టెలీ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌.. ఎంతో ఉపయోగకరం! | National Tele Mental Health Programme: Experts Welcome | Sakshi
Sakshi News home page

టెలీ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌.. ఎంతో ఉపయోగకరం!

Published Mon, Feb 7 2022 2:27 PM | Last Updated on Mon, Feb 7 2022 2:27 PM

National Tele Mental Health Programme: Experts Welcome - Sakshi

మానసిక వికాసానికి భరోసా ఇస్తుంది కేంద్రం నూతనంగా ప్రకటించిన టెలీ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌. కరోనా మహమ్మారి వయస్సుతో సంబంధం లేకుండా అందరి మనస్సులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల మానసిక ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన ఆరోగ్య కౌన్సెలింగ్‌ను ప్రజలకు అందించడానికి జాతీయ టెలీమెంటల్‌ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి 2022–23 బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 23 టెలీ–మెంటల్‌ హెల్త్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ల నెట్‌వర్క్‌ ద్వారా సేవలు అందుబాటులోకి తెస్తారు. బెంగళూరు లోని నిమ్హాన్స్‌ నోడల్‌ సెంటర్‌గా ఉంటుంది. ఇదే నగరంలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సాంకేతిక మద్దతును అందిస్తుంది అని మంత్రి ప్రకటించారు.

కేర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా ఈ సంజీవని మానసిక సేవలు మార్చి 28, 2020 నుండి (మొదటి 21 రోజుల జాతీయ లాక్‌డౌన్‌ విధించిన నాలుగు రోజుల తర్వాత) నిమ్హాన్స్‌ తన టోల్‌ ఫ్రీ నంబర్‌ 080– 46110007 ద్వారా లక్షకు పైగా మానసిక ఆరోగ్య సేవలను అందించింది. కర్నాటకలో ఇప్పటికే అమలు చేస్తున్న ఈ మానస్‌ కార్యక్రమాలు 23 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సె లెన్స్‌ల ద్వారా దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. కేర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా మానసిక ఆరోగ్య సౌకర్యాలు, నిపుణుల వివరాలు, వైద్య రికార్డులు, మానసిక సమస్యలకు అధునాతన సాంకేతికత జోడిం చడం జరుగుతుంది. మానసిక రోగుల నామినేటెడ్‌ ప్రతినిధుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. అదే విధంగా మనోవేదనలను పరిష్కరించడానికి మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డుతో సమన్వయం చేసుకోవడం ఉంటుంది.

 మానసిక వికాసానికి భరోసా ఇస్తున్నది టెలీ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌. కరోనా మహమ్మారితో మారుతున్న జీవన విధానం, వృత్తి, ఉద్యోగాలు మానవాళిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. తద్వారా జీవి తంపై పెను ప్రభావాన్నే చూపుతున్నాయి. చివరకు బలవన్మరణాలకు కూడా దారితీస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా నేటి ఉరుకుల పరుగుల జీవనంతో చాలామంది మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఉంటూనే స్మార్ట్‌ మొబైల్స్‌ రాకతో వారికి దూరంగా గడు పుతున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీక సతమతమవుతూ, తీవ్ర మనోవేదనకు గురవుతున్న వారికి ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌తో పరిష్కారం దొరికే అవకాశం ఏర్పడుతోంది. 
 
– డాక్టర్‌ అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
జాతీయ అధ్యక్షుడు
అసోసియేషన్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement