ఇది మనుషులు పట్టని అభివృద్ధి | Union Budget 2022 Disappointing Sc Sts And Middle Class Review Mallepally Lakshmaiah | Sakshi
Sakshi News home page

ఇది మనుషులు పట్టని అభివృద్ధి

Published Fri, Feb 11 2022 1:32 AM | Last Updated on Fri, Feb 11 2022 1:37 AM

Union Budget 2022 Disappointing Sc Sts And Middle Class Review Mallepally Lakshmaiah - Sakshi

రానున్న వందేళ్ల భారతావనికి మార్గం వేసేదని ఘనంగా చాటిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సరే... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా అందులో భాగమని ప్రకటించారు సరే... అయితే ఆచరణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవు. చేసినవి కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని గత నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. ఆ వర్గాల ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి.

ఢిల్లీ సర్కార్‌ బడ్జెట్‌ సమర్పణ జరిగి పోయింది. స్పందనలు, ప్రతిస్పందనలు హోరెత్తాయి. అధికార పక్షం శభాష్‌ అంటే, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కొంతమంది తటస్థంగా ఉండే విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు నిజాలు మాట్లాడితే పట్టించుకున్నవారు లేరు. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఇక ఆ తర్వాత అందరూ మరిచి పోతారు. మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకూ దాని ఊసు ఎత్తేవారుం డరు. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. విమర్శ లను పట్టించుకోరు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల బడ్జెట్‌ కేటాయింపులు చాలామంది విశ్లేషకులకు పట్టవు. 

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం యథావిధిగా కేటాయింపులు జరిపింది. నాకు తెలిసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేసిన కేటాయింపులు ఇవి కావని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం రెండు పైసలు ఇస్తే, ఈ సంవత్సరం మూడు పైసలు ఇచ్చి, మధ్యలో దానిని రెండున్నర పైసలు చేసి, ఖర్చు అంతకన్నా తక్కువ చేసి, చేతులు దులుపుకొంటారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆ కేటాయింపుల తతంగం చూస్తే అర్థమవుతుంది. 

కేంద్రంలో కూడా సబ్‌ప్లాన్‌ హెడ్‌ ఒకటి ఉంటుంది. అయితే దానిని పేరు మార్చారు. గతంలో బడ్జెట్‌లో ప్లాన్, నాన్‌ప్లాన్‌ అనే వర్గీకరణ ఉండేది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పరిచిన తర్వాత ప్లాన్‌ అనే పేరు లేదు. అందువల్ల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను, షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ కేటాయింపులు (అలోకేషన్‌ ఫర్‌ ద వెల్ఫేర్‌ ఆఫ్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌)గా పేరు మార్చారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లెక్కలు ఘనంగానే ఉన్నాయి. భారతదేశం మొత్తం బడ్జెట్‌ 39,44,909 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో షెడ్యూల్డ్‌ కులాలకు 1,42,342 కోట్ల రూపాయలుగా, షెడ్యూల్డ్‌ తెగలకు 89,265 కోట్లుగా నిర్ణయించారు. 
నిజానికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు కేటాయించా ల్సింది ఒక లక్షా 82 వేల 976 కోట్ల రూపాయలు. ఆ కేటాయించిన దానిలో కూడా ప్రత్యక్షంగా ఎస్సీలకు చేరే నిధులు 53,795 కోట్లు. ఈ కేటాయింపులు మొత్తం బడ్జెట్‌లో 37 శాతం మాత్రమే. మిగతా మొత్తంలో ఎస్సీలకు నేరుగా చేరేవి చాలా తక్కువ. దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖలకు అసలు కేటాయింపులే లేకపోవడం విచార కరం. అదేవిధంగా ఎస్టీలకు నిజానికి 98,664 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేటాయించిన మొత్తంలోనూ వారికి నేరుగా చేరేవి 43 వేల కోట్లు మాత్రమే.

కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అందరితో పాటు కేటాయిస్తారు. కానీ వాటి లెక్కలు, వివరాలు... ఎవరైతే ప్రయోజనం పొందాలో వారి వివరాలు ఏమీ ఉండవు. ఉదాహరణకు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద అమలు జరుగుతున్న ఫసల్‌ బీమా యోజనకు 2022–23 సంవత్సరానికి ఎస్సీలకు 2,667 కోట్లు, ఎస్టీలకు 1,381 కోట్లు కేటాయించారు. ఇవి కాకిలెక్కలు తప్ప నిజ మైన ప్రయోజనమేదీ వీటివల్ల లేదని, గత బడ్జెట్‌లపైన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. 

కాగ్‌ 2017లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయాలను చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. ‘‘ఎస్సీ, ఎస్టీ రైతుల ప్రయోజనం కోసం 2011–12 నుంచి 2015–16 వరకు 2,381 కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందిన వివరాలు లేవు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ మహిళా రైతుల కోసం శ్రద్ధ వహించాలని చేసిన సూచనను మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు.’’ అదేవిధంగా ఉన్నత సాంకేతిక విద్య కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు కూడా వినియోగం కాలేదని కాగ్‌ తెలియజేసింది. ఇప్పటికే ఐఐటీ సంస్థల్లో పీహెచ్‌డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అత్యల్పం. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో 75 శాతం, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 95 శాతం ఖాళీగా ఉన్నట్టు కాగ్‌ తన నివేదికలో తెలిపింది.  అదేవిధంగా పీజీ కోర్సులలో కూడా ఇదే విధమైన ఖాళీలు ఉన్నట్టు 2021లో కాగ్‌ నివేదిక స్పష్టం చేస్తున్నది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సఫాయి కర్మచారి సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వివరాలు కూడా బడ్జెట్‌  లెక్కల్లో లేవని కూడా కాగ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది.

కోవిడ్‌ సమయంలో సఫాయి కార్మికులు ఏ విధమైన సాహసం చేశారో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ల కోసం కేటాయించిన అరకొరా నిధులను కూడా సరిగ్గా వినియోగించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 2016–17లో స్వయం ఉపాధి కింద 9 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2017–18లో అయిదు కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 2020–21లో వంద కోట్లు కేటాయించామని గొప్పలకు పోయారు. అయితే అందులో ఖర్చు చేసింది కేవలం 16.60 కోట్లు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్‌మెంట్‌ కథా ఇదే. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. కేవలం బడ్జెట్‌లో అంకెలు చూపెడితే సరిపోదు. అందుకోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. 

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన సబ్‌ప్లాన్‌ చట్టం, మరిన్ని సానుకూల అంశాలతో 2017లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ యాక్ట్‌ వల్ల ప్రయోజనం చేకూరింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయోజనాలు అందాయా అంటే, లేదనే చెప్పాలి. కానీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చట్టం అమలులో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో భిన్నమైన పథ కాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీల కోసం నెలకొల్పి, నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాయి. కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తరహాలో సబ్‌ప్లాన్‌ చట్టం అమలులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోనూ ఈ చట్టం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. 

ఈ బడ్జెట్‌కు ఒక ప్రత్యేకత ఉందని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇది వందేళ్ళ భారత్‌కు మార్గంవేసే బడ్జెట్‌ అని చెప్పారు. భవిష్యత్‌ భారతావనికిది ఆరంభం అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు. అయితే ఆచ రణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. భవిష్యత్‌లో యువత ఎదుర్కోబోయే నిరుద్యోగం ఈ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా నిలవనుందనడంలో సందేహం లేదు. దీనికి ముందుగా బలవబో తున్నది ఎస్సీ, ఎస్టీలే.  డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టం. అందుకోసం ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. 

కోవిడ్‌ మహమ్మారి వల్ల చాలా రంగాల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మానవ రహిత అభివృద్ధి, రోబోలు, సాంకే తిక ప్రయోజనం ఉన్న అభివృద్ధి వైపు పారిశ్రామిక వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. దానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి కార్యక్రమం లేదు. కేవలం దేశ సంపదను పెంచి, నిజమైన సంపదగా ఉన్న మను షులను వదిలేస్తే, అది ఎటువంటి దేశాభివృద్ధి అవుతుందో నిపుణులు ఆలోచించాలి. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్‌’’ అన్న గురజాడ మాటలను హిందీలోకి అనువాదం చేసి, మన దేశాధినేతలకు ఎవరైనా వినిపిస్తేనైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి.

మల్లెపల్లి లక్ష్మయ్య  ,వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement