మణిపుర్‌కు మతం రంగు! | Sharmila speech provoked a religion | Sakshi
Sakshi News home page

మణిపుర్‌కు మతం రంగు!

Published Sat, Feb 10 2024 3:30 AM | Last Updated on Sat, Feb 10 2024 3:30 AM

Sharmila speech provoked a religion - Sakshi

మణిపుర్‌లో విధ్వంసం కన్నా మణిపుర్‌పై విధ్వంసక ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది! దేశంలో ఎక్కడేం జరిగినా దానికి మతాన్ని అంటుకట్టేలా తయారైన రాజకీయ వ్యవస్థ ఆఖరికి మణిపుర్‌లోని తెగల మధ్య ఘర్షణలను కూడా ‘మత కలహాలు’గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది.

మణిపుర్‌తో సంబంధం లేని రాష్ట్రాలకు సైతం ఆ ‘రాజకీయ మతోన్మాదం’ వ్యాపించింది! దురుద్దేశాలతో కొన్ని విదేశీ శక్తులు, పొద్దెరగని కొందరు దేశవాళీ కొత్త రాజకీయవాదులు స్వార్థ ప్రయోజనాల కోసం మణిపుర్‌ నిప్పుల కుంపటిని తమ ప్రసంగ వేదికలపైకి మోసుకెళుతున్నారు. అవి మత కలహాలు కావు... భూమి హక్కుల తగాదాలని తెలిసీ మణిపుర్‌కు మతం రంగును పులుముతున్నారు!

నిరుడు ఈ సమయానికి మణిపుర్‌ ప్రశాంతంగా ఉంది. ఫిబ్రవరిలో ప్రశాంతం. మార్చి నెలలో కూడా ప్రశాంతం. ఏప్రిల్‌ వచ్చేసరికికొంచెం వేడెక్కింది. అయితే అది... ఏప్రిల్‌లో 16 సెల్సియస్‌ డిగ్రీలతో మొదలై, జూన్‌ నాటికి 35 డిగ్రీల వరకు చేరుకునే ఎండాకాలపు వేడిమి కాదు. నిరసన  ప్రదర్శనల వేడి. దాడులు, దహనాల వేడి. నిజానికి అంతకు పదేళ్లు, ఆ ముందు పదేళ్ల నుంచి కూడా మణి పుర్‌ దాదాపుగా ప్రశాంతంగానే ఉంది. రాష్ట్రాన్నే రెండు ముక్కలు చేసేంతగా అక్కడేం జరగలేదు. గత మే నెల నుంచే హింసాకాండ మొదలైంది. మూకుమ్మడి దాడులు, గృహదహనాలు, ప్రార్థనాస్థలాల ధ్వంసం, మహిళల్ని నగ్నంగా ఊరేగించడం మణిపుర్‌ను అగ్నిగుండంలా మార్చేశాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 180 మంది మరణించారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. 

డిసెంబరులో మణిపుర్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపించినప్పటికీ కొత్త సంవత్సరంలో మళ్లీ ఒక్కసారిగా హింస చెలరేగింది. జాతుల మధ్య మొదలైన ఈ ఘర్షణలు విద్వేష జ్వాలలే అయ్యాయి. ఇంతకన్నా ఘోరం... అక్కడ జరుగుతున్న ఘటనలపై పాశ్చాత్య మీడియా చేస్తున్న దుష్ప్రచారం! వారితో పాటు అంతర్గతంగా మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా మణిపుర్‌కు మతంరంగు పులిమేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ‘‘1947లోపంజాబ్‌లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలన కాండను మణిపుర్‌ ఘటనలు గుర్తు చేస్తున్నాయి’’ అనేంతగా ప్రచారం జరుగు తోంది. వారి వ్యతిరేకత ఎవరి మీదనైనా కావచ్చు. కానీ వాస్తవాలను హతమార్చడం ఎందుకు? పర్ణశాల వంటి మణిపుర్‌పై మతోన్మాద మరకల్ని అంటించడం దేనికి?భౌగోళికంగా మణిపుర్‌ ప్రత్యేకమైనది.

రాష్ట్రంలో కేవలం పది శాతం మాత్రమే ఉన్న మైదాన భూభాగంలో రాష్ట్రంలోని దాదాపుతొంభై శాతం ప్రజలు నివసిస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మైతేయిలు. రాష్ట్రంలో వారి జనాభా దాదాపు 53 శాతం. దీంతో సహజంగానే రాజకీయాల్లో వారిదే ప్రాబల్యం. 60 సీట్ల అసెంబ్లీలో 40 స్థానాలు వాళ్లవే.కొండ ప్రాంతాల్లోని గిరిజనులైన కుకీలు, నాగాలకు ఎస్టీ రిజర్వేషన్‌ ఉండటం, మైదాన ప్రాంత గిరిజనులైన మైతేయిలకు ఎస్టీ రిజర్వేషన్‌ లేకపోవడం... కాలక్రమంలో రెండు వర్గాల మధ్య సఖ్యత లోపించడానికీ, సంఘర్షణకూ కారణం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాలు మరింతగా క్షీణించడానికి మణిపుర్‌ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పు కారణం అయింది. మణిపుర్‌ను రణపుర్‌గా మార్చేసింది.

 2023 మార్చి 27న షెడ్యూల్డు తెగల జాబితాలోకి మైతేయి తెగలను చేర్చేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు సిఫారసు చేయాలని మణిపుర్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై కుకీలు, నాగాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ వర్గంగా మైతేయిలదే రాజకీయంగా పైచేయిగా ఉందనీ, హిందువుల్లోని ఎస్సీ, ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను వారు ఇప్పటికే అనుభవిస్తున్నారనీ, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వటం సరికాదనీ అభ్యంతరం చెబుతున్నారు. మైతేయిలకు రిజ ర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారనీ, తమ ఉద్యోగాల వాటా తగ్గిపోతుందనీ ఆందోళన చెందుతున్నారు.

అయితే, మైతేయిల వాదన మైతేయిలకు ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగా, కుకీ ఆదివాసీల్లోని ముప్పైకి పైగా తెగలకు ఎస్టీలుగా ప్రభుత్వ గుర్తింపు ఉంది. తమకు ఆ గుర్తింపు లేని కారణంగా దేశంలోని ఎవరైనా వచ్చి తాముంటున్న ఇంఫాల్‌ లోయ ప్రాంతంలో భూమి కొనొచ్చుగాని... తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుక్కోవటానికి వీలులేకుండా పోయిందన్నది మైతేయిల వాదన. అంతేకాదు 1949లో భారత్‌లో కలవటానికి ముందు మైతేయిలను ఆదివాసీ తెగగానే గుర్తించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ హోదాను పునరుద్ధరించాలని మాత్రమే తాము కోర్టుకు విన్నవించుకున్నాం అని మైతేయి సంఘం అంటోంది. కేవలం రిజర్వేషన్ల కోసమే కాకుండా... సంస్కృతిని, భాషను, భూమిని, తమ సంప్ర దాయాలను కాపాడుకోవటం కోసం ఎస్టీలుగా గుర్తింపును కోరు తున్నామని కోర్టులో వాదించింది. మణిపుర్‌ హైకోర్టు ఈ వాదనలతో ఏకీభవించింది. 

హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందో ళనకు పిలుపు ఇవ్వటం, అది హింసాత్మకంగా మారటంతో ఆందోళన మంటలు రాష్ట్రంలో రాజుకున్నాయి. రెండు వైపులా మరణాలు సంభ వించాయి. చర్చిలు, దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇవేమీ మత కలహాలు కావు. భూమి హక్కుల విషయమై మొదలై, నేటికీ కొనసాగుతున్న ఘర్షణలు. అయితే మణì పూర్‌లో జరుగుతున్నవి మత ఘర్షణలు అని, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హిందువులు విధ్వంసానికి పాల్పడు తున్నారనే దుష్ప్రచారం సాగుతోంది.

గమనించాల్సి వాస్తవం ఏమి టంటే మైతేయి తెగల్లో అధిక సంఖ్యాక హిందువులతో పాటు, ముస్లింలు, క్రిస్టియన్‌లు; కుకీ నాగాల్లోనూ అధిక సంఖ్యాక క్రిస్టియన్‌లతో పాటు హిందువులు, ముస్లింలు ఉన్నారన్నది! మణిపుర్‌ తెగల మధ్య ఘర్షణలు మతాల మధ్య చిచ్చుగా కొన్ని పాశ్చాత్య దేశాలకూ, మన దేశంలోనే కొన్ని రాజకీయ పార్టీల వారికీ మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? ఎందుకంటే, ఎవరి స్వార్థ ప్రయో జనాలు వారివి. నిజానికి మత ఘర్షణలనేవి మణిపుర్‌ చరిత్రలోనే లేవు. ‘‘కుకీ, నాగా తెగలకు పరిపాలనలో స్థానం కల్పించిన చరిత్ర మైతేయిలది. మణిపురి ప్రజలకు మతోన్మాదం లేదు. 19వ శతాబ్దంలో రాచరిక పాలనలో హిందూమతం ఆధిపత్యం చలాయించిందన్నది నిజమే, కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. మరిక మతోన్మాదం ఎక్కడి నుంచి వచ్చింది?’’ అంటారు మణిపుర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ప్రియోరంజన్‌ సింగ్‌.

అయితే రెండు వేలకు పైగా చర్చిలను ధ్వంసం చేశారని కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలను వారికి ఏ క్రైస్తవ దేశాలు అందించాయో వారే చెప్పాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూసినా 100 దేవాలయాలతో పాటు రెండు వేల మైతేయి ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. మరి వీటిని ఏమంటారు? మత ఘర్షణలు అనేనా! మైతేయి  వర్గం ప్రయోజనాల కోసం ఏర్పాటైన కోకోమి ప్రతినిధి కె. ఓథాబాయ మాట్లాడుతూ, ‘‘మణిపుర్‌లోని సమస్యలు మతపరమైనవి కావు’’ అని స్పష్టం చేశారు. ఆ మాటను కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకు చెప్పేవారెవరు? ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలకు చెప్పేవారెవరు? ‘‘మణిపుర్‌లో మతం పేరుతో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు. జరుగుతున్నదాన్ని డైవర్ట్‌ చేసి మతపరమైనహింసగా చూపించడం ఇదే మొదటిసారి’’ అని స్వయంగా మణిపుర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేబబ్రత సింగ్‌ అన్నారు కదా!

బాధ్యత గల రాజకీయ నాయకులు ఎవరూ మణిపుర్‌లో జరుగు తున్న మతపరమైన దాడులు అని అనలేదు. అలాంటి ప్రచారానికి తావు కూడా ఇవ్వరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మణిపుర్‌కు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘మీరు క్రిస్టియన్‌ అయుండీ ఎందుకు మణిపుర్‌ క్రిస్టియ న్‌లను సమర్థించడం లేదు?’’ అని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో ఇలా ఒక మతం వారిని రెచ్చగొట్టే ప్రసంగాలను ఇస్తున్నారో ప్రత్యేకించి చెప్పే పని లేదు. 

– మాధవ్‌ శింగరాజు, సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement