జాతీయ సంక్షోభంగా నిరుద్యోగం | Unemployment Is National Crisis Guest Column By Subir Roy | Sakshi
Sakshi News home page

జాతీయ సంక్షోభంగా నిరుద్యోగం

Published Sat, Apr 2 2022 1:36 AM | Last Updated on Sat, Apr 2 2022 1:36 AM

Unemployment Is National Crisis Guest Column By Subir Roy - Sakshi

కోవిడ్‌  ప్రభావం వల్ల ఆర్థిక గమనం మందగించి, పేదరికం నుంచి మరింత దిగువకు పట్టు తప్పిన వారికీ, ఉద్యోగాలు కోల్పోయిన వారికీ నేరుగా డబ్బు అందివ్వడం ద్వారా వారి జీవన భద్రతను పరిరక్షించవచ్చనే వాదనపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అటువంటి చేయూత ఆదాయ కల్పన విస్తృతమైన పేదరికాన్ని స్థూలంగానైనా అరికడుతుంది. బీజేపీ ప్రభుత్వానికి సైద్ధాంతిక గురువుగా పేర్గాంచిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ తాజాగా నిరుద్యోగ సంక్షోభంపై ప్రతిపక్ష దృక్పథంతో తన గళాన్ని వినిపించింది! సంఘ్‌ అత్యున్నతస్థాయి విధాన నిర్ణయ మండలి అయిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ మహమ్మారి సృష్టించిన ఈ నిరుద్యోగ భూతాన్ని చూసీ చూడనట్లు వదిలేయకుండా, తక్షణం పరిహరించాలని తీర్మానించింది.

ఆర్థిక సమతుల్యతను కొనసాగించడం, తద్వారా ద్రవ్యోల్బణంపై గట్టి పట్టును కలిగి ఉండటం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు సాధించడం.. ప్రభుత్వ ఆర్థిక విధాన ప్రధాన లక్ష్యాలు. ఆర్థిక వ్యవస్థను స్థిరమైన మార్గంలో పట్టి ఉంచినట్లయితే భవిష్యత్తులో మౌలిక సదుపాయాల కల్పనకు ఆ మార్గం దృఢమైన హామీ అవుతుంది. కోవిyŠ  ప్రభావం వల్ల ఆర్థిక గమనం మందగించి, పేదరికం నుంచి మరింత దిగువకు పట్టు తప్పిన వారికీ, ఉద్యోగాలు కోల్పోయిన వారికీ నేరుగా డబ్బు అందివ్వడం ద్వారా వారి జీవన భద్రతను పరిరక్షించవచ్చనే వాదనపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అటువంటి చేయూత ఆదాయ కల్పన విస్తృతమైన పేదరికాన్ని స్థూలంగానైనా అరికడుతుంది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల బ్యాంకు ఖాతాలకే ప్రత్యక్ష ప్రయోజనాన్ని బదిలీ చేయడం వల్ల ఆ పరిశ్రమల జీవన ఛత్రం కింద రోజువారీ మనుగడ సాగిస్తున్న కార్మికుల ఉపాధిని నిరాటంకం చేయవచ్చు. అవసరమైతే ఇందుకోసం డబ్బును ముద్రించడం కూడా ఒక పరిష్కార మార్గమే. పైగా ఈ విధానం ద్రవ్యోల్బణానికి దారి తీయనిదిగా ఉంటుంది. ఎలాగంటే, వ్యాపారాలకు అందిన అర్థిక వనరులు చలామణిలో ఉంటూ, ఉత్పత్తికి చోదకం అయిన ‘సరఫరా గొలుసు’ను అవి నిరంతరాయం చేస్తాయి. ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ’ సమకూర్చిన డబ్బులో కొంత భాగం ప్రభుత్వం దగ్గర ఉన్న ఆహార కొనుగోళ్లకు వెళ్లడంతో సరఫరాలకు డిమాండు పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌.ఎం.సి.జి. (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూమర్‌ గూడ్స్‌– సత్వర వినియోగ వస్తువులు) కంపెనీలకు గిరాకీ లభిస్తుంది. 

‘ప్రతిపక్ష వాణి’ వినిపించిన ఆర్‌ఎస్‌ఎస్‌
మోదీ ప్రభుత్వానికి సైద్ధాంతిక గురువుగా పేర్గాంచిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) తాజాగా నిరుద్యోగ సంక్షో భంపై ప్రతిపక్ష దృక్పథంతో తన గళాన్ని వినిపించింది! సంఘ్‌ అత్యున్నతస్థాయి విధాన నిర్ణయ మండలి అయిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ ఇటీవలి సమావేశంలో ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ... ‘మహమ్మారి సృష్టించిన ఈ నిరుద్యోగ భూతాన్ని చూసీ చూడనట్లు వదిలేయకుండా, తక్షణం పరిహరించాలి’ అని తీర్మా నించింది. ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సృష్టించే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ కూర్చునే సమయం కాదిది. మనమే ఉద్యోగాలను సృష్టిం చాలి. మనమే పెట్టుబడులు పెట్టి కొత్తగా ఉత్పత్తి రంగాలకు ఊపిరి పోయాలి. మోదీ ప్రభుత్వపు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఆలోచన ఇందుకు తోడ్పడేదే అయినా, అది మరింత పదునెక్కవలసిన అవసరం ఉంది’ అని అఖిల భారతీయ ప్రతినిధి సభ స్పష్టం చేసింది.

‘భారత్‌ను స్వావలంబనగా మార్చేందుకు ఉద్యోగావకాశాలను ప్రోత్సహించవల సిన అవసరం’ అనే శీర్షికతో ఈ తీర్మానాన్ని రూపొందించారు. ఉద్యో గాలను సృష్టించేందుకు స్థానికంగా వ్యవసాయ ఆధారిత కార్యక్రమా లను చేపట్టవలసిన అవసరం ఉందని ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు రాంమాధవ్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ చాలా కాలంగా దీన్నే చేస్తోందనీ, అయితే తమకు మరింతమంది ఔత్సాహిక వ్యక్తులు అవసరమనీ ఆయన చెప్పారు.

విదేశీ పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టించవు
స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఒక సాంస్కృతిక సంస్థ. దేశ ఆర్థిక సమస్యలకు జాతీయ భావాలతో కూడిన పరిష్కారాలను వెదకుతుంటుంది. అయితే ఒక సంస్థగా తప్ప ఆర్‌.ఎస్‌.ఎస్‌. అనుబంధ సంస్థగా మంచ్‌కు స్వల్ప ప్రాముఖ్యం మాత్రమే నేడు ఉంది. మంచ్‌ స్వరం కూడా మంచ్‌కే ఒక అనుబంధ స్వరంలా మిగిలిపోయింది. ప్రభుత్వంలో ఆర్థిక ఆలోచనాపరుల కూటములుగా ఉన్న ‘నీతి ఆయోగ్‌’, ప్రధాని ఆర్థిక సలహా మండలి... మంచ్‌ నుంచి సలహాలు తీసుకుంటున్నదీ ఏమీ లేదు. మంచ్‌ ఆర్థిక జాతీయభావ ఆలోచనలు బీజేపీ విస్మరణకు కూడా గురవుతూనే ఉన్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయానికొస్తే, అవి పెద్దఎత్తున ఉద్యోగాలను సృష్టించగలవని ఎవరూ అనుకోరు. అవి కేవలం ఆర్థిక వనరులంతే. ఆ వనరులతో పాటు వచ్చే సాంకేతికత.

అంతవరకే. అయితే విదేశీ మారక నిల్వల్ని నిర్మించుకోడానికి అవి సహాయపడతాయి. ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాధికారానికి స్వేచ్ఛను ఇస్తాయి. ప్రయోజనకరమైన ఆర్థిక కార్యకాలపాలతో దేశాన్ని అనుసంధానం చేస్తాయి. ప్రత్యక్ష పెట్టుబడు లకు ప్రతికూలంగా మంచ్‌ ఏకాంశ దేశీయ ప్రణాళికతో ఏకీభవించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక ఉద్యోగాల సమస్య అన్నది మరొక విషయం. పాలక, ప్రతిపక్షాల దృక్పథాల మధ్య వ్యత్యాసానికి మనం ఇప్పుడు వద్దాం. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగాల నష్టాన్నీ, పర్యవసాన లేమినీ తన ప్రాధాన్యతల క్రమంలోని పైభాగంలో ఉంచదు. పేదలకు నేరుగా డబ్బిచ్చే ‘ప్రత్యక్ష ప్రయోజన బదలీ’ పథకం ఉంది. చిన్న వ్యాపారులకు రుణాలిచ్చే పథకాలు ఉన్నాయి. అయితే అవి ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపిం చనంత మేరకు మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ధరల పెరుగుదలను ప్రేరేపించనంత వరకే వాటిని ప్రయోగిస్తుంది. 

రూపాయే ఉంటే ఎవరికిస్తావు?
ఆర్థిక ప్రాధాన్యాలు, ఆర్థిక విధానాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని స్థితిలోకి వ్యవస్థను నెట్టేస్తే అప్పుడు స్పష్టమై, కచ్చితమైన ఎంపికలను నిర్ధారించుకోవాలి. ప్రఖ్యాత ఆర్థికవేత్త లియోనెల్‌ రాబిన్స్‌ దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆర్థికశాస్త్ర నిర్వచనాన్ని ఒక్కమాటకు కుదించేశారు. ‘‘ఆశలకు, కొరతలకు మధ్య ప్రత్యామ్నాయ ప్రయోజ నాలున్న ఒక సంబంధంగా మానవ ప్రవర్తనల్ని అధ్యయనం చేసేదే ఆర్థిక శాస్త్రం’’ అని అన్నారు! ఇవాళ భారత ప్రభుత్వం దగ్గర ఖర్చు చేయడానికి ఒకే ఒక రూపాయి ఉందనుకుంటే కనుక అది ఎవరికి వెళుతుంది? విద్యుదుత్పత్తి కర్మాగారానికా? లేక రైలు మార్గ నిర్మాణా నికా? ఇవేవీ కాకుంటే,  చిన్న తరహా పరిశ్రమకు కేటాయించి, అందు లోని కొద్ది మంది ఉద్యోగుల జీవనోపాధికి బాసటగా ఉంటుందా? నిజానికైతే... ధరలపై నియంత్రణ కోల్పోయి ఆందోళనలో ఉన్న ప్రభుత్వం రైల్వే లైనుకు, లేదంటే పవర్‌ ప్లాంటుకు ఆ రూపాయిని ఖర్చు చేస్తుంది.

ఆ పెట్టుబడి ఒక స్పష్టమైన రాబడి ఆస్తిని సృష్టిస్తుంది. దశాబ్దాల పాటు గానీ, అంతకంటే ఎక్కువ కాలం గానీ ఒక ప్రవా హంగా ఆదాయాన్ని కల్పిస్తుంది. మరి చిన్న వ్యాపారం సంగతేంటి? అది దివాళా తీయవచ్చు. లేదంటే మూసివేత. సరఫరా గొలుసులో తన పాత్రను పోషించడంలో, గుప్పెడు మంది ఉద్యోగుల జీవనో పాధిని కాపాడటంలో ఆ  వ్యాపారం విఫలం అవుతుంది. అయితే ఉద్యోగాలు కనుమరుగవకుండా చూసుకోవడం ద్వారా పేదరికంపై పోరాటం చేయడం అన్నది ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి. ఎందు కంటే నిధులు సమకూర్చడం వల్ల ఒనగూడే ప్రయోజనాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇచ్చి ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తాయి. ద్రవ్యోల్బణమూ ఉండదు. 

ఈ చర్చలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిరుపేద కార్మికుడి పక్షాన నిలుస్తోంది. నిరుపేదలకు ఉపాధిని కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యాంశం కావా లని సూచిస్తోంది. ‘‘మనం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. పెట్టిన ఈ తీర్మానం ప్రభుత్వ విధానాలకు సంబంధించినది కాదు. కోవిడ్‌ మహ మ్మారి ఒక సవాల్‌లా విసిరిన నిరుద్యోగ సమస్యను అధిగమించ డానికి దేశమంతటా జరగవలసిన ప్రయత్నాల గురించి’’ అని రాం మాధవ్‌ అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేల నుంచి ఈ విధమైన ఆర్‌.ఎస్‌.ఎస్‌. అభిప్రాయాలు వెలువడ టాన్ని గమనించాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ గ్రామాలకు (సెమీ–అర్బన్‌) జరిగిన వార్షిక వలసలపై ఆ సర్వే జరి గింది. సర్వే ఫలితాలను అనుసరించి నిరుద్యోగాన్ని ఒక సంక్షోభంలా ఆర్‌.ఎస్‌.ఎస్‌. పరిగణించింది. సంక్షోభ పరిష్కారానికి ప్రయత్నం జరగాలని గుర్తించింది. 


సుబీర్‌ రాయ్‌
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement