న్యూఢిల్లీ: పేదరికం ఓ మనోభావన అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా చెణుకులు విసిరారు. కేంద్ర బడ్జెట్ 2022–23పై చర్చకు శుక్రవారం రాజ్యసభలో సమాధానమిస్తూ, పేదరిక నిర్మూలనకు బడ్జెట్ ఏ మాత్రం దోహదపడేలా లేదన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. ‘‘పేదరికానికి మీ మాజీ అధ్యక్షుడే గతంలో కొత్త నిర్వచనమిచ్చాడు.
తిండి, డబ్బు, వస్తువులు లేకపోవడం పేదరికం కాదని, అదో మానసిక భావన మాత్రమేనని అన్నాడు. ఆత్మవిశ్వాసముంటే దాన్ని అధిగమించవచ్చన్నాడు. ఆయనెవరో మీకందరికీ తెలుసు. మీరు నిర్మూలించాలంటున్నది ఆ మానసిక పేదరికాన్నేనా?’’ అని ప్రశ్నించారు. ఇది పేదలను హేళన చేయడమేనన్న శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పేదలను హేళన చేసిన వ్యక్తి తాలూకు పార్టీతో శివసేన జట్టు కట్టిందన్నారు.
‘‘నేనెవరి పేరూ చెప్పలేదు. అయినా ఆ నేతను కాపాడేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే, వానాకాలంలో కప్పల బెకబెకలు వినపడగానే అవెక్కడున్నదీ అందరికీ తెలిసిపోతుందన్న తమిళ సామెత గుర్తొస్తోంది’’ అంటూ నిర్మల ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచీ భారత్ రాహుకాలంలో ఉందన్న కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కామెంట్లపైనా నిర్మల వాగ్బాణాలు సంధించారు. ‘‘నిజమైన రాహుకాలం ఏమిటో తెలుసా? సొంత పార్టీ ప్రధాని తెచ్చిన ఆర్డినెన్సును మీడియా సాక్షిగా మీ నేత (రాహుల్) చించేసిన కాలం. మీతో సహా 23 మంది కాంగ్రెస్ నాయకులు పార్టీ నాయకత్వ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టిన కాలం. సీనియర్లంతా ఆ పార్టీని వీడుతున్నారే, ఆ కాలం. ఆ పార్టీ కేవలం 44 ఎంపీ సీట్లకు పడిపోయిన కాలం’’ అంటూ తిప్పికొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment