గట్టివాళ్లే చట్టానికి గౌరవం | Sakshi Guest Column On Supreme Court Of India And Justice A P Shaw | Sakshi
Sakshi News home page

గట్టివాళ్లే చట్టానికి గౌరవం

Published Tue, Dec 20 2022 12:32 AM | Last Updated on Tue, Dec 20 2022 12:33 AM

Sakshi Guest Column On Supreme Court Of India And Justice A P Shaw

నాటి పాలకులు దేశంలో ‘ఎమర్జెన్సీ విధించి, న్యాయవ్యవస్థకే సవాలుగా పరిణమించినప్పుడు... జస్టిస్‌ హెచ్‌.ఆర్‌. ఖన్నా ఒక్కరు మినహా మొత్తం సుప్రీంకోర్టు యావత్తూ అచేతనంగా ఉండిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అలాంటి రోజులు ‘మళ్లీ ఇప్పుడు దాపురించాయా అనిపిస్తోంది’ అని జస్టిస్‌ ఎ.పి. షా తన తాజా వ్యాసంలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత పాలకులు ఇందిరాగాంధీలా సూటిగా తలపడినట్టు కన్పించకపోవచ్చుగానీ, ప్రజాస్వామ్య సంస్థలను నర్మగర్భంగా శక్తిహీనం చేస్తూ పౌరహక్కులకు భంగం కలిగించడం చూస్తున్నామని ఆ వ్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో.. ఇటీవల కొందరు గట్టివాళ్ళ హయాంలలో కోర్టు తన వాణిని బలంగా వినిపించగలగడం న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఆర్థిక నేరాలను, దొంగచాటు ద్రవ్య లావాదేవీలను, సంబంధిత నేరాలను పసిగట్టి సాధికారికంగా బహిర్గతం చేసి.. దేశాలను, ప్రభుత్వాలను హెచ్చరించడానికి ప్రసిద్ధ న్యాయ నిపుణు లతో ప్యారిస్‌ కేంద్రంగా ఏర్పడి పనిచేస్తున్న ఫ్రెంచి ఎన్జీవో సంస్థ ‘షెర్పా’! యూరప్, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండాలలోని పౌర సమాజాల సాంఘిక సంస్కరణోద్యమాలకు ఈ సంస్థ బాసటగా నిలుస్తోంది. ఇదే నిపుణుల సంస్థ రాఫెల్‌ కొనుగోలు వ్యవహారంలోని చీకటి కోణాలను కూడా వెలికి తెచ్చింది.

2015 నుంచీ పనిచేస్తున్న ‘రిలయెన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌’ కంపెనీ.. ‘దస్సాల్ట్‌’ అనే ఫ్రెంచి విమాన కంపెనీతో అనుసంధానమై 36 రాఫెల్‌ జెట్‌ విమానాలను భారత ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసింది. రిలయెన్స్‌ కంపెనీ అధిపతి అనిల్‌ అంబానీ 2019లో ప్రకటించిన లెక్కల ప్రకారం అప్ప టికి అతనికున్న అప్పులు రూ. 93,000 కోట్లు. కాగా, 2020లో ఒక కేసు సందర్భంగా లండన్‌ కోర్టులో ఆయన వెల్లడించిన తన ఆస్తి విలువ ‘సున్న’ (జీరో)! అలాంటి ‘జీరో’ ఆస్తిపరుడి కంపెనీ ద్వారా ఫ్రెంచి దస్సాల్ట్‌ విమాన కంపెనీ 36 రాఫెల్‌ జెట్‌ విమానాలను ఎలా అమ్మగలిగిందన్న అంశం బట్టబయలు కావడంతో, రిలయెన్స్‌ కంపెనీ లావాదేవీలతో ముడిపెట్టుకున్న భారతపాలకుల మెడకు చుట్టుకొంది. 

ప్రభుత్వం ఈ క్షణం దాకా రాఫెల్‌ కుంభకోణం నుంచి బయట పడకపోగా భారతదేశ ప్రయోజనాలకు హానికరమైన అంతర్జాతీయ లావాదేవీలలో కూరుకుపోయిందని ‘షెర్పా’ బహిర్గతం చేసింది. ‘షెర్పా’ సంస్థ విఖ్యాతికి రెండే రెండు ఉదాహరణలు ఒకటి: సిరియా మాజీ వైస్‌–ప్రెసి డెంట్‌ రిఫాత్‌ అల్‌ అసాద్‌ ‘మనీ లాండరింగ్‌’ కుంభకోణాలను ‘షెర్పా’ బట్టబయలు చేయడంతో అసాద్‌కు ప్యారిస్‌ కోర్టు నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష వేసింది. రెండు: ఫ్రాన్స్‌లో టెర్రరిస్టు లకు భారీగా చందాలిచ్చి ప్రోత్సహిస్తున్న పెద్ద కంపెనీ లఫార్గే కార్య కలాపాల్ని 2018లో బహిర్గతం చేసి కంపెనీ ఉద్యోగుల ప్రయోజనాల్ని షెర్పా రక్షించగల్గింది. రాఫెల్‌ విమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీలకు బదులుగా.. అప్పటికే దేశీయంగా అత్యుత్తమ నాణ్యతా సేవలందిస్తున్న భారీ ప్రభుత్వరంగ విమాన సంస్థ ‘భారత హిందు స్థాన్‌ లిమిటెడ్‌’ సేవలను పాలకులు ఎందుకు వినియోగించుకో లేదన్నది ప్రధాన ప్రశ్న.

దీంతోనే షెర్పా ఈ రిలయెన్స్‌ ఒప్పందం వెనుక ఏం జరిగిందన్నదానిపై దృష్టి సారించింది. ఈ కాంట్రాక్టులో ఎలాంటి అనుమానానికి తావులేని అవినీతి జరిగిందని, కాంట్రాక్టుపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాల్సిందేనని రాహుల్‌ గాంధీ కోరిన విషయమూ తెలిసిందే. కానీ, ప్రభుత్వం విచారణకు నిరాకరించడంతో, రిలయెన్స్‌ కంపెనీ ద్వారా కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగింది. తద్వారా అనుమానాలు ధ్రువపడ్డాయి. అందుకే ‘షెర్పా’ సంస్థ స్వతంత్రమైన న్యాయమూర్తి ద్వారానే బీజేపీ– రిలయెన్స్‌ సంబంధాల లోతుపాతుల్ని పరిశీలించడం దేశ ప్రయోజ నాల దృష్ట్యా అవసరమని చాలాకాలంగా కోరుతోంది. అంతేగాదు, రిలయెన్స్‌ ద్వారా ప్రస్తుత పాలకులు కుదుర్చుకున్న ‘రాఫెల్‌’ ఒప్పం దంలో అవినీతిని కనిపెట్టే ఏ క్లాజుకూ అవకాశం లేకుండా జాగ్రత్త పడటం జరిగిందని ‘హిందూ’ పత్రిక కూడా రాసిందని ‘షెర్పా’ పేర్కొంది. ఒక్క ముక్కలో ‘భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే అంతర్జాతీయ అవినీతి శక్తులకు ప్రతిబింబమే రాఫెల్‌ ఒప్పందమ’ని షెర్పా ప్రకటించింది. షెర్పాకు ఇంత బలాన్ని చేకూర్చింది ఆ సంస్థ లోని న్యాయ నిపుణులేనన్నది ఇక్కడ గమనించాలి. 

ఈ పరిణామాల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, భారత లా కమిషన్‌ మాజీ అధ్యక్షులు, ఢిల్లీ, మద్రాసు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ అజిత్‌ ప్రకాష్‌ షా తాజా హెచ్చరికను కూడా భారత రాజ్యాంగ మౌలిక నిబంధనలను, సత్యాలను రక్షించుకోగోరే వారంతా పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవల నూతనంగా దేశ ఉపరాష్ట్రపతి పదవిలోకి వచ్చిన జగదీప్‌ ధంకర్, కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజూ భారత సుప్రీం కోర్టుపైన, కొలీజియం వ్యవస్థ పైన అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరికి భారత మౌలిక రాజ్యాంగ వ్యవస్థ రక్షణకు దోహదం చేసిన సూత్రాలను కూడా విస్మరించి దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే ప్రశ్నించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని జస్టిస్‌ షా ఖండించాల్సి వచ్చింది. ‘‘ఈ ధోరణి 2014 నుంచీ సాగుతూనే ఉంది.

సుప్రీం కోర్టు అనేది రాజ్యాంగ పరిరక్షకురాలు, చట్టాన్ని శాసించే శక్తి అని మరువరాదు’’ అని జస్టిస్‌ షా పేర్కొన్నారు. దేశంలో ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ విధించి, దేశ న్యాయ వ్యవస్థకే సవాలు విసరడానికి పూనుకున్నప్పుడు, పౌర హక్కులు తుడిచిపెట్టుకు పోతున్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఆర్‌. ఖన్నా ఒక్కరు మినహా మొత్తం సుప్రీంకోర్టు అలా చూస్తూ ఉండిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి రోజులు మళ్లీ ఇప్పుడు దాపురించాయా అనిపిస్తోంది’’ అని జస్టిస్‌ షా గుర్తు చేయవలసి వచ్చింది. ప్రస్తుత పాలకులు ఇందిరా గాంధీలా సూటిగా తలపడినట్టు కన్పించకపోవచ్చుగానీ, ప్రజాస్వామ్య సంస్థలను నర్మగర్భంగా శక్తిహీనం చేస్తూ పౌరహక్కులకు భంగం కలిగించడం చూస్తున్నామని జస్టిస్‌ షా తాజా వ్యాసంలో పేర్కొన్నారు.

‘‘2014 తర్వాత దేశంలో ‘లోక్‌పాల్‌’ వ్యవస్థ కనుమరుగు అయి పోయింది. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్‌ నేడు కనపడదు. ఉన్న విచారణ సంస్థలు పేరుకే! పైగా వాటిని ఇప్పుడు ప్రభుత్వ చర్యలను విమర్శించి లేదా నిరసన తెలిపే ప్రజా కార్య కర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులు, రాజకీయ ప్రత్యర్థులపైన ప్రయోగి స్తున్నారు’’ అని జస్టిస్‌ షా పేర్కొన్నారు. రానురాను కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజీపడే దుఃస్థితికి చేరిందని, ఇక సమాచార కమిషన్‌ కూడా జీవచ్ఛవం అయిందనీ, ఇలా బాధ్యతలు చాలించుకున్న సంస్థల జాబితా పెరిగిపోతోందని, చివరికి పత్రికలు, పౌర సంస్థల కార్యకలాపాల్ని కూడా బలహీన పరిచి విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేయడం జరుగుతోందనీ జస్టిస్‌ షా ఆందోళన వ్యక్తం చేశారు.

ఆఖరికి సుప్రీంకోర్టు కూడా దేశ పాలక వర్గ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జస్టిస్‌ ఎ.పి. షా ఘాటుగా విమర్శించారు. ఎటుతిరిగీ ఇటీవల ప్రధాన న్యాయమూర్తులుగా పదవులు స్వీకరించిన జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, లలిత్, డి.వై. చంద్రచూడ్‌ల హయాంలలో కోర్టు తన వాణిని బలంగా వినిపించగల్గుతోందని జస్టిస్‌ షా చెబుతూ తన నమ్మకాన్ని ఇలా ప్రకటించారు: ‘‘నేడు సుప్రీంకోర్టు మంచి న్యాయ మూర్తుల చేతులలో ఉంది. పాలకుల ఒత్తిళ్లకు లొంగకుండా వారు పనిచేస్తున్నారు. అప్పటికీ పాలకులు దారికి రాకపోతే, దేశ చట్టాన్ని గౌరవించి తీరాలని వారికి తెలియచెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికీ ఇదే మార్గం’’ అని జస్టిస్‌ షా దిశానిర్దేశం చేశారు. ఈ సదవగాహన దృష్ట్యా చూస్తే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన మరుక్షణం నుంచీ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్, ఆయన సోదర న్యాయమూర్తులు.. ‘దేశంలో పౌరుల స్వేచ్ఛ, తదితర హక్కులకు న్యాయ స్థానాలే రక్ష అని పురుద్ఘాటించారని భావించాలి. 

ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ వచ్చి భారత ప్రజలు పోరాటాల ద్వారా సాధించుకున్న సమాచార హక్కు చట్టాన్ని గత ఎనిమిదేళ్లుగా పాలకులు చాపచుట్టి పక్కన పడేశారన్న విమర్శ ఉంది. ఆ చట్టాన్ని తు.చ. తప్పక సద్వినియోగం చేసిన పర్యవ సానంగా పాలకుల ఒత్తిళ్లను ఎదుర్కొన్న ఒక జాతీయ కమిషనర్‌..  ‘సమాచార హక్కు కోసం’ ప్రజలు జరిపిన పోరాటాలు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా తన బాధ్యతను కాపాడుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భంలో.. యాభై ఏళ్ల క్రితం ఒక సన్మాన సభలో మహాకవి కృష్ణశాస్త్రి అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘‘మనిషితో ఎడతెగని సావాసమూ, ప్రేమిస్తే ఆనందం, దూరమైతే బాధతో కొట్టుకు పోవడం – ఇవే నాకు తెలుసు. ఇది నా మతం, నాకిక వేరే మతం లేదు, కులం అసలే లేదు. నేను మనిషిని’’ అని ఈ లోకంలో ఎంతమంది చాటుకోగలరు?!


ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement