(సహ్రా కరీమీ సుప్రసిద్ధ అఫ్గాన్ చిత్ర నిర్మాత, దర్శకురాలు. ‘హవా’, ‘మర్యామ్’, ‘ఆయేషా’, ‘పర్లికా’, ‘అఫ్గాన్ విమెన్ బిహైండ్ ది వీల్’ వంటి పలు డాక్యుమెంటరీ చిత్రాలను ఈమె రూపొందించారు. అఫ్గాన్‌ను సాయుధ తాలిబన్లు కైవసం చేసుకొనక ముందు ప్రపంచానికి సహ్రా రాసిన కన్నీటి అభ్యర్థన ఇది.)
‘‘ప్రపంచంలోని అన్ని సినీ కమ్యూనిటీలకు, సినిమా అభిమానులకు నేనీ విన్నపం చేస్తున్నాను. నా పేరు సహ్రా కరిమి. నేను ఒక చిత్ర దర్శకురాలిని, ప్రస్తుతం అఫ్గాన్ ఫిల్మ్ జనరల్ డైరెక్టర్‌ని. ఇది 1968లో ప్రభుత్వ యాజమాన్యంలో వ్యవస్థాపితమైన సినిమా కంపెనీ. నా సుందరమైన ప్రజలను, ప్రత్యేకించి తాలిబన్ నుంచి చిత్ర నిర్మాతలను పరిరక్షించడంలో మీరు నాతో చేతులు కలుపుతారని విచ్ఛిన్నమైన హృదయంతో, ప్రగాఢ విశ్వాసంతో మీకు ఇలా విన్నవిస్తున్నాను.
గత కొన్ని వారాలుగా తాలిబన్లు దేశంలోని అనేక రాష్ట్రాలపై పట్టు సాధించారు. వారు మా ప్రజలను చంపేశారు. అనేక మంది పిల్లలను అపహరించారు. తాలిబన్ పురుషుల కోసం పిల్లలను బాలవధువుల్లాగా అమ్మేశారు. బిగుతు దుస్తులు ధరించినందుకు ఒక మహిళను పట్టపగలు హత్య చేశారు. ఒక మహిళ కళ్లకు గంతలు కట్టేశారు. మా ప్రియాతిప్రియమైన కమెడియన్లలో ఒకరిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. చరిత్రపై రాసే మా గొప్ప కవులలో ఒకరిని చంపేశారు. ప్రభుత్వ సాంస్కృతిక, మీడియా అధిపతిని కూడా వాళ్లు చంపేశారు. ప్రభుత్వంతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ హత్య చేస్తూ వస్తున్నారు. మాలో కొందరిని బహిరంగంగా ఉరి తీశారు. వందలాది, వేలాది కుటుంబాలను నిరాశ్రయులను చేశారు.
తమ తమ రాష్ట్రాలనుంచి పారిపోయి వచ్చిన కుటుం బాలు కాబూల్ లోని శిబిరాల్లో ఉంటున్నారు. ఎలాంటి పారిశుధ్య వసతులు లేని స్థితిలో ఉంటున్నారు. తాలిబన్లు ఈ శిబిరాలను కూడా లూటీ చేస్తున్నారు. పాలు లేని కారణంగా ఈ శిబిరాల్లోని శిశువులు చనిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మానవత్వానికి సంక్షోభ కాలంగా ఉంటోంది. కానీ ఇంత జరుగుతున్నా ప్రపంచం మౌనంగా ఉంటోంది. ఇది అన్యాయం అని తెలిసినప్పటికీ ఈ నిశ్శబ్దానికి, ఈ మౌనానికి అలవాటుపడుతూనే పెరుగుతూ వచ్చాం.
మా ప్రజలను ఇలా గాలికి వదిలేస్తూ నిర్ణయం తీసుకోవడం తప్పని మాకు తెలుసు. ఇలా ఉన్నపళాన సైనిక బలగాల ఉపసంహరణ చేపట్టడం మా ప్రజలకు ద్రోహం తలపెట్టడమే అవుతుంది. పశ్చిమ దేశాల కోసం అఫ్గాన్‌లు ప్రచ్ఛన్న యుద్ధం గెలిచినప్పుడు కూడా ఇలాగే జరిగింది. మా ప్రజలను అప్పుడూ గాలికి వదిలేశారు. ఆ క్షణంలోనే తాలి బన్ల చీకటి పాలనకు దారితీసింది. ఇప్పడు, మా దేశం ప్రత్యేకించి మా యువతరం అపార ప్రయోజనాలు పొందిన 20 ఏళ్ల తర్వాత మమ్మల్ని మళ్లీ గాలికి వదిలేయడంతో ఈ 20 ఏళ్లుగా మేం పొందిన ప్రయోజనాలన్నింటినీ కోల్పోతున్నాం.
మాకు మీ వాణి ఇప్పుడెంతో అవసరం. మీడియా, ప్రభుత్వాలు, ప్రపంచ మానవతావాద సంస్థలు కూడా చట్టబద్ధత ఎన్నడూ లేని తాలిబన్లతో ఈ శాంతి ఒప్పందంపై సౌకర్యవంతంగా మౌనం పాటిస్తున్నాయి. తాలిబన్లకు, చట్టబద్ధ పాలనకు ఏరోజూ సంబంధం లేదు. వీరికి గుర్తింపుని వ్వడం అంటే మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి ఇచ్చినట్లే అవుతుంది. చర్చలు జరిగే క్రమం పొడవునా తాలిబన్లు మా ప్రజలను పాశవికంగా హింసిం చారు. ఒక చిత్ర నిర్మాతగా నా దేశానికి నేను కష్టపడి సాధిం చిందంతా ఇప్పుడు కూలిపోయే ప్రమాదంలో పడిపోయింది. తాలిబన్లు అధికారం చేజిక్కించుకుంటే వాళ్లు మొత్తం కళను నిషేధిస్తారు. ఆ తర్వాత నన్నూ నాలాంటి ఇతర చిత్ర నిర్మాతలను తమ హిట్‌లిస్టులో చేరుస్తారు. వాళ్లు మహిళల హక్కులను లాగేస్తారు. మమ్మల్ని మా గృహాల నీడల్లోకి నెట్టేస్తారు. మా గొంతులు కూడా అంతే. మా వ్యక్తీకరణ మౌనంగా మారి పోతుంది. తాలిబన్లు అధికారంలోకి రాగానే పాఠశాలల్లోకి ఒక్క బాలికకు కూడా ప్రవేశం ఉండదు. ఇప్పుడైతే పాఠశాలల్లో 90 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారు.
అఫ్గానిస్తాన్‌లో మూడో అతిపెద్ద నగరమైన హెరాత్‌లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ నగరం తాలిబన్ల చేతిల్లోకి వెళ్లిపోయింది. ఈ ఒక్క నగరంలోనే 50 శాతం మంది అమ్మాయిలు యూనివర్సిటీల్లో చదువుతున్నారు. ఇవి ప్రపంచానికి పెద్దగా తెలీని మా మహిళలు సాధించిన అపార ప్రయోజనాల్లో కొన్ని. గత కొద్ది వారాల్లోనే తాలిబన్లు అనేక పాఠశాలలను నేలమట్టం చేశారు. దీంతో 20 లక్షలమంది బాలికలు పాఠశాలలకు దూరమైపోయారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని ప్రపంచం నాకు అర్థం కావడం లేదు. ఈ మౌనం కూడా నాకు అర్థం కావడం లేదు. నా దేశంకోసం నేను ఇక్కడే ఉండి పోరాడతాను కానీ ఒంటరిగా ఈ పోరాటాన్ని చేపట్టలేను. మీవంటి మిత్రుల అవసరం నాకు ఎంతగానో ఉంది. మాకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచం సహాయ హస్తం అందించేలా మాకు సహకరిం చండి. అఫ్గాన్‌లో ఏం జరుగుతోందన్న విషయంపై మీ దేశాలకు చెందిన అతి ముఖ్యమైన మీడియాకు తెలుపడం ద్వారా మాకు సహకరించండి. అఫ్గాన్ వెలుపల మా స్వరాలకు చోటు కల్పించండి.
తాలిబన్లు కాబూల్‌ని చేజిక్కించుకుంటే మాకు ఇంట ర్నెట్ సౌకర్యం లభించదు. ఎలాంటి కమ్యూనికేషన్ సాధనాలు కూడా మాకు అందుబాటులో ఉండవు. మీ దేశాల్లోని చిత్ర నిర్మాతలను, కళాకారులను మా స్వరం వినిపించేలా మాకు సహాయం చేయండి. ఇది అంతర్యుద్ధం కాదు. ఇది ప్రచ్చన్న యుద్ధం. ఇది మాపై బలవంతంగా రుద్దిన యుద్ధం. తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ఫలితమే ఇది. ఈ సత్యాన్ని మీ మీడియాలో వీలైనంత ఎక్కువగా షేర్ చేయగలరు. మీ సోషల్ మీడియా వేదికల్లో మాగురించి పోస్టు చేయగలరు.
ప్రపంచం మాకు ఇప్పుడు వెన్నుముక చూపించకూడదు. అఫ్గాన్ మహిళలు, పిల్లలు, కళాకారులు, చిత్ర నిర్మాతల తరపున మీ మద్దతు, మీ స్వరం మాకు ఎంతగానో అవసరం. మాకివ్వబోయే ఈ మద్దతు ప్రస్తుత సందర్భంలో మాకు అందే అతి గొప్ప సహాయంగా ఉంటుంది. అఫ్గానిస్తాన్‌ను ప్రపంచం వదిలేయకుండా దయచేసి మాకు సాయ పడండి.
కాబూల్‌ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి ముందే మాకు సహాయం చేయండి. మాకు పెద్దగా సమయంలేదు. రోజుల్లోనే అన్నీ ముగిసిపోవచ్చు. మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మీ స్వచ్ఛమైన హృదయాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను... ధన్యవాదాలు..’’
సహ్రా కరీమీ
Comments
Please login to add a commentAdd a comment