2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీద పోటీకి దిగే రిపబ్లికన్ అభ్యర్థి ఎవరు? పోరాటం తిరిగి బైడెన్, ట్రంప్ మధ్యనే ఉంటుందా? వారం రోజుల్లో రిపబ్లికన్ అభ్యర్థుల ప్రాథమిక డిబేట్ మొదలవుతుంది. ఒక పోల్ ప్రకారం, 52.7 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ను సమర్థిస్తుండగా, ఆయన సమీప పోటీదారు డసాంటస్‌కు 14 శాతం మందే మద్దతిచ్చారు. పైగా 86 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు, ట్రంప్‌పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో తెచ్చినవని నమ్ముతున్నారు. ఏమైనా రాజకీయ వినోదం కోసం అర్రులు చాచే ప్రజారాశుల కోరికను తనకు అనుకూలంగా మలుచుకోగలిగే శక్తిమంతుడు ట్రంప్!
2022 నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, ప్రతినిధుల సభకు మొత్తం సభ్యు లనూ, సెనేట్‌లో మూడింట ఒక వంతు సభ్యులనూ అమెరికన్లు ఎన్ను కున్నప్పుడు– పాత రిపబ్లికన్ వ్యవస్థకు చెందినవారితోపాటు కొందరు డెమొక్రాటిక్ పండితులు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలకు ‘నివాళులు’ అర్పించారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ బలపరిచిన అభ్యర్థులు ఓడి పోయారు. 2020 ఎన్నికలు ‘దొంగిలించబడ్డాయని’ ట్రంప్ చేసిన ప్రక టనను బలపర్చినవారినీ, జో బైడెన్ చేతిలో ఓడిపోయినా అధికారంలో కొనసాగడానికి ట్రంప్ చేసిన దుస్సాహసిక ప్రయత్నానికి మద్దతు ఇచ్చినవారినీ ఓటర్లు స్పష్టంగా తిరస్కరించారు.
ట్రంప్ తన పదవీ కాలంలో తన నామినీలతో నింపిన సుప్రీంకోర్టు గర్భస్రావాలపై ఇచ్చిన తీర్పు మీద మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. రిపబ్లికన్ పార్టీ నుంచి మరో అధ్యక్ష అభ్యర్థి, ట్రంప్ అత్యంత సమీప పోటీదారు అయిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డసాంటస్ తాజాగా రెండోసారి కూడా గవర్నర్‌గా విజయం సాధించారు. పైగా రిపబ్లికన్ దాతలు, ఆయన ప్రభావవంతమైన మీడియా ఛాంపియన్లు ఇద్దరూ ట్రంప్‌కు దూరమయ్యారు. మరి ఈ కొన్ని నెలలు రాజకీయాల్లో ఎలాంటి తేడాను చూపగలవన్నది ప్రశ్న.
రిపబ్లికన్ అభ్యర్థులు వచ్చే వారం అయోవాలో తమ మొదటి ప్రాథమిక డిబేట్‌కు వెళుతుండగా, ఈ రేసులో ట్రంప్ ఎంత సౌకర్య వంతమైన స్థానంలో ఉన్నారంటే, బహుశా ఆయన ఆ చర్చకు కూడా వెళ్లకపోవచ్చు. ‘ఫైవ్‌థర్టీయైట్.కామ్’ రిపబ్లికన్ అభ్యర్థుల ప్రాథమిక పోటీల తాజా పోల్స్‌లో, 52.7 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ను సమ ర్థించారు. 14 శాతం మంది మాత్రమే డసాంటస్‌కు మద్దతుగా నిలిచారు.
ఇద్దరి మధ్యా ఆశ్చర్యకరంగా 38 శాతం తేడా ఉంది. వచ్చే వారం డిబేట్‌లో కనిపించే మిగతా వారందరూ – ప్రముఖంగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, మైక్ పెన్స్, క్రిస్ క్రిస్టీ, టిమ్ స్కాట్‌లకు ఈ పోల్‌లో 10 శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. చాలామందికి 5 శాతం కంటే తక్కువ వచ్చాయి. అయితే, ఏ రాజకీయ నేపథ్యం లేకుండా మొదటిసారి పోటీకి దిగుతున్న వివేక్ రామస్వామికి పెరుగు తున్న ఓటర్ల మద్దతు మాత్రం చెప్పుకోదగ్గది.
ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రతి నేరారోపణ ఆయన పునాదిని బలోపేతం చేయడంలో సహాయపడింది. దాంతోపాటు బైడెన్ పరిపా లనకు వ్యతిరేకంగా రిపబ్లికన్‌లను ఇది సమైక్యపర్చింది. అయితే ఆయనపై ఆరోపించిన ప్రతి నేరాన్ని నిశితంగా చూస్తే, ట్రంప్ ఎంత ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది. ఒక శృంగార తారకు డబ్బు చెల్లించాలంటే తన వ్యాపార రికార్డులను తప్పుగా చూపడమే కాకుండా, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఆర్థిక చట్టాలను ఉల్లంఘించాల్సి ఉంటుందని ట్రంప్‌కు తెలుసు. ఆయినా ఆ మార్గంలోనే ముందుకు సాగారు.
వైట్ హౌస్ నుండి జాతీయ భద్రతా రహస్యాలను దొంగిలించడం, వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం, వాటిని దాచమని తన వ్యక్తిగత సహాయకుడికి చెబుతూనే, ఆ పత్రాలు తన వద్ద లేవని అబద్ధం చెప్పడం కూడా చట్టవిరుద్ధమని ఆయనకు తెలుసు. దానిక్కూడా సిద్ధపడ్డారు. 2020 ఎన్నికల ఫలితా లను తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన సొంత కార్యాలయ సిబ్బందితోపాటు ప్రచార విభాగంలోని చాలామంది విశ్వసనీయమైన వ్యక్తులు ఆయన్ని హెచ్చరించారు.
అయినా ఏడు రాష్ట్రాల నుండి మోసపూరిత ఓటర్ల జాబితాను సృష్టించారు, తన ఆదేశాలను పాటించని రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు, ఫలితాల ధృవీకరణను నిరోధించడానికి క్యాపిటల్‌పై దాడి చేయవలసిందని ఒక గుంపును ప్రేరేపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... రాజ్యాంగం, చట్టపరమైన నిర్మాణం, సంస్థాగత నిబంధనలు, పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ నియమాలే కాకుండా, ఎలాంటి మంచీ చెడూ నియంత్రణలలో లేని వ్యక్తి ట్రంప్.
అయినప్పటికీ ట్రంప్ తనపై చేసిన మూడు నేరారోపణలను (ఈ వారంలో నాలుగవది ఎదుర్కొన్నారు) కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో గొప్ప విజయం సాధించారు. అమెరికన్ డీప్ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న హీరోలా, ఉదారవాదుల కుట్ర ఎదుర్కొంటున్న బాధితుడిలా ఆయన పాత్రలు మార్చుకుంటున్నారు. మరింతగా విరాళాలను సేకరించడం ప్రారంభించారు (ఈ డబ్బులో చాలా మొత్తం కేసుల ఫీజులకే పోతుంది).
పైగా పార్టీలో క్షేత్రస్థాయి వర్గాలు ఆయన వెనుక సంఘటితమవుతున్నాయి. ఇటీవలి సీబీఎస్ న్యూస్ పోల్ ప్రకారం, 86 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు, ట్రంప్‌పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో వచ్చినవని నమ్ముతున్నారు. బైడెన్ చట్టబద్ధంగా ఎన్నిక య్యారని 92 శాతం మంది డెమొక్రాట్‌లు విశ్వసిస్తున్నప్పటికీ, 68 శాతం మంది రిపబ్లికన్లు బైడెన్ ఎన్నికను విశ్వసించడం లేదు.
అంటే వీళ్లు ట్రంప్ అబద్ధాన్ని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఒహాయో రాష్ట్ర శాసనసభ్యుడు, ట్రంప్ మద్దతుదారు అయిన నీరాజ్ అంటాని ఈ వ్యాసకర్తతో ట్రంప్ పునరుత్థానం గురించి చెప్పిన దానిని కూడా గమనించాలి: ‘‘ఇది ట్రంప్ పార్టీ. మాజీ దేశాధ్యక్షుడు దానిని నిర్వచిస్తున్నారు.’’
చివరకు, డసాంటస్ చేస్తున్న ప్రచారంలోని వైఫల్య శకలాలే ట్రంప్ పునరుత్థానాన్ని నిర్దేశిస్తున్నాయి. సాంఘిక సంప్రదాయవాదు లను గెలవడం కోసం... జాత్యహంకారం, బానిసత్వం, లైంగికత చుట్టూ ఉన్న బోధనలపై గవర్నర్ డసాంటస్ దాడి చేస్తూ, సాంస్కృతిక మితవాద తీవ్రవాదం ప్రాతిపదికన తన రాజకీయాలను నిర్వచించుకుంటున్నారు. అయితే ఇది ఆయనకు మద్దతు పెరగడంలో సహా యపడలేదు.
పూర్వాశ్రమంలో యూఎస్ కాంగ్రెస్‌లో డసాంటస్‌తో కలిసి పనిచేసినవారు ఆయనకు ప్రజాకర్షణ కానీ, సహజమైన రాజ కీయ అనుసంధానం కానీ లేవని చెబుతున్నారు. తన ప్రచారాన్ని కూడా పేలవంగా నిర్వహిస్తున్నారు. సిబ్బందిని తరచుగా మార్చడంలో ఇది ప్రతిఫలిస్తోంది. ఇటీవలి ఒక ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ఎత్తి చూపినట్లుగా, ఫ్లోరిడా గవర్నర్‌ను కనికరం లేకుండా ట్రంప్ ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా, ట్రంప్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలి యక డసాంటస్ తికమక పడుతున్నారు.
రిపబ్లికన్లు వచ్చే జూలైలో మాత్రమే తమ అధ్యక్ష అభ్యర్థి ఎవర నేది నిర్ణయిస్తారు. ట్రంప్ చేస్తున్న న్యాయ పోరాటాలు ఆయన శక్తిని బాగా హరించవచ్చు. అయినా కూడా 2024లో అమెరికాలో జరిగే రాజకీయ పోరాటం తిరిగి బైడెన్, ట్రంప్ మధ్యనే సాగేట్టుగా కనిపిస్తోంది. అయితే అభ్యర్థిగా ట్రంప్ పోటీలో ఉండటం తమకు కలిసొస్తుందని బైడెన్ బృందం నమ్ముతోంది. బ్యాలెట్ పత్రాల్లో ట్రంప్ ఉనికి చాలు... స్వతంత్రులు, మితవాద రిపబ్లికన్లు, సబర్బన్ మహిళలు ఆయనకు దూరం జరగడానికి అన్నది ఈ వర్గం మాట.
ట్రంప్ పట్ల వారి అపనమ్మకం, అయిష్టత చాలా తీవ్రస్థాయిలో ఉన్నందున... బైడెన్‌కు రెండవసారి పదవి దక్కడంపై ఉత్సాహం చూపని యువతతో సహా డెమొక్రాటిక్ పార్టీ పునాదిని ఏకీకృతం చేయడంలో ఇవి సహాయపడతాయి. తన పునాదిపై ఇప్పటికీ బలమైన పట్టున్న ట్రంప్‌ను తక్కువగా అంచనా వేయడం పొరపాటు అని వాదించే డెమొక్రాట్లు కూడా ఉన్నారు.
అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి, అర డజను ఊగిసలాడే రాష్ట్రాల్లో మరోసారి మెజారిటీ కొన్ని వేల ఓట్లకు తగ్గుతుందని వీరి భయం. నిరుత్సాహకరమైన దేశ ఆర్థిక స్థితితో పాటు రాజకీయ వినోదం కోసం అర్రులు చాచే ప్రజారాశుల కోరికను కూడా తనకు అనుకూలంగా ట్రంప్ మలుచు కోగలరు. మొత్తం మీద, వచ్చే నవంబర్‌లో ఏమి జరిగినా, ట్రంప్ కరిష్మా ఇప్పటికీ సజీవంగానే ఉంది. అది అమెరికన్ రాజకీయాలను నిర్దేశిస్తూనే ఉంది.
ప్రశాంత్ ఝా
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment