![The writer is Senior Editor Vijaya Babu about a daily news paper - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/5/sunna.jpg.webp?itok=RHHCG_gq)
ఆ పత్రిక కార్యాలయం అంతా సందడి సందడిగా ఉంది. ఇన్‌చార్జి క్యాబిన్‌లో నుంచి పొగలు సెగలు వస్తున్నాయి.బయట డెస్క్‌లో జర్నలిస్టు ధర్మారావు దిగాలుగా కూర్చుని ఉన్నాడు. అతని సహచరుడు లోకనాథం అతని దగ్గరకు వచ్చి, ‘ఏం బ్రదర్ డల్‌గా ఉన్నావ్? క్యాబిన్ నుంచి పొగలు సెగలు వస్తున్నాయి. బాస్ ఏమైనా తిట్టాడా?’ అని అడిగాడు.‘అంతేగా?’ అన్నాడు.‘ఎందుకయ్యా! రోజూ ఇలా. ఒకప్పుడు నువ్వు రాసే ఐటమ్స్ అంటే ఇటు పత్రికలోను అటు జనంలోనూ ఎంత హాట్ హాట్‌గా ఉండేవి? అంత చేయి తిరిగిన జర్నలిస్టువి, కాస్త మనసు కూడా చంపుకొని మసాలా వార్తలు రాశా వనుకో! నీ అనుభవానికి ఆ మసాలా తోడైతే వేడి వేడి మిరపకాయ బజ్జీల్లా ఉండవా నీ ఐటమ్స్? ఎందుకయ్యా! జర్నలిజం విలువలు, తొక్కా అంటూ నిన్ను నువ్వే పనిష్ చేసుకుంటావు? మనకు కావలసింది జీతం, ప్రశాంతంగా ఉండటం. సమాజం, నైతికత, బాధ్యత అంటూ పనికి మాలిన బిల్డప్పులు ఎందుకు? నేను రోజూ ఇలా చెబుతూనే ఉంటాను, నువ్వు మాత్రం మనసు మార్చుకోక తిట్లుతింటూనే ఉంటావు. ఇంతకీ అసలు ఏం జరిగింది?’ అడిగాడు లోకనాథం.
‘గాంధీనగర్‌లో ఒక మానవీయ కోణానికి సంబంధించి మంచి స్టోరీ రాశాను. అది తీసుకెళ్లి ఇస్తే నా మొహం మీద విసిరేసి, ఇప్పుడు ఈ స్టోరీలు ఎవడికి కావాలి? ఆ రోజులు పోయాయని ఎన్నిసార్లు చెప్పను? ఇప్పుడు కావాల్సిందంతా స్పైసీ... ‘సాగర సంగమం’ సినిమాలో స్టెప్పులు కావాలి... ఆవృతాలు, ఆవులు, గేదెలు ఎవడికి కావాలి అన్నట్టుగా, నామీద ఇంత ఎత్తున ఎగిరేడు’ గద్గద స్వరంతో చెప్పాడు ధర్మారావు. ‘మరి నేను చెప్పేది అదే. తెలివితేటలు ఉండ గానే సరిపోదు. కాస్తంత లౌక్యం కూడా కావాలి బతకాలంటే. సరే సరే నాకు టైం అయిపోతుంది’ అంటూ లోకనాథం కేబిన్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. పొగలు సెగలు కక్కుతున్న ఇన్‌చార్జి చింపిరి జుత్తుతో సిగ రెట్ల మీద సిగరెట్లు తాగుతూ కనిపించాడు. ‘రావయ్యా రా! నీ కోసమే చూస్తున్నా. బ్యానర్ స్టోరీ రెడీ అయిపోయింది. సెకండ్ ఐటమ్ ఏం వేద్దామా అని చూస్తున్నాను. టైం అయిపోతూ ఉంది. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వే మైనా వండుకొచ్చావా?’ ఆత్రంగా అడిగాడు ఇన్‌చార్జి.
‘మీరేం కంగారు పడకండి సార్! నేను ఉన్నాగా? చిల్లీస్ చికెన్, చికెన్ 65, చైనీస్ నూడుల్స్... ఏమైనా సరే అరగంటలో వండి వార్చేస్తా? ఇప్పుడు మన పత్రికతో ఏ డ్రైనేజీ గానీ, మూసీ నది గానీ పోటీ పడలేవు. మీకెందుకుకంగారు? ఇదిగోండి ఇది చూడండి. ఇది నా వంటకం కాదు గాని ఒక తెనాలి అవాకులు చవాకులు. భలే గమ్మత్తుగా ఉన్నాయి ఆరోపణలు’ అంటూ చేతిలో ఉన్న ప్రింట్ అవుట్ అందించాడు.సీరియస్‌గా ఐటెం చదవడం మొదలు పెట్టాడుఇన్‌చార్జి.
హెడ్డింగ్ చూశాడు: ‘సజ్జలకే 140 కోట్లు.’
♦ ‘ప్రభుత్వ సలహాదారులకు 680 కోట్లు వ్యయం.
♦ 89 మంది సలహాదారులకు అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా?
♦ నాదెండ్ల మనోహర్ ధ్వజం
ఇన్‌చార్జి ముఖంలో టెన్షన్ చెరిగిపోయి పెదాల మీద చిరునవ్వు మొదలైంది.‘ఇదీ ఐటమ్ అంటే.. ధర్మారావు గాంధీనగర్‌లో పేదల బతుకులు అది ఇది అంటూ చెత్త ఐటమ్ తెచ్చాడయ్యా! దాంతో నా మూడంతా పాడైపోయింది. ఇదీ మసాలాఅంటే. అవును గానీ మనలో మాట, ఒక్క సజ్జలకే 140 కోట్లు అంటాడు ఏంటయ్యా?
సలహాదారులకి 680 కోట్లా? అసలు అంత బడ్జెట్టే లేదు కదయ్యా!ఈ తెనాలి బుర్రేమైనా చెడిపోయిందా? లేదంటే లోకేష్‌కి పోటీగా తయారవుదాం అనుకుంటున్నాడా?’ అడిగాడు ఇన్‌చార్జి.‘‘అదేం కాదు సార్! తెనాలి నుంచి పోటీ చేయా లనుకుంటున్నాడు. తెనాలిలో తనకు టిక్కెట్ వస్తుందో రాదో అనేది ఒక టెన్షన్. తీరా టికెట్ దక్కించుకున్నా అసమ్మతి సెగతో మళ్ళీ ఓడిపోతానేమో అని భయం పట్టు కుంది. దాంతో పూర్తిగా ‘తెనాలి’ అయిపోయాడు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.’’
‘నిజమేనయ్యా! కానీ ఐదేళ్లకి కోటీ నలభై లక్షలు కాబోలు. దాన్ని అర్థం చేసుకోలేక 140 కోట్లనేసినట్టున్నాడు. బడ్జెట్లో లేని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా సలహా దారులు ఉన్నది 46 మందేగా 89 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే... నువ్వే చెప్పావుగా? అతగాడు మైండ్‌చెడి తెనాలి అయిపోయాడని. సరే ఏదైతే అదవుతుంది? ఈరోజు మనకి చికెన్ 65 లాంటి మసాలా స్టోరీ దొరికింది. పాఠకులు ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు? మన పత్రికకు ఇంగువ కట్టిన గుడ్డ లాంటి ఇమేజ్ ఉండనే ఉందిగా! బాస్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు. తిట్టుకుంటే జనాలు ‘తెనాలి’ని తిట్టుకుంటారు.
సరే సరే నువ్వు మాత్రం ఈ మూడు నెలలు మూసీ నది మన పేపర్‌ని చూసి కుళ్లుకునేంత మురుగు స్టోరీలు ఇవ్వాలి సుమా!’ అంటూ స్టోరీకిరంగులు హంగులు అద్దే పనిలో పడ్డాడు ఇన్‌చార్జి. ‘తప్పకుండా సార్! ఇక నేను వస్తా’ అంటూ లోకనాథం క్యాబిన్ తలుపు తీసుకొని చిద్విలాసంగా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. ఒక మూల దీనంగా కూర్చున్న సిసలైన జర్నలిస్టు ధర్మారావు వైపు జాలిచూపు విసిరేసి, ‘బాబుని చూసైనా నేర్చుకోడు జాబు నిలబెట్టుకోవాలని ఆలోచించడు’ అని తనలో తను సణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
- వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
- పి. విజయ బాబు
Comments
Please login to add a commentAdd a comment