారా?

భారత రాజధాని ఢిల్లీ మాదిరిగానే పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ లోనూ ఇప్పుడంతా కాలుష్యం మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. ఓ తంతు మాదిరిగా ఈ సారి కూడా గుసగుసలూ ఎక్కువవుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు, మిలటరీ పెద్దలకు మధ్య తేడాలొచ్చేశాయని కొందరు, మార్పులు జరిగిపోతాయని ఇంకొందరు అంటూంటే.. మరికొందరు మాత్రం.. అబ్బే ఈ సమయంలో మార్పులంటే దేశానికి అంత మంచిదేమీ కాదని మాట్లాడుకుంటున్నారు. ఇంకొన్ని రోజులు పోతే కేబినెట్‌ మంత్రులూ తమ పాట మొదలుపెట్టేస్తారేమో! ప్రధాని మార్పుల్లాంటివి పుకార్లు మాత్రమేనని కొట్టి పారేస్తారు కూడా! అయితే ఎక్కడో ఏదో జరుగుతోందన్న విషయం మాత్రం సుస్పష్టం.

నిన్నమొన్నటిదాకా ఇమ్రాన్‌ఖాన్‌ను భుజానికి ఎత్తుకుని ఆహా.. ఓహో అన్న పెద్దమనుషుల మాటల్లోనూ తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఏమైంది? ఇమ్రాన్‌తో వీరికి చెడిందెక్కడ? విపరీతమైపోయిన ద్రవ్యో ల్బణం కారణంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మూడేళ్లు ఏం చేయలేకపోయారన్న పైపై మాటల విషయం ఎలా ఉన్నా అసలు విషయం మాత్రం ఇమ్రాన్‌ ఇప్పటివరకూ నిఘా విభాగపు అధ్య క్షుడిని నియమించకపోవడమే అసలు గుట్టు అనిపిస్తోంది.

ఈ జాప్యం కాస్తా రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేసేందుకు వీలు కల్పిం చింది. ఇమ్రాన్‌కు మద్దతిచ్చే వారు కూడా ‘‘ఈ ప్రభుత్వాన్ని మోయడం కష్టమే’’ అని వ్యాఖ్యానిస్తున్నారు. కొంత కాలం క్రితం జర గాల్సిన పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం వాయిదా పడటానికి కారణం కూడా అధికార పక్షానికి తగినంత బలం లేకపోవ డమే అని కూడా పుకార్లూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ స్థానంలో ఇంకొకరు రాబోతున్నారన్న సమా చారానికి ప్రాధాన్యం ఎక్కువైంది. 

ప్రాజెక్ట్‌ ఇమ్రాన్‌ ఖాన్‌...
అవినీతి, మోసం దగాలతో కూడిన షరీఫ్, జర్దారీల పాలన నుంచి విముక్తి కల్పిస్తానన్న వాగ్దానంతో ఇమ్రాన్‌ఖాన్‌ పదవి చేపట్టి ఎక్కువ సమయమేమీ కాలేదు. 2011లో లాహోర్‌లోని మినార్‌ – ఏ – పాకిస్థాన్‌ ర్యాలీ ద్వారా పాకిస్థాన్‌ తెహ్రీక్‌ – ఏ – ఇన్సాఫ్‌ అధ్య క్షుడిగా ఎన్నికై ఇమ్రాన్‌ఖాన్‌కు రాజకీయ పునర్జన్మ లభించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కొంతమంది అంచనాల ప్రకారం ఈ ర్యాలీకి లక్షల్లో మద్దతుదారులు హాజరయ్యారు.

ఒసామా బిన్‌ లాడెన్‌ హత్య అనంతరం పాక్‌ ప్రజల్లో అమెరికా పట్ల ఆగ్రహం పెల్లుబుకు తున్న రోజులవి. అగ్రరాజ్యపు ఉగ్రవాద పోరూ తీవ్రస్థాయిలో ఉండేది. అయినప్పటికీ ఇమ్రాన్‌ఖాన్‌ ర్యాలీకి అంతమంది జనం ఎలా వచ్చారని ఇప్పటికీ కొందరు ఆశ్చర్యపోతూంటారు. అయితే పాకి స్థాన్‌లో ‘‘అంపైర్ల’’ మద్దతు లేకుండా రాజకీయ లాభాలు అంత సులువుగా రావన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఈ అంపైర్లే తరు వాతి కాలంలో ఇమ్రాన్‌ను ప్రధాని పదవికి సెలెక్ట్‌ చేశారంటారు. 2011 నాటికి ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీకి జాతీయ అసెంబ్లీలో ఉన్నది ఒక్క టంటే ఒక్క సీటు. 2002లో గెలిచిన ఈ సీటు కూడా జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ పొత్తులో భాగంగా పది సీట్లు ఇస్తానని ప్రతిపాదిస్తే వంద కావాలని ఇమ్రాన్‌ పట్టుబట్టినప్పడు గెలుచుకున్న ఒకే ఒక్క స్థానం. 2008 ఎన్నికలను ఇమ్రాన్‌ బహిష్కరించారు. 

ఇమ్రాన్‌ ఖాన్‌ 1997లో తొలిసారి పోటీ చేసినప్పుడూ పెద్దగా ఏమీ రాణించలేదు. పోటీ చేసిన స్థానాలు తొమ్మిదింటిలోనూ ఓడి పోయాడు. ఏడు స్థానాల్లో డిపాజిట్లూ దక్కలేదు. 
ఈ నేపథ్యంలో అసలైన మార్పునకు 2013 ఎన్నికల్లో బీజం పడింది. పాకిస్థాన్‌ – ఏ – తెహ్రీక్‌ ఏకంగా 32 సీట్లు గెలుచుకుంది. ‘ప్రాజెక్ట్‌ ఇమ్రాన్‌ఖాన్‌’ మొదలైంది ఇక్కడే. 2018లో దేశం పగ్గాలు చేపట్టాలన్న ఇమ్రాన్‌ ఆశలను ‘అంపైర్లు’ నెరవేర్చారు. రిగ్గింగ్, దౌర్జన్యం, మీడియా, ప్రతిపక్ష పార్టీలకు బెదిరింపులతో నిండిన ఈ ఎన్నికల ద్వారా దేశాన్ని నడిపించేందుకు ఒక అవకాశం కల్పించారు.

అధికారం చేపట్టి ఇప్పటికే 39 నెలలవుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం పనితీరు ఏమిటయ్యా అని తరచిచూస్తే.. అంతా గందర గోళం... అయోమయం అనిపించక మానదు. ఎన్నికల్లో ఇమ్రాన్‌ విజయానికి మీడియా ఒక కారణం. ఆయన ధర్నాలకు మంచి కవరేజీ ఇచ్చారని, ఫలితంగా ‘‘నయా పాకిస్థాన్‌’’ అన్న నినాదానికి ఊపొ చ్చిందని అంటారు. పాకిస్థాన్‌కు మంచిరోజులు రాబోతున్నాయన్న ఇమ్రాన్‌ ఆశావహ వ్యాఖ్యలకు మద్దతిచ్చిన మీడియా సంస్థలు అప్పట్లో బోలెడున్నాయి.

తొలగుతున్న భ్రమలు...
దేశాన్ని నిపుణులైన వారితో నడిపిస్తున్నానని ఇమ్రాన్‌ సృష్టించిన భ్రమలు ఇప్పుడిప్పుడు తొలగుతున్నాయి. ఈ నిపుణులు షాడో కేబినెట్‌ మాదిరిగా పనిచేస్తున్నారు. అయితే వీళ్లు ఇప్పటికే తెరవెనుకే పనులు చక్కబెడుతున్నట్లుగా అనుకోవాలి. వారు సాధించింది ఏమిటో? సాధించబోయేది ఎంతో ఎవరికీ తెలియదు. ఇమ్రాన్‌ చెప్పే నిపుణుల్లో ఫవాద్‌ చౌదరీ, ఫిర్‌దౌస్‌ ఆషిక్‌ అవన్, షేక్‌ రషీద్‌ అహ్మద్, షా మహమూద్‌ ఖురేషీలతోపాటు జర్దారీ, షరీఫ్‌ కేబినెట్ల నుంచి తీసుకొచ్చిన మరికొందరు ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే మహారథి తమ పార్టీలోనే ఉన్నాడని ఇమ్రాన్‌ గొప్పలు చెప్పుకున్నాడు. అంతర్జాతీయ సంబంధాలు మొదలుకొని అన్ని అంశాలూ తమకు వెన్నతో పెట్టిన విద్య అన్న వాళ్లూ ఎందరో. అయితే వీరి పనితనం ఇంకా బయటపడాల్సి ఉంది. 

మీడియాలో ఒకప్పుడు ఇమ్రాన్‌కు మద్దతుగా నిలిచిన వారు ఇప్పుడు తప్పు జరిగిపోయిందని అనే పరిస్థితికి వచ్చారు. ‘‘సారీ యార్‌. గల్తీ సే మిస్టేక్‌ హోగయా’’ అంటూ ఇమ్రాన్‌ ఎంపిక అంత మంచి నిర్ణయమేమీ కాదన్న భావనలో ఉన్నారు. ఇమ్రాన్‌ ఓ దార్శని కుడని నమ్మామని, కానీ అతడిదంతా గందరగోళ వ్యవహారమని ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని చెబుతున్నారు.

ఉత్సాహవంతుడు, నిజాయతీపరుడు అని ఇమ్రాన్‌ను భావించామని కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి మొత్తం రివర్స్‌ అయినట్టుగా ఉంది. ఇమ్రాన్‌కు మిత్రులెవరూ లేకుండా పోతున్నారు. తనకు మద్దతు పలికి వారికి ఇమ్రాన్‌ అంతే స్థాయిలో అండగా ఉండలేకపోతున్నట్లు అందరూ భావిస్తున్నారు. ఇమ్రాన్‌ తనను తాను మాత్రమే ప్రేమించగలడని, అంతటి స్వార్థపరుడని కూడా వ్యాఖ్యాని స్తున్నారు. 

ఇమ్రాన్‌ ఖాన్‌ సాహిబ్‌... కొంచెం జాగ్రత్త! వీరందరి కోపం మిమ్మల్ని దహించకముందే జాగ్రత్తపడండి. 1992లో పాకిస్థాన్‌కు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌పై నమ్మకం పెట్టుకుని తప్పు చేశా మని మీ శత్రువులు భావిస్తున్నారు. ఒకప్పుడు మీ విజయాలకు మురిసి మిఠాయిలు పంచుకున్న వారే ఇప్పుడు చేసిన వాగ్దానాలను ఎప్పుడు నెరవేరుస్తారని గట్టిగా అడుగుతున్నారు. విదేశాలకు వెళ్లిపో యిన వందల కోట్ల డాలర్ల పాకిస్థానీ సొమ్మును వెనక్కు తెప్పిస్తా మని, కోటి ఉద్యోగాలు కల్పిస్తామని, చమురు నిక్షేపాలను వెలికితీస్తా మని ఇమ్రాన్‌ చెప్పిన గొప్పల మాటేమిటని అడుగుతున్నారు.

ఎన్నో జరుగుతాయన్న తమ కలలు కల్లలయ్యాయని ఇప్పుడు ఇమ్రాన్‌ వ్యతిరేకులు భోరుమంటున్నారు. ‘‘నయా పాకిస్థాన్‌’’ మద్దతు దారుల ఏడుపులో అంత నిజాయతీ లేదని కొంతమంది వాదించ వచ్చు. అంతా డ్రామా అని కొట్టిపారేయవచ్చు. వాస్తవం అంతేనా? లేక.. ఇమ్రాన్‌ఖాన్‌ అనే తెప్ప తగలేసి ఇంకొకరిని అందలం ఎక్కిం చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇది నాందా? ఎవరి అంచనా ఎలా ఉన్నా.. ‘‘సెలెక్టర్ల్ల’’కు, మద్దతుదారులకు, కుంగిపోయి ఉన్న చీర్‌ లీడర్స్‌కు నా ప్రశ్న ఒక్కటే. ఈ మార్పును మీరెలా ఆస్వాదిస్తున్నారు అని!! 
– నైలా ఇనాయత్, ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్, పాకిస్థాన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement