అగ్నిపథ్ పథకంపై రాజకీయ దుమారం ఇక చాలంటూ... ‘ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన పథకాలకు రాజకీయరంగు పులమటం దేశ దౌర్భాగ్యం. ఇప్పుడు బాధాకరంగా తోచినా దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయనీ, దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకో వాల’నీ ప్రధాని మోదీ వివరించారు.
ఈ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని సైనికాధికార్లు స్పష్టం చేశారు. సైన్యం దేశ రక్షణ లక్ష్యంతో పని చేస్తుందనీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాదనీ సూటిగా చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రశ్నించటం సహజమే అని మరోసారి నిరూపించాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన వాటినే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించటం అవకాశవాదం. నిజానికీ పథకం 1989 నుంచి పెండింగులో ఉన్నదని అధికారికంగా చెప్పారు. బీజేపీ కూడా ఇలాగే వ్యవహరించింది కదా. దేశభక్తి పేరిట రాజకీయం తగదు. కపట రాజకీయాలకు దేశభక్తి ముసుగు పరిపాటి అయింది.
అధికార పార్టీల ఈ అవకాశవాదాన్ని స్వతంత్ర మేధావులు ఎత్తిచూపాలి; ప్రజలు తిరస్కరించాలి. రైళ్ళు, బస్సుల వంటి ప్రజల ఆస్తుల ధ్వంసం; ప్రయాణికుల పార్సెళ్ల దహనం... రేపు సైన్యంలో చేరాలనుకుంటున్న యువతరం చేయాల్సిన పనులేనా ఇవని వారిని మాత్రమే నిందిస్తే లాభం లేదు. కలుషిత రాజకీయాల పర్యవసానమే ఇది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? సెల్ టవర్సుని ధ్వంసం చేసే నక్సల్స్‌కీ, వివిధ పార్టీలు ప్రోత్సహిస్తున్న అరాచకత్వానికీ తేడా ఏముంది? కొన్ని అగ్రవర్ణ మూకలు గుజరాత్‌లో తమకు రిజర్వేషన్లు కావాలని చేసిన హింసాకాండ సందర్భంగా అన్ని పార్టీలు పాటించిన మౌనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరిట విధ్వంసం తాజా ఉదాహరణ! ఆందోళనంటే ఇలా, అలా చేయకపోతే ప్రభుత్వాలు స్పందించవు అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
గోరక్షణ పేరుతో మానవ హత్యలను ప్రోత్సహిస్తున్న వాతావరణంలో... కేవలం ఆ నిరుద్యోగ పేద యువకులు భవిష్యత్ పట్ల ఉన్న భయంతో పాల్పడిన హింసను నిందించగలమా? కఠినంగా శిక్షించాలని, వారికి ఆర్మీలో ఉద్యోగాలివ్వడం అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరో ఏదో తప్పు చేశారని చెప్పి, మర్నాడే బుల్డోజర్లతో వారి ఇళ్లను యూపీలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూల్చి వేసింది. తెలంగాణను నిందిస్తూ, ఇక్కడా బుల్డోజర్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. వారిని ఖండించకుండా కేంద్ర నాయకుల పరోక్ష మద్దతు! యధా రాజా తథా ప్రజా!
మన దేశరక్షణను మన అవసరాలకూ వనరులకూ తగిన రీతిలో నిర్వహించుకోవాలి. అమెరికాలో ఇజ్రాయెల్లోనూ ఇలాగే చేస్తున్నారంటూ... ప్రభుత్వమూ, జాతీయవాద అధికార పార్టీ అగ్నిపథ్‌ను సమర్థించటం విడ్డూరం. టెక్నాలజీ అవసరమే కానీ మానవ వనరులే ప్రధానంగా ఉన్న మన దేశానికి ఆయా విధానాల్ని తగిన రీతిలో అన్వయించుకోవడం అవసరమనేది గుర్తించాలి.
దేశరక్షణ కేవలం భారీ డిఫెన్స్ బడ్జెట్‌తో పటిష్టం కాజాలదు. బడ్జెట్, టెక్నాలజీ... రెండిటా నంబర్‌వన్ అయిన అమెరికా సైన్యం వియత్నాం, ఆఫ్గానిస్తాన్‌లో అధర్మ యుద్ధాల్లో ఘోర పరాజయం పొందింది. విదేశీ వ్యవహారాల్లో శాంతి లక్ష్యం, సరైన దౌత్యం లేకపోతే ఎవరికైనా అంతే. ఈ అన్ని సంగతులనూ దృష్టిలో పెట్టుకుని అన్ని పక్షాలూ అగ్నిపథ్ ఉచితానుచితాలను ఆలోచించాలి. (క్లిక్: కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి?)
- డాక్టర్ ఎం. బాపూజీ
సీఎస్‌ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment