యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. ప్రపంచంలో మహిళ లకు అత్యున్నతమైన గౌరవ స్థానాన్ని ఇచ్చిన ఏకైక సంస్కృతి సనాతన ధర్మం మాత్రమే. అయితే సమాజంలో కాలక్రమంలో వచ్చిన కొన్ని వికృతుల కారణంగా పలువురు మహిళలను భారంగా భావించడంతో దేశంలో భ్రూణహత్యలు పెరిగాయి. దీంతో మహిళల సంఖ్య క్రమంగా పడిపోవడం మొదలైంది. ఈ పరి ణామం సమాజంలో పలురకాల సమస్యలకు మూల హేతువుగా మారి, ఆందోళనకరంగా తయారైనా దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన పాలకులు ఈ సమస్య పరిష్కారానికి ఏ మాత్రం కృషి చేయలేదు.
అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో మహిళా చైతన్య కార్య క్రమాలు పెంచడంతో క్రమంగా పరిస్థితిలో మార్పు వస్తోంది. ‘బేటీ బచావో– బేటీ పడావో – కూతురిని కాపాడండి– కూతురిని చదివించండి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు దేశ ప్రజలు సానుకూలంగా స్పందించడంతో పరిస్థితిలో వేగంగా మార్పు వస్తున్నట్లుగా గణాంకాల ద్వారా రుజువవు తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య పెరగడం శుభ పరిణామం. మోదీ ఇచ్చిన ‘సెల్ఫీ విత్ మై డాటర్ – నా కూతురితో ఒక సెల్ఫీ’ పిలుపునకు దేశ ప్రజలు సానుకూలంగా స్పందించారు. కూతుళ్ళు లేని వారు, ఎంతోమంది తమ అన్నదమ్ముల కూతుళ్లతోనో, చిన్నాన్న, చిన్నమ్మ కూతుళ్ల తోనో సెల్ఫీని తీసుకొని ఒక ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించారు.
దేశంలో మహిళల సంఖ్య పెరగడమే కాకుండా వారిలో అక్షరాస్యతా శాతం పెరుగుతుండటం హర్షించ దగ్గ పరిణామం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడు దల చేసిన నివేదిక ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.–5) 2019–2021 ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జనాభా, శిశు జననాలు, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై ఆసక్తి కరమైన విషయాలు వెలువడ్డాయి. దీని ప్రకారం మహిళలు, పురుషుల నిష్పత్తి 1020:1000 మందిగా తేలడం హర్షణీయం. అంతకుముందు ఎన్.ఎఫ్. హెచ్.ఎస్.–3 ప్రకారం 2005–2006 కాలంలో ఈ నిష్పత్తి 1000:1000 ఉండగా, 2015–2016లో ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.–4 సర్వే చేసే నాటికి ఈ సంఖ్య క్షీణించి 991:1000కి పడిపోయింది. అయితే తగిన చర్యలు తీసుకోవడంతో ఈ సంఖ్య పెరిగింది. ఈ పరిణామం రాత్రికి రాత్రి సంభవించింది కాదు. ప్రణాళికా బద్ధంగాచేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా మాత్రమే సాధ్యమైంది.
ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా చైతన్య పరుస్తుండటంతో నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో దూసుకెళుతున్నారు. మహిళల్లో అక్షరాస్యత శాతం కూడా ఘణనీయంగా పెరగడంతో సివిల్ సర్వీసెస్ తదితర పోటీ పరీ క్షలతోపాటు ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా బాలికలు తమ సత్తా చాటుతున్నారు. రక్షణ రంగంలో చేరి దేశ సరిహద్దులను కాపాడుతూ కదన రంగంలోనూ దూసుకెళుతున్నారు. ‘సమాజంలో సగ భాగమైన మహిళలు’ అనేది మారిపోయి పురుషుల కంటే మహిళలు కొంచెం అధికులు అనే రోజులు వచ్చేశాయి.
అయితే పురుషులతో పలు రంగాలలో పోటీపడి ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో కూడా మహిళలపై దాడులు, అత్యాచారాల్లాంటి ఘటనలు ఇంకా జరుగుతుండటం శోచనీయం. ఈ విషయంలో మహిళల భద్రత గురించి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి తోడు రాష్ట్ర ప్రభు త్వాలు కూడా చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఈ దిశగా తల్లి దండ్రుల ఆలోచనా ధోరణిలోనూ, బాలికల వ్యవహార శైలిలోనూ, ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కోగలిగే శక్తి యుక్తులు, మానసికంగా, శారీరకంగా కలిగివుండ టంలోనూ మార్పు రావాలి.
వ్యాసకర్త: శ్యామ్ సుందర్ వరయోగి
బీజేపీ రాష్ట్ర నాయకులు
మొబైల్ : 98669 66904
మహిళలు... కొంచెం ఎక్కువ సమానం
Published Thu, Dec 9 2021 12:49 AM | Last Updated on Thu, Dec 9 2021 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment