‘‘ఇమ్రాన్‌జీ.. మీకొక మంచి మాట చెబుతాను వినండి’’ అన్నారు ఖమర్ జావెద్ బజ్వా.. మార్చి మూడో వారంలో ప్రత్యేక ఆహ్వానంపై ఆయన నివాస భవనానికి వెళ్లినప్పుడు.
ఆ రోజు ఆయనతో పాటు ఐ.ఎస్.ఐ. చీఫ్ నదీమ్ అంజుమ్, ముగ్గురు లెఫ్ట్‌నెంట్ జనరల్స్ కూడా ఉన్నారు. బజ్వా ఆర్మీ చీఫ్ కనుక చుట్టూ ఆర్మీ వాళ్లే ఉంటారు. ఎప్పుడైనా నాలాంటి వాళ్లు.. అంటే..పాక్ ప్రధాని లాంటి వాళ్లు.. వాళ్లలో కలిసిపోయి ఉంటారు.
బజ్వా ఇంటి ప్రాంగణం లోపలి పచ్చిక బయలులో ఒక ప్రాచీన మహావృక్షం కింద వేసి ఉన్న గుండ్రటి చెక్క బల్ల చుట్టూ కూర్చొని ఉన్నాం అందరం. బల్ల మధ్యలో పాక్ సంప్రదాయ పానీయాలేవో ఉన్నాయి.
‘ఇమ్రాన్‌జీ.. మీకొక మంచి మాట చెబుతాను వినండి.. అన్నారే గానీ, వింటారా?’ అని అనలేదు బజ్వా!
తను చెప్పే పొజిషన్‌లో ఉన్నానని ఆయన అనుకుంటుంటారు కనుక.. ఆటోమేటిగ్గా నేను వినే పొజిషన్‌లో ఉంటానని అనుకుని ఉంటారు.
‘‘చెప్పండి బజ్వాజీ. అయితే పాక్ ప్రధానిగా రాజీనామా చేసే అవకాశాన్ని నాకు నేను ఇచ్చుకుంటాను కానీ.. నా చేత రాజీనామా చేయించే అవకాశాన్ని గౌరవనీయులైన ఆర్మీ చీఫ్ బజ్వాకు గానీ, ఐ.ఎస్.ఐ. అధినేత నదీమ్ అంజుమ్‌కి గానీ... లండన్ వెళ్లిపోయి అక్కడే ఉంటున్న మన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గానీ నేను ఇస్తానని ఆశించకుండా మీరు నాకు చెప్పదలచింది చెప్పండి..’’ అన్నాను.
ఆ మాటకు ఆయన నా వైపు నింపాదిగా చూసి, గాభరాగా నవ్వారు.
‘‘నాకు పెద్దగా రాజకీయాలు తెలియవు ఇమ్రాన్‌జీ. పొద్దస్తమానం సైన్యంతోనే సరిపోతుంది. అయినా రాజీనామా మీరు చేస్తే ఒకటి, ఎవరైనా మీచేత చేయిస్తే ఒకటీనా?! మీరు రాజీనామా చేసే పరిస్థితులు రాకుండానైతే నేను మీకు మద్దతు ఇవ్వలేను. ఒకవేళ మద్దతు ఇవ్వవలసి వచ్చినా న్యూట్రల్‌గా ఉండిపోతాను..’’ అన్నారు బజ్వా!
‘‘బజ్వాజీ.. రాజీనామాను అలా ఉంచండి. రాజీనామా చెయ్యడం చేయకపోవడం నాకు ముఖ్యం కాదు. మీరు ఉంటే నా వైపు ఉండండి. లేదంటే నాకు వ్యతిరేకులైన వారి పక్కన ఉండండి. పశువులు మాత్రమే న్యూట్రల్‌గా ఉండిపోతాయి బజ్వాజీ.. మనుషులు న్యూట్రల్‌గా ఉండరు..’’ అని చెప్పి వచ్చేశాను.
‘‘చూశారా.. మీరు గెలిపిస్తే ప్రధాని అయినవాడు, న్యూట్రల్‌గా ఎందుకు ఉండకూడదో మీకే చెబుతున్నాడు’’ అని వెనుక నుంచి నదీమ్ అంజుమ్ అనడం వినిపించింది.
‘ఆర్మీని రాజకీయాల్లోకి లాగొద్దు ఇమ్రాన్..’ అంటూనే.. ఈ పది రోజుల్లో నా రాజకీయ భూభాగంలోకి.. పార్లమెంటు లోపలి వరకు.. చొచ్చుకుని వచ్చారు బజ్వా!
ఇమ్రాన్ దిగిపోతే పాక్‌కి వచ్చే నష్టమేం లేదు. నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ ప్రధాని అవుతారు. ఆయన కాకుంటే నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ప్రధాని అవుతారు. ఆమె కాకుంటే బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో ప్రధాని అవుతాడు.
వీళ్లందరి కన్నా బిలావల్‌కే ప్రధాని కావాలన్న తొందర ఎక్కువగా ఉన్నట్లుంది. కొంతకాలంగా అతడు నన్ను తమ పార్టీ సమావేశాలలో, ప్రెస్ మీట్‌లలో.. పీఎం ఇమ్రాన్ ఖాన్ అనడం మాని, మాజీ పీఎం ఇమ్రాన్‌ఖాన్ అంటున్నాడు!
పాక్ రాజకీయాల్లోని మార్మికత ఎంత చెప్పినా, ఎంత విన్నా అర్థం కాదు. ప్రధాని అయ్యాక ఎవరికి వారు స్వయంగా తెలుసుకోవలసిందే.
ఒక పాక్ ప్రధాని.. మాజీ ప్రధాని అయేందుకు పట్టే కాలం.. పాక్ పార్లమెంటు హౌస్‌కి, పాక్ ఆర్మీ చీఫ్ నివాసానికి మధ్య పెరుగున్న దూరాన్ని బట్టి ఉంటుందే తప్ప.. ప్రజల్లో ఆదరణ, ప్రజా ప్రతినిధుల్లో విశ్వాసం సన్నగిల్లి మాత్రం కాదు.
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment